అన్నదాతకు అప్పేది

ABN , First Publish Date - 2020-06-04T11:08:56+05:30 IST

పట్టెడన్నం పెట్టే రైతన్నకు ఇప్పుడు చేతికి చిల్లిగవ్వ దొరకడం లేదు. సార్వా సాగు ఖర్చులకు రెండు చేతులు చాచినా పైసా దక్కడం లేదు.

అన్నదాతకు అప్పేది

ఖరీఫ్‌ సాగుకు అందని బ్యాంకు రుణాలు

రుణ లక్ష్యం రూ. ఆరు వేల కోట్లు

ఇచ్చింది  రూ. 815 కోట్లు మాత్రమే

ప్రైవేటు వడ్డీదారుల వైపు రైతులు 

ఏరువాక ఆరంభంపై  ఇంకా అస్పష్టతే


పట్టెడన్నం పెట్టే రైతన్నకు ఇప్పుడు చేతికి చిల్లిగవ్వ దొరకడం లేదు. సార్వా సాగు ఖర్చులకు రెండు చేతులు చాచినా పైసా దక్కడం లేదు. వ్యవసాయ పనులకు ముందుగానే రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకులు ఇప్పటిదాకా మొత్తం లక్ష్యంలో కేవలం 10 శాతం కూడా  మంజూరు చేయలేదు. ఇక కౌలు రైతుల సంగతి చెప్పక్కర్లేదు. కాల్వలకు నీరు వదులుతున్నా ఏరువాక కన్పించక పోవడానికి కారణం అప్పు దొరక్కపోవడమే. ఆఖరికి ప్రైవేటు వ్యక్తుల నుంచి అంతో ఇంతో రాబట్టేందుకు ప్రయ త్నిస్తున్నా ఎక్కడా నయాపైసా కూడా పెట్టుబడికి దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఖరీఫ్‌ కష్టకాలంలోనే ఆరంభమవుతోంది. 


ఖరీఫ్‌ రుణ లక్ష్యాలను ప్రతి ఏటా సీజన్‌కు మూడు నెలల ముందుగానే ఖరారు చేస్తారు. రుణాలతో పాటు విత్తనాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారు. బ్యాంకర్ల సమావేశం నిర్వహించి రుణ మంజూరుకు సమాయత్తపరుస్తారు. కానీ ఈ సారి కరోనా  కర్షకులకు అడ్డుతగిలింది. గడిచిన రెండు మాసాలుగా బ్యాంకుల లావాదేవీలు పూర్తిగా మందగించాయి. పనిచేసే సమయం పూర్తిగా కుదించారు. ప్రణాళిక లక్ష్యాలను రైతు లకు చేరువ చేయాల్సిన వ్యవసాయ శాఖ అప్రమత్తం కాలేకపోయింది. ఒక మండలంలో నెలకొన్న పరిస్థితులు ఇంకో ప్రాంతానికి చేరకుండా పోయాయి. ఏరువాక దగ్గర పడుతున్న సమయంలోనే ఉత్సాహంగా ఉండాల్సిందిపోయి చాలా చోట్ల ఆ వెసులుబాటు లేకుండా పోయింది. ఫలి తంగా రైతులకు కావాల్సిన ముందస్తు పెట్టుబడి దాదాపు చేజారింది. అనుకున్న లక్ష్యం మేరకు ఈసారి ఖరీఫ్‌ పంట రుణాలు లక్ష్యం దాదాపు ఆరు వేల కోట్లు. కాని ఇప్పటిదాకా  కేవలం 815 కోట్లు మాత్రమే రైతుల చేతికందాయి. అది కూడా రాజకీయంగా కాస్త పరపతి ఉన్న పెద్ద రైతులు ముందస్తుగా వ్యవసాయ రుణాలను అందుకోగలిగారు. 


మారుమూల ప్రాంతాల్లో ఉన్న రైతులకు రుణ పరపతి ఇప్పటికీ చేరువకాలేదు. ఇదిగో అదిగో అంటూనే తొలకరి ఆరంభమైన వేళ, మరో 24 గంటల్లో గోదావరి డెల్టా కాలువలు నీటిని విడుదల చేస్తున్న సమయానికి కూడా బ్యాంకుల రుణాలు రైతులకు అందలేని పరిస్థితి. దీనిపై మొదటి నుంచి ఒక కన్నేసి ఉంచాల్సిన యంత్రాంగం కరోనా వైరస్‌ కట్టడికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది.  ఈ ఖరీఫ్‌లో రెండు లక్షల 30 వేల హెక్టార్లలో పంట విస్తీర్ణం లక్ష్యంగా ఉంది. అలాగే నీటి విడుదల విషయంలోనూ ఈసారి మీనమేషాలు లెక్కించారు. ఒకటికి రెండుసార్లు ముందస్తుగా కాలువలు కట్టివేస్తూ అనుకున్న సమయానికే నీటి విడుదల చేయాల్సి ఉన్నా అదీ జరగలేదు.  ప్రతి ఏటా జూన్‌ 1వ తేదీన కాల్వలకు నీటిని విడుదల చేస్తూ ఉండగా, ఈసారి మాత్రం మరో ఐదు రోజులు పొడిగించి మొదటి వారంలో విడుదల చేసేందుకు నిర్ణయించారు.   


పెట్టుబడి సాయం ఏదీ ? 

ఖరీఫ్‌ పెట్టుబడికి వీలుగా ముందస్తు రుణాలు అందిం చడంలో విఫలమైన ప్రభుత్వం ఆ మేరకు ప్రత్యామ్నాయం కూడా ఇప్పటికీ చూపలేదు. సాధ్యమైనంత మేర రైతుల అవసరాలకు తగ్గట్టుగా రుణ సదుపాయం అందించాలని కలెక్టర్‌ ముత్యాలరాజు ఇప్పటికే బ్యాంకర్లను కోరారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి కొరత లేకుండా చూడాలని ఈ మధ్యనే విజ్ఞప్తి చేశారు. కానీ బ్యాంకర్లలో మాత్రం పెద్దగా కదలిక లేదు. దీనికితోడు రుణ సదు పాయం కల్పించాల్సిన సహకార సంఘాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఏదైనా కారణం ఉందా అని ఆరా తీస్తే  ఠక్కున కరోనా అని బదులిస్తున్నారు. ఈ జిల్లాలో రైతులు అత్యధికంగా వాణిజ్య బ్యాంకులు, సహకార సంఘాల మీదే పంట రుణాల కోసం ఆధారపడతారు.  అయితే రానురాను రుణ సౌకర్యం కల్పించడంలో తొంగి చూస్తున్న వైఫల్యాలు  రైతుల్లో కొందరిని ప్రైవేటు వడ్డీదారులవైపు నడిపిస్తు న్నాయి.


అత్యధిక వడ్డీ అయినప్పటికీ ఖాతరు చేయకుండా తీసుకుని పనులు ఆరంభిద్దామనుకుంటే అదికూడా ఈసారి కష్టతరంగానే మారింది. కరోనా వైరస్‌ దూకుడుగా విస్తరి స్తున్న తరుణంలో వడ్డీ వ్యాపారులు కూడా కాస్త వెన కడుగు వేశారు. రుణం ఇచ్చేందుకు పెద్దగా సుముఖత కనబర్చడం లేదు. ఫలితంగా ఇక్కడ కూడా రైతులకు మొండిచేయే కన్పిస్తోంది. వ్యవసాయ అవసరాలకు వీలుగా రైతులను ఆదుకు నేందుకు అధికారులు తక్షణం రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి బ్యాంకర్లను అదిలించి రైతుల వైపు మళ్లించాల్సి ఉంది. పంటరుణాలు జారీకి వీలుగా ప్రత్యేక అలర్ట్‌ను ప్రకటించాల్సి ఉంది.  


రుణం అందలేదు.. పంట ఎలా..? కడలి సాయిబాబా, కౌలు రైతు, వడ్లవానిపాలెం

ప్రభుత్వ రుణం అందలేదు, బయట అప్పు ఇచ్చేవారు లేరు. పంట ఎలా వేయాలో అర్థం కావడం లేదు. వైఎస్‌ఆర్‌  రైతు భరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అంద లేదు. బ్యాంకు రుణాలు అందలేదు. బయట అధిక వడ్డీకి అప్పు తెచ్చేవాళ్లం కరోనా కారణంగా ఇప్పుడు అప్పు ఇచ్చే వారూ కనబడడం లేదు. దీంతో సార్వా ఎలా సాగు చేయాలో తెలియడం లేదు.


అధిక వడ్డీలకు అప్పులు..ఆకుల శక్తిరాజ్‌, కౌలు రైతు, పాలకొల్లు

అధిక వడ్డీలకు అప్పులు తేవాల్సి వస్తోంది. నారు మడి, భూమిని చదును చేసుకునేందుకు చేతిలో సొమ్ములేక అయోమయంలో ఉన్నాం. ప్రభుత్వ సాయం అందక పోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి తెచ్చి పంట పండిస్తే నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. పంట వేయాలా..?వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాం. 


Updated Date - 2020-06-04T11:08:56+05:30 IST