నిట్‌లో నీటి కాఠిన్యం

ABN , First Publish Date - 2020-02-12T12:21:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీ నిట్‌) విద్యార్థులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు

నిట్‌లో నీటి కాఠిన్యం

భూగర్భ జలాల్లో కాల్షియం, మాంగనీస్‌ అధికం

తుప్పు పడుతున్న పైపులు.. పేలిపోతున్న గీజర్‌లు

విద్యార్థులకు అనారోగ్య సమస్యలు

నీటిని సరఫరా చేయని గూడెం మున్సిపాలిటీ

కాఠిన్యం తగ్గించేందుకు చర్యలు.. 

బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌లో చర్చించనున్న అధికారులు


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీ నిట్‌) విద్యార్థులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉపయోగిస్తున్న భూగర్భ జలాల్లో కాఠిన్య శాతం అధికంగా ఉంది. మాంగ నీస్‌, కాల్షియం ఎక్కువగా ఉండడంతో వినియోగంలో సమస్యలు వస్తున్నాయి. తరచూ పైపులైన్లు దెబ్బ తినడం, వేడి నీళ్ల కోసం ఏర్పాటుచేసిన గ్రీజర్లు పేలిపోవడం జరుగుతున్నాయి. మరోవైపు విద్యార్థుల ఆరోగ్యంపైన ప్రభావం చూపుతోంది. జట్టు రాలిపోవడం, వంటిపై దద్దుర్లు ఏర్పడటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. 


స్పందించని మునిసిపాలిటీ 

ఏపీ నిట్‌కు మంచినీటి సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో రూ.10 కోట్లు కేటాయిస్తూ నిర్ణయంతీసుకుంది. అది మినిట్స్‌ రూపంలోనే ఉండిపోవడంతో నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఈ విషయమై నిట్‌ అధికారులు తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ అధికారులు సంప్రదిస్తున్నా వారి నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. అర్బన్‌ హౌసింగ్‌కు మంచినీటిని సరఫరా చేసేందుకు నిట్‌కు ఆనుకుని పైప్‌లైన్‌ వేశారు. దీని నుంచి నిట్‌కు మంచినీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. నిట్‌ ఏర్పాటు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి  ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌, మున్సిపాలిటీ, పబ్లిక్‌ హెల్త్‌ శాఖలు మౌలిక వసతులు కల్పిస్తామని లిఖిత పూర్వకంగా తెలిపాయి. ఫలితంగా తాడేపల్లిగూడెంలో నిట్‌ ఏర్పాటైంది. తగ్గట్టుగానే విద్యుత్‌ను సరఫరా చేశారు. రహదారిని అభివృద్ధి చేశారు. మంచినీటి సరఫరా ఒక్కటే మిగిలి ఉంది. ఈ బాధ్యత మున్సిపాలిటీపై ఉంది. రోజూ ఎనిమిది లక్షల లీటర్ల మంచినీటిని సరఫరా చేయాలి.


కాఠిన్యత తగ్గించేందుకు చర్యలు 

మంచినీటిని సరఫరాకు మున్సిపాలిటీ నుంచి స్పందన లేకపోవడంతో నిట్‌ అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్న భూగర్భ జలాల్లో కాఠిన్యతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ మేరకు కేంద్రం అనుమతి తీసుకున్నారు. మున్సిపాలిటీ మంచి నీటిని సరఫరా చేయకపోవడంతో బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌లో చర్చించనున్నారు. మున్సిపాలిటీ నుంచి స్పందన కొరవడుతుండటంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పెరగనున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు.


Updated Date - 2020-02-12T12:21:59+05:30 IST