చెదరని పసిడి కళ

ABN , First Publish Date - 2020-04-26T11:18:09+05:30 IST

కరోనా వైరస్‌ మానవాళినే కాదు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది.

చెదరని పసిడి కళ

కనిపించని కరోనా ఎఫెక్ట్‌

  పసిడి ధర పరుగో.. పరుగు..

  రూ.50 వేలకు చేరువలో బంగారం

  నేడు అక్షయ తృతీయ


నరసాపురం, ఏప్రిల్‌ 25: కరోనా వైరస్‌ మానవాళినే కాదు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. అన్ని రంగాలు కుదేలు అయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించకతప్పలేదు. ఈ ప్రభావం అన్ని రంగాలపై పడింది. అయితే పసిడిని మాత్రం తాకలేదు. పైపెచ్చు ధర పెరుగుదలకు మరో కారణంగా నిలిచింది. క్రూడ్‌ నుంచి డాలర్‌ వరకు పతనమైనా బంగారం మాత్రం ఇంకా పరుగో... పరుగో... అంటున్నది. ప్రస్తుతం మార్కెట్‌ లాక్‌డౌన్‌లో ఉన్నా.. ధరను కొలమానకంగా చూసే ఎంసీఎక్స్‌లో పది గ్రాముల మేలిమి బంగారం రూ.48 వేలు పలుకుతున్నది.


అంటే గ్రాము బంగారం కొనాలంటే చేతిలో రూ.4800 ఉండాల్సిందే. ఈ ధర బులియన్‌ చరిత్రలో ఆల్‌టైం రికార్డు. ఇదే విధంగా పసిడి పరుగు తీస్తే త్వరలో రూ.50వేలు తాకినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు బులియన్‌ వర్గాలు. ఇక జిల్లా పసిడి వ్యాపారానికి పెట్టింది పేరు. జిల్లా వ్యాప్తంగా 750 షాపులు ఉన్నాయి. రోజుకు రూ.10కోట్లు పైనే వ్యాపారం సాగుతుంటుంది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇవన్ని మూతపడ్డాయి. ఆదివారం అక్షయ తృతీయ అయినా తెరవని పరిస్థితి నెలకొంది. ఇటు ప్రజలు సెంటిమెంట్‌గా కొందామన్నా ధరను చూసి వెనక్కి తగ్గుతున్నారు. 


లాక్‌డౌన్‌కు ముందు... ఈ ఏడాది జనవరిలో గ్రాము బిస్కెట్‌ బంగారం రూ.4 వేలు పలికింది. అప్పటికే చైనాతో పాటు కొన్ని దేశాల్లో కరోనా ప్రభావం ఉంది. అప్పటి నుంచి ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇండి యాలో లాక్‌డౌన్‌కు ముందు గ్రాము బంగారం ధర రూ.4200 మాత్రమే ఉండేది. గత నెల రోజుల నుంచి అన్ని దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉండటంతో క్రూడ్‌ నుంచి స్టాక్‌ మార్కెట్ల వరకు పతనమవుతూ వచ్చాయి. దీంతో మదుపుదారుల చూపు పసిడిపై పడింది. ఈరంగంపై పెట్టుబడులు పెట్టుకుంటే... ఢోకా లేదని భావించారు. అప్పటి నుంచి బంగారం పెరుగుతూ వచ్చింది.  

Updated Date - 2020-04-26T11:18:09+05:30 IST