చెట్టంత కష్టం!
ABN , First Publish Date - 2020-11-23T05:14:48+05:30 IST
ఒక నాడు ఏదైనా పల్లెటూరు వెళ్లామంటే దారి పొడవునా తాటి చెట్లు కనిపించేవి.. ఏటి గట్టయినా.. కాలువ గట్లయినా.. చేల గట్లయినా.. తాటి చెట్టు ఏదో ఒక మూల దాగి ఉండేది.. మరి నేడు రోజురోజుకు తాటి చెట్లు కనుమరుగవుతున్నాయి.
కనుమరుగవుతున్న తాటిచెట్లు
ఉత్పత్తులకు తగ్గిన ప్రోత్సాహం
పొలాల్లో తొలగిస్తున్న రైతాంగం
పెరవలి, నవంబరు 22 : ఒక నాడు ఏదైనా పల్లెటూరు వెళ్లామంటే దారి పొడవునా తాటి చెట్లు కనిపించేవి.. ఏటి గట్టయినా.. కాలువ గట్లయినా.. చేల గట్లయినా.. తాటి చెట్టు ఏదో ఒక మూల దాగి ఉండేది.. మరి నేడు రోజురోజుకు తాటి చెట్లు కనుమరుగవుతున్నాయి. మిగిలిన పంటలతో పోల్చుకుంటే తాడి చెట్ల నుంచి కూడా లాభదాయకమైన ఉత్ప త్తులు వస్తున్నాయి.కాని గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ పోత్సా హం కొరవడడంతో పాటు అటువంటి పరిశ్రమలను పోత్స హించేవారు లేకపోవడంతో రైతులు తమ పంట భూముల్లో గల తాడిచెట్లను తొలగించే పనుల్లో పడ్డారు. ఒకనాడు వాటిని సరిహద్దు రాళ్లుగా భావించేవారు.ఈ నేపథ్యంలో చేల గట్ల మధ్య తప్పనిసరిగా పెంచేవారు. దీంతో ఎటు చూసినా తాటి చెట్లు కనిపించేవి. ప్రభుత్వ పోరంబోకు భూముల్లోనూ, రోడ్ల వెంబడి, కాలువగట్ల వెం బడి కూడా తాడిచెట్లు విపరీతంగా ఉండేవి.అయితే మారిన కాలంతో పాటు మనిషి ఆలోచనా విధానం కూడా మారింది. పొలాల గట్లపై ఉన్న తాడిచెట్లను తొలగించి దానిని సాగు లోకి తేవడంతో తాటి చెట్లు పతనం ఆరంభమైంది. క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. తాడిచెట్ల నుంచి వచ్చే తాటి ఆకులకు గతంలో ఎంతో డిమాండ్ ఉండేది. ఆయా గ్రామాల్లో నివాస గృహాలతో పాటు పశువుల పాకలకు తాటి ఆకులను విరివిగా ఉపయోగించేవారు. కాల క్రమంలో పాకలు పూర్తిగా కనుమరుగవడంతో తాటా ఆకు లకు డిమాండ్ లేకుండా పోయింది. తాటి ముంజులకు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉంది. పల్లెల్లో కాకుండా పట్టణాల్లో పోటీలు పడి తాటి ముంజులను విక్రయిస్తూ ఉంటారు. తాటిముంజులను విక్రయించుకునేవారు మాత్రమే చెట్లు ఎక్కి వాటిని పట్టణాలకు తరలించి సొమ్ములు చేసుకుంటున్నారు. కల్లుగీత పరిశ్రమ కూడా గతంలో కంటే తగ్గిపోయిందనే చెప్పవచ్చు. తాటికల్లు నుంచి తాటి బెల్లం తయారు చేసే పరిశ్రమలను కూడా పోత్సహించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తు తం తేగలకు విపరీతమైన డిమాండ్ ఉంది. తేగ ఒక్కింటికి ఐదు నుంచి 7 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. గతంలో రైతులే సొంతంగా పాతర్లు వేసుకునేవారు. కూలీల కొరత వల్ల రైతులు కూడా పాతర్లు వేయకుండా వాటిని అలాగే వదిలి వేస్తున్నారు. తాటిచెట్లను ఎవరు బడితే వారు ఎపుడుబడితే అపుడు నరకకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. చాలా మంది రైతులకు ఈ ప్రభుత్వ నిబంధనలు కూడా తెలియని పరిస్థితి ఉంది.తమకు పంట భూముల్లో అడ్డుగా ఉంటున్నాయనే కారణంతో వాటిని నిర్మూలిస్తున్నారు. తాడిచెట్లు మొదలకు నరికితే వాటిని బయటకు తరలించడం కష్టసాధ్యమన్న కారణంతో వాటి మొవ్వులను నరికి చంపేస్తున్నారు. ప్రభుత్వం తాటి చెట్లను పెంచే రైతులకు పోత్సాహకాలు అందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.