-
-
Home » Andhra Pradesh » West Godavari » today ugadi festival
-
చేదు తెచ్చిన శార్వరి.. !
ABN , First Publish Date - 2020-03-25T10:48:23+05:30 IST
నేడు ఉగాది. తెలుగు వారి సంవత్సరాది. శ్రీ వికారి నామ సంవత్సరం ముగిసి.. శార్వరి

నేడు ఉగాది పర్వదినం
కరోనా దెబ్బకు కళా విహీనం
వినిపించని పంచాంగ శ్రవణాలు
దేవాలయాల్లో పూజలకే ప్రాధాన్యం
ఇళ్లకే పరిమితం కానున్న ప్రజలు
వెలవెలబోయిన మార్కెట్లు
వాయిదా పడుతున్న పెళ్లిళ్లు.. జాతరలు
ఏలూరు సిటీ/పాలకొల్లు/భీమవరం టౌన్, మార్చి 24 : నేడు ఉగాది. తెలుగు వారి సంవత్సరాది. శ్రీ వికారి నామ సంవత్సరం ముగిసి.. శార్వరి నామ సంవత్సరం మొదలయ్యే శుభదినం. ఎక్కడా కవి సమ్మేళనాలు.. పంచాంగ శ్రవణాలు, ఆలయ దర్శనాలకు ఏర్పాట్లు లేవు. ఇంటికే పరిమితమై.. కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుకను జరుపుకోవాలి. కరోనా రక్కసి కరాళ నృత్యానికి మార్కెట్‌లో సందడి లేదు. కొత్త బట్టలు లేవు. మామిడి తోరణాలు, వేప పువ్వు సేకరణ ఏమీ కనిపించడం లేదు. అందరిలోనూ ఒకటే ఆందోళన. నలుగురు కూర్చుని నవ్వుకునే ఆనందంగా జరుపుకునే పండుగ.. బోసి పోనుంది. కోకిల గానామృతం చెవిని సోకదు. ఎల్లడ విరిసే నవోదయం అగుపించలేదు.
వేప పువ్వుల వగరుదనం.. మామిడి పిందెల పులుపుదనం.. చెరకు గడల తియ్యదనం.. అరటి పండ్ల అమృతదనంతో సంబరాలు తెలుగు లోగిలిలో మాయమయ్యాయి. జాతరలు లేవు. ఎడ్ల పందాలు లేవు. గ్రామాలలోని ఆలయాల్లో భవిష్యత్‌ను ముంగిట నిలిపే పంచాంగ శ్రవణం వినే భాగ్యం కనిపించడం లేదు. అంతటా ఒకటే.. అందరిలోనూ ఒకటే భయం కరోనా. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇంటికే పరిమితం కానున్నారు. సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో కొన్ని కార్యక్రమాలకు స్వస్తి పలుకుతున్నారు. వైరస్‌ను నివారించాలంటే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వాతావరణంలో ఉగాది ప్రారంభం కానుంది. ప్రసిద్ధ దేవాలయాల్లో దర్శనాలు రద్దు కావటంతో సాధారణ పూజలు మాత్రమే నిర్వహిస్తున్నారు. భీమవరంలో ఉగాది పచ్చడికి కావలసిన వస్తువులను కొనుగోలు చేసేందుకు మావుళ్లమ్మ గుడి ప్రాంతం కిటకిటలాడేది. ఈసారి హడావిడి లేదు.
ప్రజలకు బయటకు రాకూడదనే హెచ్చరికలతో ప్రజలు అంతగా ఆసక్తి చూపటంలేదని అంటున్నారు. చాలా మంది వ్యాపారస్తులు ఉగాది రోజున వ్యాపారంలో దస్ర్తాలను రాసుకుంటారు. వ్యాపార సంస్థల్లో ముహుర్తానికి పూజలు చేయించుకుని శ్రీకారం చుట్టడం ఆనవాయితీ ఈసారి లాక్‌డౌన్ కారణంగా అన్ని మూసివెయ్యటంతో దస్త్రాలకు సంబందించి పూజలు ఇళ్ళల్లోనే నిర్వహించుకునేలా ఏర్పాటుచేసుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలిం చకపోవడంతో ఈ నెల 26, 29 తేదీల్లో జరగాల్సిన పెళ్లిళ్లను వారు వాయిదా వేసుకుంటున్నారు.