వైసీపీలో గడబిడ

ABN , First Publish Date - 2020-03-12T08:46:50+05:30 IST

రాజకీయాల్లో సరికొత్త బెదిరింపులు. ఆగమాగం చేస్తున్న వైసీపీ ఇప్పుడు తనంతట తానుగా ఏలూరు తోసహా

వైసీపీలో గడబిడ

టిక్కెట్లు, పదవులపై కొందరు నేతల అలక 

ఏలూరు వైసీపీలో అసంతృప్తి సెగలు 

పార్టీకి అందుబాటులో లేని ముఖ్యులు 

బుజ్జగించేందుకు విశ్వ ప్రయత్నం 

అసమ్మతివాదులతో చర్చలకు యత్నాలు 

జంగారెడ్డిగూడెంలోనూ మారిన స్వరం 

పరిస్థితులను అంచనా వేస్తున్న తెలుగుదేశం 


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాజకీయాల్లో సరికొత్త బెదిరింపులు. ఆగమాగం చేస్తున్న వైసీపీ ఇప్పుడు తనంతట తానుగా ఏలూరు తోసహా మిగతా మున్సిపాల్టీల్లోనూ తలనొప్పులు ఎదుర్కొంటుంది. ఏలూరులో వైసీపీ నేతలు కొందరు అలకపాన్పు ఎక్కారు. అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇంకొందరు నోరు తెరిచి చెప్పుకోలేక మదన పడుతున్నారు. వైసీపీ అధిష్టానం దూకుడు గానే నిర్ణయాలు తీసుకుంటుండడంతో వీటిపై ఔనని, కాదని చెప్పలేక సతమతమవుతున్నారు. ఇప్పుడు వైసీపీలో నేతలు కొందరు సలసల కాగిపోతున్నారు. పట్టరాని కోపంతో ఊగిపోతున్నారు. ఏలూరు కార్పొరేషన్‌లోనూ కొందరు నేతలు అసంతృప్తికి గురవ్వడంతో వీరికి తెలుగుదేశం గాలం వేసేందుకు ప్రయత్నిస్తుంది. జంగారెడ్డిగూడెం పార్టీలోనూ జగడం తప్పలేదు. నేతలను బుజ్జగించేందుకు ఇప్పటికే విశ్వప్రయత్నాలు చేశారు. 


ఏలూరు వైసీపీలో గడబిడ

రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరకపోయినా కేవలం బెదిరింపులతోనే అందరూ రాజీ పడతారని ఇన్నాళ్లూ ఊహించిన వైసీపీకి ఏలూరు రాజకీయాలు చుక్కలు చూపిస్తున్నాయి.ఏలూరు మేయర్‌ పదవికి మిగతా నేతలు ఊహించని రీతిలో మాజీ మేయర్‌ నూర్జహాన్‌కే పట్టం కట్టాలని పరోక్షంగా భావించడంతో ఆ మేరకు సీఎం జగన్‌ నుంచి సంకేతాలు అందడంతో వైసీపీ నేతలు కొందరు షాక్‌కు గురయ్యారు. ఇన్నాళ్లూ తాము ఊహించిన దానికి భిన్నంగా ఒక్కసారిగా కీలకమైన ఏలూరులో తమ పార్టీ తప్పటడుగులకు దిగిందంటూ కొందరు ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాస్తవానికి ఏలూరు మేయర్‌ పదవితో సహా ఏ కీలక పదవులనూ ముందుగా వెల్లడించడం జరగదని సీఎం జగన్‌తో సహా మిగతా మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు.


ముందు ఎన్నికలు, ఆ తర్వాతే నేతల ఎంపిక అంటూ కొత్త వ్యూహానికి పదును పెడుతున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో సయోధ్య కోసమే ఈ ప్రయత్నాలంటూ గొప్పలు చెప్పారు. తీరా మాజీ మేయర్‌ నూర్జహాన్‌ మరో అవకాశం ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపడంతో వైసీపీలో కలకలం ఆరంభమైంది. తగ్గట్టుగానే మంగళవారం రాత్రి నుంచి కొందరు నేతలు అలకబూనారు.ఇంకొందరు సైలెంట్‌ అయి పోయారు. పైకి చెప్పుకోలేక మదనపడుతున్నారు. ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి అత్యంత సన్నిహితంగా ఉన్న నలుగురైదుగురు నేతల సతీమ ణులు పేర్లు ఇప్పటికే ప్రముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.


వీరిలో వైసీపీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్‌ ఒకరు. ఆయన మొదటి నుంచి ఏలూరు మేయర్‌ పదవిని ఆశిస్తున్నారు. అయితే రిజర్వేషన్లు తారుమారు కావడంతో, జనరల్‌ మహిళగా నిర్ధారణ కావడంతో శ్రీనివాస్‌ తన సతీమణినైనా పోటీలో దింపాలని భావించారు. దీనికి వ్యతిరేకంగా ఎస్‌ఎంఆర్‌ పెదబాబు సతీమణి నూర్జహాన్‌కే అవకాశం ఇవ్వాలని భావించగా, సహజంగానే శ్రీనివాస్‌తో సహా కొందరిని ఇరకాటాన పెట్టాయి. ఈ సమాచారం అందుకున్న ఆయన నేరుగానే సెల్‌ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసి నేతలకు అందుబాటులో లేరు. కొందరు ఆయనతో సంప్రదించేందుకు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తాజా పరిస్ధితులపై వైసీపీ వర్గాల్లోనూ తీవ్ర అంతర్మథనం ఎదురైంది. పెదబాబు మాత్రం వైసీపీలో తనకున్న పట్టును నిరూపించుకున్నారు. కొన్నాళ్ళ నుంచి పెదబాబుకు, మంత్రి నానికి పెద్దగా పొసగడం లేదంటూ వైసీపీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని పెదబాబు తిప్పికొడుతూనే వచ్చారు.


ఈ మధ్యనే ఆయన జిల్లా ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డితో సంప్రదింపులు జరిపిన తర్వాత పరిస్థితులు సానుకూలంగా మారినట్టు చెబుతు న్నారు.మూడో కంటికి తెలియకుండా పెదబాబు మంగళవారం సీఎం జగన్‌ను కలిశారు. స్థానిక పరిస్థితులను, ఎదురవుతున్న సవాళ్లను ఆయన ముందుంచారు. ఆ సమయంలోనే సీఎం జగన్‌ ఇంతకు ముందు తాను ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని గుర్తు చేస్తూ ఏలూరు మేయర్‌ పదవికి మీ సతీమణి నూర్జహాన్‌ను సిద్ధం చేయండి అంటూ కోరినట్టు సమాచారం. ఇదంతా మంగళవారం రాత్రి పార్టీలో అన్ని శ్రేణులకు చేరింది. దీనికి దీటుగా బుధవారం మంత్రి నానిని నూర్జహాన్‌ దంపతులు కలిసి ఆశీస్సులు కోరారు. రెండు రోజుల క్రితం ఏలూరు కార్పొరేషన్‌ డివిజన్‌లో కార్పొరేటర్‌ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు పెదబాబు నాయకత్వాన తొమ్మిది మందితో కూడిన బృందంతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు.


అప్పుడే పార్టీలో మిగతా నేతలు ఏదో మార్పు జరగబోతుందంటూ ఊహించారు. మంత్రి నానికి పార్టీలో ఏదీ తెలియకుండా జరగడం దుర్లభం. కాని అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయంగా ఆయన వ్యవహారశైలి ఉంటుంది. మేయర్‌ అభ్యర్థిగా నూర్జహాన్‌ను ఖరారు చేయడం ఇదే కోవలోకి వస్తుందని కొందరు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే నూర్జహాన్‌కు లైన్‌ క్లియర్‌ చేయడం కోసమే ఇంతకు ముందే కొందరికి నామినేటెడ్‌ పదవులు ఇచ్చారని చెబుతున్నారు. మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్న వారంతా ప్రస్తుతానికి ఏదొక నామినేటెడ్‌ పదవిలో ఉన్నారు. ఇదే కోటరీలో ఉన్న గుడిదేశి శ్రీనివాస్‌ ఏలూరులో ఒక డివిజన్‌ నుంచి పోటీ చేయాలనుకుని భావించారు. ఆయన ప్రస్తుతానికి తప్పుకు న్నట్టు ప్రచారం జరుగుతుంది. అసంతృప్తితో ఉన్న బొద్దాని శ్రీనివాస్‌తో చర్చించేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే బొద్దాని మాత్రం దీనికి సానుకూలంగా ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు పెదబాబు   బుధవారం 28 మంది కార్పొరేటర్ల జాబితా విడుదల చేశారు. 


జంగారెడ్డిగూడెం వైసీపీలోనూ కుదుపు

మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న జంగారెడ్డిగూడెంలోనూ వైసీపీలో కలకలం రేగింది. ఇక్కడ పోటీ చేయడానికి వీలుగా సీనియర్‌ నాయకురాలు సాయిబాల పద్మ కొంతకాలంగా ఆశలు పెంచుకున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి కోసం ఆమె పార్టీకి సుదీర్ఘంగా సేవలు అందిస్తూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా పదవిని  మేడవరపు లక్ష్మీజ్యోతి తన్నుకుపోయారు. వైసీపీలో పెద్దలు కొందరు లక్ష్మీజ్యోతికి ఆశీస్సులు అందించారు.ఎంపీ శ్రీధర్‌ సైతం ఆమెకే మద్దతు పలకడంతో సాయిబాల పద్మ తీవ్ర అసంతృప్తికి గుర య్యారు. జంగారెడ్డిగూడెంలో మహిళా నేతగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా పార్టీకి జీవం పోసేందుకు శ్రమించినా ఇదెక్కడి న్యాయం అంటూ ఆమె ఆక్రోశించారు. పార్టీ సీనియర్‌ నేతలు సాయిబాల పద్మను ఊరడించారు. త్వరలోనే పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత నామినేటెడ్‌ పదవి దక్కేలా చూస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు.


ఇది పెద్దగా సంతృప్తి కలిగిం చకపోయినా ఆమె సైలెంట్‌ అయినట్టే కనిపిస్తున్నారు. జడ్పీటీసీ స్థానం విషయంలోను పార్టీ దుందుడుకుగా వ్యవహరించిందని, పార్టీ అత్యంత విధేయతతో వ్యవహరిస్తున్న కొందరిని పక్కనపెట్టి ఇంకొందరికి అవకాశం ఇచ్చిందనే ప్రకంపనలు పార్టీలో కనిపిస్తున్నాయి. దీనిని చక్కబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. జడ్పీటీసీ స్థానానికి బాబ్జీని ఎంపిక చేసి నామినేషన్‌ దాఖలు చేయించారు. మెట్ట ప్రాంతంలో కీలకమైన స్థానంలోనే ఇలాంటి ఎదురీత పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 


కొవ్వూరులోనూ తేల్చడానికి తిప్పలు

కొవ్వూరు వ్యవహారంలోనూ అభ్యర్థులను ఖరారు చేయడంలో తిప్పలు తప్పటం లేదు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడం మంత్రి తానేటి వనితకు సవాల్‌గానే మారింది. ముందస్తుగా కీలక పదవులకు పేర్లను ప్రకటించడానికి వైసీపీ విరుద్ధమే అయినా స్థానిక రాజకీయాల్లో ఈ విషయంలో గుట్టుగా వ్యవహరించలేకపోతున్నారు. పరిస్థితిని సానుకూలంగా పరిష్కరిం చేందుకు వీలుగా అభ్యర్థులను ఖరారు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడం ఆరంభం కాగా, కౌన్సిలర్ల విషయంలోనూ ఒకింత ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. నరసాపురంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది.. 

Updated Date - 2020-03-12T08:46:50+05:30 IST