గోదారి లాక్‌డౌన్‌!

ABN , First Publish Date - 2020-10-04T07:42:40+05:30 IST

రాష్ట్రంలోనే నరసాపురంలోని మాధవాయిపాలెం రేవు అతిపెద్దది. ఈ రేవు ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రెండు కోట్లుపైనే ఆదాయం లభిస్తుంది.

గోదారి లాక్‌డౌన్‌!

తెరుచుకోని  మాధవాయిపాలెం రేవు 

ఆరు నెలలుగా తీవ్ర ఇబ్బందులు 

ప్రయాణికుల నరకయాతన  

లప్రభుత్వానికి రూ. కోటిపైనే నష్టం


 నరసాపురం, అక్టోబరు 3 : రాష్ట్రంలోనే  నరసాపురంలోని మాధవాయిపాలెం రేవు అతిపెద్దది. ఈ రేవు ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రెండు కోట్లుపైనే ఆదాయం లభిస్తుంది. నిత్యం ఎనిమిది నుంచి పది వేల మంది ప్రయాణికులు పంటు, పడవలపై  తూర్పు, పశ్చిమ జిల్లాల ఽమధ్య రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన మాధవాయిపాలెం రేవు లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నెలాఖరున మూతపడి ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ఇటీవల ప్రకటించిన అన్‌లాక్‌ 5.0లో కూడా దీనికి మోక్షం లభించలేదు.  రేవు చరిత్రలో రోజుల తరబడి రాకపోకలు నిలిచిన దాఖలాలు లేవు.


ఈ సారి ఆరు నెలలుగా బంద్‌ అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పు నుంచి పశ్చిమకు రావాలన్న.. ఇటు నుంచి సఖినేటిపల్లికి వెళ్లాలన్నా 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి చించినాడ మీదుగా వెళ్లాల్సి వస్తుంది. అత్యవసర సమయంలోనూ ఇదే పరిస్థితి. సరిహద్దున ఉన్న తూర్పు లంక గ్రామాలు విద్యా, వైద్యం, నిత్యావసరాలకు నరసాపురం పట్టణం మీదే ఆధారపడతారు. ఇటు రైతులు, పాల వ్యాపారులు కూడా లంక గ్రామాల నుంచి సరుకులు తీసుకొచ్చి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోవడంతో వీరంతా ఇబ్బందులు పడుతున్నారు.


దీనిపై అధికారులు, నేతలను ఎవరిని అడిగినా ఒకటే సమాధానం.. మా చేతిలో ఏమి  లేదు.. జిల్లా అఽధికారులే నిర్ణయం తీసుకోవాలంటూ దాటవేస్తున్నారు. దీంతో ఎవరిని కలసి తమ గోడు వెళ్లగక్కుకోవాలో తెలియక అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రేవు నిత్యం రద్దీగానే ఉంటుంది. దీనిలో భాగంగానే గడచిన పదేళ్లలో ఆదాయం రూ. 1.50 కోట్లు నుంచి రెండు కోట్లు వరకూ పెరుగుతూ వచ్చింది. 2017లో రూ.1.64 కోట్లు 2018లో రూ.2 కోట్ల ఐదు వేలు, 2019లో రూ. 1.87 కోట్లు, 2020లో రూ. 2.10 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాది కొందరు పాట దారులు కోర్టును ఆశ్రయించడంతో వేలం పాట పెండింగ్‌లో పడింది. ఏప్రిల్‌ నుంచి అధికారులే రేవును నిర్వహించాలని సన్నద్ధమవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ వచ్చింది. ఆ తరువాత కొన్ని రాకపోకలకు మినహాయింపులు వచ్చినా.. నేవిగేషన్‌కు మాత్రం అనుమతి రాలేదు. ఇటు రేవు ఆరు నెలలుగా మూత పడడంతో  ప్రభుత్వ  ఖజానాకు సుమారు రూ. కోటిపైనే ఆదాయానికి గండి పడింది. 


త్వరలో నిర్ణయం తీసుకుంటాం :   ప్రసాద్‌యాదవ్‌, ఎంపీడీవో

 త్వరలో రేవుకు సంబంధించి ఉభయగోదావరి జిల్లాల జాయింట్‌ కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ తరువాత రాకపోకలపై నిర్ణయం తీసుకుంటాం.

Updated Date - 2020-10-04T07:42:40+05:30 IST