లాక్‌డౌన్‌ ఆశలు

ABN , First Publish Date - 2020-05-17T09:37:59+05:30 IST

జిల్లాలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి తీసుకున్న చర్యలన్నీ ఆదినుంచీ కొంత సక్సెస్‌ అయ్యాయి.

లాక్‌డౌన్‌ ఆశలు

నేటితో ముగియనున్న లాక్‌డౌన్‌ గడువు

సరికొత్త నిర్ణయాలపైనే అందరి ఆశలు

నెలల తరబడి ఇళ్లల్లో ఉండలేక ఉత్కంఠ

వ్యాపారాల్లేక తగ్గిన రాబడి

పెరుగుతున్న కరోనా కేసులు

జిల్లాలో 70కి చేరిన పాజిటివ్‌ 

లాక్‌డౌన్‌ 4.0పై  ఊహలు


మూడో విడత లాక్‌డౌన్‌  గడువు ఆదివారంతో ముగియనుంది.ఇప్పటికే మూడు విడతల పాటు గడువు పొడిగిస్తూ వచ్చారు.  కేంద్రం ఇప్పుడు ఏ మేరకు సడలింపులు ఇవ్వనుంది..? ఏ..ఏ రంగాలకు ఊరట కలగబోతుంది..? ఇప్పటికే నిర్దేశించిన కొన్ని వ్యాపారాలకు వెసులుబాటు వస్తుందా...? మరికొన్నింటిలో సాఽఽధారణ స్థితి నెలకొంటుందా... అనే ప్రశ్నలే ఇప్పుడు ఉత్కంఠగా మారాయి.


కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అందరూ ఏకమై వ్యవహరించడంతో  కొత్త ప్రాంతాలకు మరింత విస్తరించకుండా కట్టడి కాగలిగింది. జిల్లాలో ప్రస్తుతం వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 70కి చేరింది. కొత్తగా కోయంబేడు లింకు ఒక్కొక్కటిగా బయట పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రవాణా ఎలా పునరుద్ధరిస్తారో అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.  


(ఏలూరు - ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

జిల్లాలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి తీసుకున్న చర్యలన్నీ ఆదినుంచీ కొంత సక్సెస్‌ అయ్యాయి. ఢిల్లీ నుంచి ఇప్పుడు కోయంబేడు వరకూ లింకుల కార ణంగానే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాల్సిందిపోయి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే క్వారెంటైన్‌లకు చేరే వారి సంఖ్యకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ఒకానొక దశలో వైరస్‌ కట్టడికి ఉద్దేశించిన లాక్‌డౌన్‌ సత్ఫలితాలిచ్చింది. తగ్గట్టుగానే పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదు పదులకు మించ దని తొలుత అందరూ అంచానాకు వచ్చారు. వైద్యులు మాత్రం ఈ తరహా అంకెలతో సరిపెట్టుకోవడం జరగదని వైరస్‌ వ్యాప్తికి కట్టడి ఒక్కటే మార్గమని వాదిస్తూ వచ్చారు. వైద్యుల వాదనే చివరకు నెగ్గింది. ఫలితంగా జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగానే అయినా ఎప్పటికప్పుడు నమోదు అవుతూ వస్తున్నాయి. అది కూడా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. తాజాగా కోయంబేడు లింకున్న కేసులు బయటపడడంతో పెరవలి, ఉండ్రాజవరం మండలాలకు వైరస్‌ విస్తరించినట్లైంది.


పాజిటివ్‌ సోకిన వారిద్దరు వాహన డ్రైవర్లు కావడం విశేషం. దీనికి తగ్గట్టుగానే జిల్లాలో ఒకవైపు కొత్త కేసులు నమోదు అవుతుండగా మరోవైపు డిశ్చార్జి అయ్యేవారి సంఖ్య అంతేస్థాయిలో ఉంది. వైరస్‌ వ్యాపించిన తొలినాళ్ళల్లో పాజిటివ్‌గా గుర్తించినవారిలో అత్యధికులు డిశ్చార్జి అవుతూనే ఉన్నారు. ఏలూరు, పెనుగొండకు చెందిన వారిసంఖ్యే అత్యధికంగా ఉంది. ఈరెండు ప్రాంతాల్లోనే పాజిటివ్‌ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈరెండింటి తరువాత కాశీ వెళ్లి తిరిగివచ్చిన వారితో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా కోయంబేడు కూడా తోడవడంతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే వైరస్‌ వ్యాప్తి విచిత్రంగా మారింది. సమూహ వ్యాప్తి ఆరంభమైనట్లు ఇంతకుముందే గుర్తించారు.


దీనికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున కొత్త కేసులు బయట పడతాయని అంచనా వేసినా  కేసుల సంఖ్య నమోదు కాలేదు. ఈ మధ్యన కొందరికి ఎటువంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ నిర్ధారణ కావడం ఆందోళనకు గురిచేస్తుంది. జిల్లాలో గర్భిణులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి మరోమారు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరీక్షల్లోనూ కొత్తగా ఒక్కొక్కటి బయటపడుతోంది. ఈ మధ్యనే గర్భిణి ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న వారి సంఖ్య అధికారిక సమాచారం  ప్రకారం శనివారం నాటికి మరో ఇద్దరిని డిశ్చార్జి చేయడంతో ఈ సంఖ్య కాస్త 20లోపే ఉన్నట్లు చెబుతున్నారు.   


వెసులుబాటు ఎక్కడెక్కడ 

ఒకవైపు కరోనా వైరస్‌ కట్టడికి ప్రయత్నిస్తూనే మరోవైపు వెసులుబాటు పెంచాలని భావిస్తున్నారు. తాజాగా ఇంతకుముందు ఇచ్చిన వెసులుబాటు కారణంగా పట్టణ ప్రాంతాల్లో కొంతలో కొంత సౌక ర్యాలు అందుబాటులోకి వ చ్చాయి. నాల్గో విడత లాక్‌డౌన్‌ సడలింపుల్లో మరిన్ని ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. వీటిని ఆదివారం నాటికి ప్రకటించే అవకాశం ఉంది. పరిస్థితిని ముందస్తుగా అంచనా వేసి ఇప్పటికే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొన్నింటికి వెసులుబాటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజారవాణా, దేవాలయాలు తిరిగి తెరవడం, దుకాణాలను  ఒక క్రమపద్ధతిలో  తెరచేందుకు నిర్దేశించడం, ప్రత్యేకించి కొన్ని వ్యాపారాలకు అవకాశం కల్పించడం అలాగే సెలూన్లు దగ్గర నుంచి మరికొన్నింటిని తెరచేలా సడలింపులు ఉంటాయని ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం సాగుతోంది. తగ్గట్టుగానే ఏఏ వారాల్లో ఏ రకమైన వ్యాపారాలు కొనసాగించాలో నిర్దేశించబోతున్నట్లు ఇప్పటికే సోషల్‌ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది.


కిరాణా, పాలు, కూర గాయలు వంటి వాటిని ప్రతి రోజు తెరచి ఉంచేలా, మిగతావాటిపై మాత్రం వారానికి మూడు రోజుల నుంచి నాలుగు రోజుల వరకూ తెరచేలా ప్రణాళిక రూపొందుతున్నట్లు ఇంకొందరు ప్రచారం నిర్వహించారు. అయితే ఇప్పటికే దేవాలయాల్లో దర్శనం కోసం ట్రయిల్‌ రన్‌ పూర్తి చేశారు. ఒకవైపు భౌతిక దూరం పాటిస్తూనే మరోవైపు మిగతా కార్యకలాపాలు విస్తరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్‌ సేవలు ఆరంభమయ్యాయి.


దీనికితోడు ప్రజారవాణా కాస్తంత పెరిగితే గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేవారి సంఖ్య మరింత పెరగడంతో పాటు, ఆర్థిక లావాదేవీలు కూడా పుంజుకుంటాయని భావిస్తున్నారు. ప్రత్యేకించి ఇప్పటికే గుర్తించిన పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ఇక ముందు సడలింపులతో చిన్నాచితకా చేతివృత్తులు, చిన్న తరహా పరిశ్రమలు మరింతగా ఉత్పత్తులు మార్కెట్లోకి చేరుతాయని తద్వారా పలు అవకాశాలు విస్తరిస్తాయని అంచనాకొచ్చారు. కేంద్రం ప్రకటించిన సడలింపు లను బట్టే ఇదంతా సాధ్యం. మరిన్ని పరిమితులతో కూడిన సడలింపులు ఉంటాయని అధికార యంత్రాంగం దాదాపు నిర్ధారణకు వచ్చింది. 

Updated Date - 2020-05-17T09:37:59+05:30 IST