మద్యం అక్రమ రవాణాకు రాజమార్గం నెర్సుగూడెం

ABN , First Publish Date - 2020-10-07T10:37:25+05:30 IST

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నెర్సుగూడెం మద్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అశ్వారావు పేట నుంచి కొందరు మద్యాన్ని ఈ దారిలో తీసుకువస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు.

మద్యం అక్రమ రవాణాకు రాజమార్గం నెర్సుగూడెం

జీలుగుమిల్లి, అక్టోబరు 6: ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నెర్సుగూడెం మద్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అశ్వారావు పేట నుంచి కొందరు మద్యాన్ని ఈ దారిలో తీసుకువస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. నిఘా కట్టుదిట్టం చేసినట్లు అధికారులు చెబుతున్నా చెక్‌పోస్టు సిబ్బంది కన్నుగప్పి రాత్రి వేళల్లో బస్తాల్లో మూట కట్టి తరలిస్తున్నారు. మరోవైపు పోలీసు సిబ్బందిలో ఒకరు నెర్సుగూడెంలో భారీస్థాయిలో మద్యం నిల్వలు పెట్టి మధ్యవర్తుల ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.


ఇక్కడ మద్యం తరలించే వారిని పట్టుకుని కేసులు నమోదు చేయకుండా మద్యం తీసు కుని వదిలేస్తున్నట్టు సమాచారం. చెక్‌ పోస్టు వద్ద పగలు పటిష్టంగా విధులు నిర్వహించినా రాత్రి వేళల్లో జరిగే చీకటి వ్యాపారం పెరుమాళ్లుకే ఎరుక. సరిహద్దు ప్రాంతం నెర్సుగూడెం, కామయ్యపాలెం, రాచన్నగూడెంలో విధులు నిర్వహించేం దుకు పోటీ పడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నెర్సుగూడెం పరిసర పొలాలు భూవివాదంలో ఉండడంతో గతంలో ఇక్కడ నివసించే కొందరు రైతులు ఇటీవల అశ్వారావుపేట(తెలంగాణ)కు మకాం మార్చేశారు. దీంతో వారు నివాసం ఉండే ఇళ్లన్నీ ఖాళీ అయ్యాయి.


దీంతో అక్కడ ఒక ఇంట్లో పోలీస్‌ సిబ్బంది ఒకరు, మరో ఇంట్లో రెవెన్యూ శాఖలో పని చేసే సిబ్బంది నివాసం ఉంటున్నారు. దీంతో ఆ ప్రాంతం వైపు ఇతరులెవరూ కన్నె త్తి చూసే వీలులేదు. దీంతో అక్రమాలకు అడ్డాగా మారినట్లు సమీప ఉదయ్‌ భాస్కర్‌ కాలనీవాసులు చెబుతున్నారు.  కామయ్యపాలెం, అంకంపాలెం మీదుగా బుట్టాయగూడెం అటు నుంచి జంగారెడ్డిగూడెంకు వెళ్లే కొందరు ఈ దారిని ఎంచు కుంటున్నారు. కొందరు బైక్‌లపై కళాశాలకు వెళుతున్నట్టు ఇద్దరిద్దరు కలిసి బ్యాగ్‌లతో మద్యం తరలిస్తున్నారు. బయట వ్యక్తులకు నెర్సుగూడెం తెలియకున్నా ఇటీవల కరోనాతో ఈ ప్రాంతం అక్రమార్కులకు నోటెడ్‌ అయ్యింది.


చివరికి చెక్‌ పోస్టు ఏర్పాటుచేసిన ప్రాంతం భద్రత లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి వేళల్లో సైతం ఈ ప్రాంతంలో ఒకరిద్దరు సిబ్బంది ఉండడం, సరైన భద్రత లేకపోవడంతో అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ప్రాణభయంతో చూసీ చూడనట్లు వదిలేసే సందర్భాలు లేకపోలేదు. సరిహద్దులో అక్రమాలు తేల్చేందుకు నిఘా విభాగం పోలీసులు ఆరా తీశారు. దీనిపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

Read more