ఒక్కటి కాదు.. మూడే
ABN , First Publish Date - 2020-08-01T10:59:59+05:30 IST
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దుకు గవర్నర్ ..

వికేంద్రీకరణకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం
నెగ్గిన జగన్ సర్కార్ పంతం
సీఆర్‌డీఏ రద్దు
పశ్చిమపై తీవ్ర ప్రభావం.. ప్రతిపక్ష తెలుగుదేశం ఆగ్రహం
ఇదో దుర్దినమన్న సీతారామలక్ష్మి
రాజకీయ కోణమన్న బీజేపీ
మూడు రాజధానులను స్వాగతించిన వైసీపీ
(ఏలూరు-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో అమరావతి రాజధాని చెదిరిపోనుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశంసహా మరికొన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా చివ రకు ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. ఇప్పటికే రాజధాని పేరిట రాష్ట్రంలో వివిధ వర్గాలు ఒకింత అలజడి, మరింత అసం తృప్తి వ్యక్తం చేసినా ప్రభుత్వ నిర్ణయం ముందు బేఖాతరైంది. రాజధానికి అత్యంత చేరువుగా ఉన్నామన్న భావనలో ఉన్న జిల్లావాసుల ఆశలు గల్లంతయ్యాయి. తెలుగుదేశం ఈ చర్యను ఒక దుర్ధినంగా అభివర్ణించింది. రాజధాని అమరావతి తర్వాత సీఆర్‌డీఏ ఏర్పాటైంది. దీని సరిహద్దు పరిధి మన జిల్లాకు కూత వేటు దూరానికి వచ్చి ఆగింది. తగ్గట్టుగానే ఈ ప్రాంతంలోనూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి.వ్యవసాయ భూములు హాట్ కేకుల్లా మారిపోయాయి. ఎడాపెడా రియల్ ఎస్టేట్‌లు వెలిశాయి. ఏలూరులోనూ పదుల సంఖ్యలో బహుళ అంతస్తులు వెలిశాయి. షాపింగ్ మాల్స్ వచ్చాయి. ఇదంతా రాష్ట్ర రాజధాని అమరావతి ప్రభావమే. వైసీపీ అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం పరిస్థితి మారింది. అమరావతి స్థానంలో పాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ప్రక్రియను తెరపైకి తెచ్చింది.
దీనిని తెలుగు దేశం సహా మిగతా పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కొంద రు న్యాయస్థానాలను ఆశ్రయించినా.. ప్రభుత్వం వికేంద్రీకరణకే కట్టుబడింది. దీనికి తగ్గట్టుగానే రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ వికేం ద్రీకరణకు, సీఆర్‌డీఏ రద్దుకు ఆమోదముద్ర వేయడంతో రాజధా ని విషయంలో భిన్నంగా స్పందిస్తున్న వారంతా అవాక్కయ్యారు. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు షాక్ తిన్నారు. తమ పార్టీ వ్యతిరేకించిన అంశాలకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై తెలుగుదేశం విస్మయం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాలని యోచిస్తోంది.
పోరాటానికి సిద్ధం కావాలి : టీడీపీ
‘వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఎందుకింత ఆత్రుత, తొందర. రాష్ట్ర రాజధాని అమరావతికి వేలాది ఎకరాలను స్వచ్చంధంగా ఇచ్చిన రైతుల పరిస్ధితి ఏమిటి’ అని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. ‘అమరావతి ఉద్యమానికి మద్దతిచ్చే వారంతా రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలి. గవర్నర్ సంతకం అమరావతికి మరణ శాసనమే’ అని మాజీ హస్తకళ చైర్మన్ పాలి ప్రసాద్ విమర్శించారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర తెలపడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో చీకటి రోజుగా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరిగణించారు.
మూడు రాజధానుల విషయంలో వైసీపీ, బీజేపీ రహస్య ఒప్పందం తేట తెల్లమైందని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శిం చారు. అమరావతికి అనుకూలంగా ఉండడం వల్లే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నాను తొలగించారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను నిర్వీర్యం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని తాడేపల్లిగూడెంలో టీడీపీ నేత వలవల బాబ్జి విమర్శించారు.
రాజధాని అమరావతే : బీజేపీ
‘ఏపీ రాజధాని అమరావతే. మొదటి నుంచి ఇదే చెబుతున్నాం. గవర్నర్ బిల్లు ఆమోదించడంలో మూడు కోణాలు ఉంటాయి. ఒకటి రాజకీయ, రెండు రాజ్యాంగ, మూడు న్యాయ కోణం. ప్రస్తుతం రాజకీయ కోణంలో జరిగింది’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాకా సత్యనారాయణ అన్నారు. ‘13 జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రాంతీయ విభేదాలు రాకుండా చూడాలి. కాంగ్రెస్, టిడిపి చేసిన తప్పును ఈ ప్రభుత్వం చేయకూడదు. అమరావతి రైతుల ఆందోళనను విరమింపజేయాలి’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పురిఘళ్ళ రఘురామ్ అన్నారు.
స్వాగతించిన వైసీపీ
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర పడడం ఆనందనీ యమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణతో రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమని ఉంగుటూరు ఎమ్యెల్యే, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల శ్రీనివాసరావు అన్నారు. మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో శుక్రవారం తణుకులో వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.