నామినేషన్ ప్రక్రియనూ రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-03-16T11:45:27+05:30 IST
కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నాం అని రాష్ట్ర ఎన్నికల
మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు
భీమవరం అర్బన్, మార్చి 15 : కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నాం అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడం మంచిదే.. అలాగే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జరిగిన దౌర్జన్య కాండల కారణంగా ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండ మాణిక్యాలరావు అన్నారు. భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నామినేషన్ ప్రక్రియలో జరిగిన దౌర్జన్య కాండలను మేము గుర్తించాం అని స్పష్టంగా ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగిందన్నారు. అక్రమాలను గుర్తించి ఇద్దరు ఎస్పీలు, ఏడుగురు సీఐలు, 20మంది ఎస్‌ఐలను విధుల నుంచి తొలగించాం అని ప్రకటించి చేతుల దులుపుకోవడం కాకుండా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులను తరిమి తరిమి కొట్టిన సంఘటనలు, ప్రతిపక్ష నాయకులు, మాజీ ఎమ్మెల్యేపై జరిగిన దౌర్జన్యాలు వంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని శుద్ద చేతనంలో ఉంచి, కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఎన్నికలను నిర్వహించాలని సూచించారు.
ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం..
స్ధానిక సంస్థల ఎన్నికల నామినేషన్లలో జరిగిన అన్యాయాలను గవర్నర్ దృష్టికి, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని మాణిక్యాలరావు అన్నారు. ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఆఽధ్వర్యంలో నేటి నుంచి అన్ని జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతి పత్రాలను అందించనున్నామని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ నామమాత్రపు చర్యలు కాకుండా రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ మాట్లాడుతూ జిల్లాలోని బీజేపీ అభ్యర్థులను అధికార పక్షం నాయకులు బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం జరిగిందన్నారు. బీజేపీ బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోమట రవి మాట్లాడుతూ పెద్దగరువు గ్రామంలో ఒక ఎస్సీ మహిళ ఎంపీటీసీ స్థానానికి నామిషన్ వేయగా ఆ మహిళకు కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారన్నారు.
దీంతో ఆ మహిళ భయబడి గ్రామంలో కాకుండా భీమవరంలో మూడు రోజులు దాక్కున్నారన్నారు. అఖరి రోజు బీఫారం పట్టా సమర్పించుకోవడానికి వెళ్లిన తరుణంలో ప్రపోజల్స్ ద్వారా ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేయించి ఆమె నామిషన్‌ను విత్‌డ్రా చేయించిన సంఘటన దురదృష్టకరమన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు, జనసేనతో కలిసి స్థానిక పోలీసులు, సబ్ కలెక్టర్లకు ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాగిత సురేంద్ర, అరసవల్లి సుభ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.