కరోనా భయానికి ముగ్గురు బలి

ABN , First Publish Date - 2020-09-14T10:35:05+05:30 IST

కరోనా భయం.. మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భార్యకు కరోనా సోకడంతో తమ ఆలనా పాలనా చూసే వారు లేరని ..

కరోనా భయానికి ముగ్గురు బలి

 వేలివెన్నులో కాల్వలోకి దూకిన వృద్ధ దంపతులు.. 

  భార్య మృతదేహం లభ్యం.. దొరకని భర్త ఆచూకీ

 గుడిపాడులో కరోనాను జయించి..మానసిక వేదనతో ఆత్మహత్య

 ఇంటికొచ్చిన పది గంటల్లో ఆక్సిజన్‌ అందక బాధితుడు మృతి


తణుకు/పెదపాడు, సెప్టెంబరు 13 : కరోనా భయం.. మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భార్యకు కరోనా సోకడంతో తమ ఆలనా పాలనా చూసే వారు లేరని భావించిన ఆ వృద్ధ దంపతులు బలవన్మరణానికి ప్రయత్నించి కాల్వలోకి దూకేశారు. భార్య మృతదేహం లభ్యం కాగా, భర్త ఆచూకీ దొరకలేదు. మరో ఘటనలో కరోనా బారినపడి కోలుకున్న మరో వృద్ధుడు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన వృద్ధ దంపతులకు పిల్లలు లేరు. ఇంతలో ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని వారు తీవ్ర కలత చెందారు. చనిపోవాలని నిర్ణయించు కున్నారు.


ఆదివారం ఉదయం వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వున్న నరసాపురం కాలువలో దూకారు. స్థానికులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోయింది. వృద్ధురాలు(65) మృతదేహం లభ్యమైంది. భర్త (70) ఆచూకీ తెలియాల్సి ఉంది. ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో పెదపాడు మండలం గుడిపాడుకు చెందిన 61 ఏళ్ల వ్యక్తికి గత నెలలో కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఏలూరులోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలిం చగా చికిత్స అనంతరం ఈ నెల 11న ఇంటికి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. అప్పటి నుంచి ఆయన కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఎవరితో కలవలేక మాన సికంగా కుంగిపోయాడు. ఆదివారం తెల్లవారుజాము ఇంటి పక్కనే వున్న మంచి నీటి ట్యాంకుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై జ్యోతిబస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇంటికొచ్చిన పది గంటల్లో..

ఆకివీడు : కరోనాకు చికిత్స పొంది ఇంటికి వచ్చిన పది గంటల్లో ఆక్సిజన్‌ అందక ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఆకివీడు శివాలయం స్కూల్‌ సమీపంలో నివసిస్తున్న వృద్ధుడికి ఈ నెలలో కరోనా రావడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్ళారు. పది రోజుల తర్వాత నెగిటెవ్‌ రావడంతో శనివారం ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఆక్సిజన్‌ అందక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - 2020-09-14T10:35:05+05:30 IST