ఈ మూడే కీలకం
ABN , First Publish Date - 2020-04-25T09:23:08+05:30 IST
ఢిల్లీతో లింకులున్న ఏలూరు సహా పెనుగొండలో గత మూడు వారాలుగా ప్రతీ రెండు రోజులకు ఒకసారి పాజిటివ్ కేసులు నమోదవుతూనే

ఏలూరు, పెనుగొండ, తాడేపల్లిగూడెంపైనే దృష్టి
ఇక్కడ కట్టడైతే కొలిక్కి వచ్చినట్టే
విద్యానగర్‌లో రెడ్‌జోన్ ఎత్తివేత
కొత్తగా ఒక్క కేసు నమోదు కాలేదు
జిల్లావాసుల్లో చిగురిస్తున్న ఆశలు
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
ఢిల్లీతో లింకులున్న ఏలూరు సహా పెనుగొండలో గత మూడు వారాలుగా ప్రతీ రెండు రోజులకు ఒకసారి పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ రెండింటికి పోటీగా తాడేపల్లిగూడెం చేరింది. అక్కడా రెండు వారాల వ్యవధిలోనే ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు చోట్ల 32 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇకపై ఈ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే ఊపిరి పీల్చుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం ఐసొలేషన్‌లో చికిత్స పొందిన మరో ఐదుగురు డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది.
తొలి దశలోనే ఏలూరులో తొమ్మిది మందికి పాజిటివ్ బయటపడింది. వారంతా ఢిల్లీతో ప్రత్యక్ష లింకులున్నవారు. అప్పటికప్పుడు అప్రమత్తమై వారితో సన్నిహితంగా మెలిగిన వారిని, బంధువులను, రక్త సంబంధీకులను ముందు జాగ్రత్తగా క్వారం టైన్‌కు తరలించారు. ఈ నెల 1న ఇదంతా జరిగింది. అప్పటి నుంచి జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి ఆరంభమైంది. తర్వాత వరుసగా ఏలూరు నగరానికి చెందిన వారికి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడా సంఖ్య నేరుగా 16కు చేరింది. తొలుత గుర్తించిన పాజి టివ్ కేసులు ఎక్కువగా ఉండడం, కొత్తగా నమోదైన వాటితో కలిపి జిల్లాలో మిగతా కేంద్రాలకంటే ఏలూరు ముందు వరుసలో నిలిచినట్టయ్యింది. వాస్తవానికి పాజిటివ్ నిర్ధారణ కాగా చికిత్స అనంతరం తొమ్మిది మందికి పైగానే డిశ్చార్జి అయ్యారు. తొలు త వారందరిలో కరోనా లక్షణాలు కనిపించకపోగా వైద్య పరీక్షల్లో పాజిటివ్ తేలింది. వైరస్ లక్షణాలు బయటపడి ఉంటే ముందే అప్రమత్తమయ్యే వారు.
వైద్యులు దీనినే పరిగణనలోనికి తీసుకున్నారు. గుర్తించిన వెంటనే ఐసొలేషన్‌లో మెరుగైన వైద్యం అం దించడంతో కోలుకోగలిగారు. మరికొద్దిరోజుల్లోనే ఇంకొం దరు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. తాజాగా బిహార్‌కు చెందిన డ్రైవర్ ఒకరికి పాజిటివ్ నిర్ధా రణ కావడంతో అతని ద్వారా ఎవరికైనా వైరస్ సోకే అవకా శాలను పరిశీలిస్తున్నారు. అనుమానితులను క్వారంటైన్‌కు చేర్చారు. తంగెళ్ళమూడిలో బాలికతో సన్నిహితంగా ఉన్నవారికి పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులకు సంబంధించి మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య ఒకటి, రెండు మాత్రమే ఉంటే ఏలూరులో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టే.
పెనుగొండలో మరోతంతు
ఏలూరు తర్వాత అత్యధిక పాజిటివ్ కేసులు పెనుగొండలో నమోదయ్యాయి. ఇక్కడ ఢిల్లీతో లింకు ఉన్న వారికి పాజిటివ్ కాగా, వారి నుంచి మరో తొమ్మిది మందికి సంక్రమించింది. ఇక్కడున్న ప్రత్యేక పరిస్ధితుల నేపథ్యంలో ముందు గానే యంత్రాంగం తేరుకుంది. గుర్తించిన ప్రాంతాన్ని పూర్తిగా రెడ్‌జోన్‌గా ప్రకటించి ఆంక్షలు విధించారు. వైరస్ కట్టడి అవుతుందనుకున్న తరుణంలోనే తాజాగా మరొక కేసు నమోదైంది. వాస్తవానికి ఢిల్లీకి వెళ్లొచ్చిన ఇద్దరితో ఆరంభమైన కరోనా కేసులు ఇప్పటిదాక కొనసాగుతూనే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక దశలో సమూహ వ్యాప్తి కారణంగానే పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్టు గుర్తించారు. క్రమేపీ కేసులు మరింత పెరుగుతాయని భావించినా ప్రతీ మూడు రోజులకు ఒకటి, రెండు కేసులు వస్తూనే ఉన్నాయి. మొదటి మూడురోజుల వ్యవధిలోనే ఆరుకు చేరిన కేసులు ఆ తర్వాత ఒక్కొక్కటి పెరుగుతూ వచ్చాయి. వైరస్ కట్టడికి పెనుగొండలో చురుకైన చర్యలే తీసుకున్నారు. మధ్యలో సమూహవ్యాప్తికి దారి తీసే విధం గా కేసులు నమోదు కావడం కొంత గందరగోళ పరిచింది. వైరస్ అనుమానితులందరినీ క్వారంటైన్‌లో ఉంచి ఇప్పటికీ గమనిస్తు న్నారు. దశల వారీగా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల మేరకు పెనుగొండలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా.
గూడెంలో గడబిడ
తాడేపల్లిగూడెంలో ఒక కేసుతో ఆరంభమైనా ఐదుకు పెరిగింది. వైద్య నిమిత్తం విజయవాడలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళిన ఒకరికి పాజిటివ్‌గా ధ్రువపడింది. ఈ కేసుతో వరుసగా మరో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఇక్కడితో పుల్‌స్టాప్ పడిందా లేదా అనేది మరో పది రోజులు వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు. ఈ నాలుగు కేసులకు సమాంతరంగా ఢిల్లీ వెళ్ళొచ్చిన ఇద్దరికి తొలుత పాజిటివ్, ఆ వెంటనే నెగిటివ్ రావడంతో ఇక్కడ కరోనా కేసులు అనుమానంలో పడ్డాయి. ఇదే తరుణంలో వారిద్దరితో సన్నిహితంగా ఉండే మరొక వృద్థుడికి పాజిటివ్ నిర్ధారణ అయింది. భీమవరం, గుండుగొలను, ఉండి, ఆకివీడు, నరసాపురం ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు వచ్చినా మరొకరికి విస్తరించలేదు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల అన్నింటిలో ఇదే తేలింది. ఏలూరు, పెనుగొండ, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో పూర్తిగా కట్టడిలోకి వస్తేనే జిల్లా ఊపిరి పీల్చుకోగలుగుతుంది. తాడేపల్లిగూడెం, భీమవరం క్వారంటైన్‌లో ఉన్న సుమారు 450 మందికి పైగా అనుమానితుల్లో 150 మందికి పైగానే పరీక్షల అనంతరం నేడో రేపో బయటపడనున్నాయి.
ఈ రోజు కొత్తగా కేసుల్లేవ్
ఏలూరు ఫైర్‌స్టేషన్ : జిల్లాలో శుక్రవారం కొవిడ్-19 పాజిటివ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని ఆశ్రం ఆసుపత్రి కరోనా పేషెంట్ల ఇన్‌ఛార్జి డాక్టర్ ఏవీఆర్.మోహన్ తెలిపారు. ఆశ్రంలో 23 కరోనా పాజిటివ్ కేసులకు వైద్యం అందిస్తున్నామన్నారు. వారందరికీ పౌష్ఠికాహారం అందిస్తూ ట్రీట్‌మెంట్ ఇస్తున్నామన్నారు.
రెడ్‌జోన్ ఎత్తివేత
ఏలూరు రూరల్ : ఏలూరు విద్యా నగర్‌లో ఇటీవల ఒక బ్యాంకు ఉద్యోగికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో కలకలం రేగింది. మరో రెండుసార్లు పరీక్షించగా నెగెటివ్‌గా తేలింది. బ్యాంకు ఉద్యోగి ఇంటిల్లిపాదికి ఒకటికి, రెండుసార్లు నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. అయినప్పటికీ 15 రోజులకుపైగా విద్యానగర్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టి వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి, అనుమానితులను గుర్తించారు. ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు లేకపోవడంతో ప్రొటోకాల్ ప్రకారం రెడ్‌జోన్‌ను తొలగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.