వేకెన్సీలు ప్రదర్శించకపోతే మళ్లీ ఉద్యమ బాట

ABN , First Publish Date - 2020-12-07T05:37:45+05:30 IST

సాధారణ బదిలీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీచర్ల ఆకాంక్షలపై నీళ్లు చల్లుతూ భారీ సంఖ్యలో వేకెన్సీలను బ్లాక్‌ చేసిన విద్యాశాఖపై ఉపాధ్యాయ సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

వేకెన్సీలు ప్రదర్శించకపోతే మళ్లీ ఉద్యమ బాట

 ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 6:సాధారణ బదిలీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీచర్ల ఆకాంక్షలపై నీళ్లు చల్లుతూ భారీ సంఖ్యలో వేకెన్సీలను బ్లాక్‌ చేసిన విద్యాశాఖపై ఉపాధ్యాయ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. స్పౌజ్‌ దంపతులకు, ఎస్‌జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలన్న డిమాండ్‌ పైనా ప్రభుత్వం నుంచి సానుకూలత వచ్చే సంకేతాలు కరువవడంతో మళ్లీ ఉద్యమబాట పట్టాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చాయి. జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్‌జీటీ క్యాడర్లలో మొత్తం 4,084 వేకెన్సీలు ఉండగా వారిలో 2,537 వేకెన్సీలను కౌన్సెలింగ్‌కు చేర్చి, మిగతా 1,547 స్థానాలను బ్లాక్‌ చేశారు. ఈవిధంగా బ్లాక్‌ చేసిన వేకెన్సీల్లో ఎస్‌జీటీ క్యాడర్లు ప్లెయిన్‌ ఏరియాలో 1,199, ఏజెన్సీ ఏరియాలో 110 ఉండగా, మిగతా వన్నీ స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరిలోనే ఉన్నాయి. వేకెన్సీలను బ్లాక్‌ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి ఎ.సురేష్‌ను కలిసి ఉన్నతాధికారుల తీరుపై ఫిర్యాదు చేశాయి. అన్ని వేకెన్సీలను కౌన్సెలింగ్‌లో చేర్చాల్సిందేనని లేదంటే పది శాతం వరకే బ్లాక్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మంగళవారం అధికారులతో చర్చించి పరిష్కరి స్తానని మంత్రి హామీ ఇవ్వడంతో, ఆ మేరకు వేచి ఉండాలని నిర్ణయించాయి.  అప్పటికీ పరిష్కారం కాకపోతే డీఈవో కార్యాలయం వద్ద పికెటింగ్‌ చేయడంతోపాటు ఆందోళనను ఉధృతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ లేనట్టేనా ? :

 దరఖాస్తు చేసుకున్న టీచర్లు బదిలీ స్థానాలకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ఇక ఉండకపోవచ్చని, ఆ ప్రకారం ఆన్‌లైన్‌ విధానంలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించడానికే విద్యాశాఖ పట్టుదలగా ఉన్నట్టు తెలిసింది. 

Updated Date - 2020-12-07T05:37:45+05:30 IST