కుళ్లుతున్న వరి

ABN , First Publish Date - 2020-10-27T09:20:36+05:30 IST

వర్షాలు, వరదలతో సార్వా సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు.

కుళ్లుతున్న వరి

ముంపు ప్రభావంతో సార్వా విస్తీర్ణం తగ్గినట్లే

మిగిలిన ఆయకట్టులో దిగుబడిపై తీవ్ర ప్రభావం


భీమవరం రూరల్‌, అక్టోబరు 26 : వర్షాలు, వరదలతో సార్వా సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. ముంపుతో కుళ్లిన పంట ఈ సీజన్‌లో లేనట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 12వేల ఎకరా ల్లో సార్వా సాగు చేపట్టగా ముంపుతో 2500 ఎకరాలుపైగా పూర్తిగా దెబ్బ తింది. దెబ్బతిన్న ఆయకట్టులో మాసూళ్లు లేనట్లేనని రైతులు చెబుతున్నారు. మిగిలిన ఆయకట్టులో తెగుళ్ల తాకిడికి దిగుబడి తగ్గిపోయి నష్టాలు మూట గట్టుకుంటామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముడుత, ఎండాకు తెగులు, పొడ తెగులు వ్యాపించిందన్నారు. ఎకరాకు 20 బస్తాలలోపు దిగుబడి ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు. 


వీడని ముంపు

పాలకోడేరు: మండలంలోని మోగల్లు ఆయకట్టులో వరి చేలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మోగల్లు, గుత్తులవారిపాలెం ప్రాంతాలలో గోస్తనీపొంగి వరి చేలు నీటమునిగాయి. వర్షాలు తగ్గిన తర్వాత చేలు తేరుకుంటాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. మురుగుబోదెల్లో నీరు ఎక్కడకు వెళ్లకపోవడంతో రైతులు పంటపై ఆశ వదులుకున్నారు.


ఎకరాకు రూ.15వేలకు పైగా నష్టం

పెనుమంట్ర: వర్షాలు, ముంపుతో రైతులకు ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం వాటిల్లిందని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. మాముడూరులో నీట మునిగిన వరి చేలను సోమవారం ఆయన పరిశీలించారు. జిల్లాలో 20 మండలాల్లో వరి చేలకు తీవ్రనష్టం వాటిల్లింద న్నారు. నెల రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో ముంపు బాధాకరమ న్నారు. పంట నష్టం అంచనా వెయ్యాలని, కౌలు రైతుకు పరిహారం అందిం చాలన్నారు. దాళ్వా పంటకు ఇన్‌పుట్‌ సబ్సిడీపై ఎరువులు, పురుగుమందులు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కేతాగోపాలన్‌, నేతల చిత్త రంజన్‌, బొక్కా రామకృష్ణ, బొక్కారాంబాబు, బొక్కాదానేశ్వరరావు, పెచ్చెటి అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T09:20:36+05:30 IST