మద్యం మత్తులో ఘాతుకం.. మూడేళ్ల చిన్నారిపై పాశవిక దాడి

ABN , First Publish Date - 2020-10-28T16:58:07+05:30 IST

అసలే మద్యం మత్తులో ఉన్నాడు. ఆపై కామ వాంఛతో..

మద్యం మత్తులో ఘాతుకం.. మూడేళ్ల చిన్నారిపై పాశవిక దాడి

రక్తస్రావంతో విలవిల.. ఆసుపత్రికి తరలింపు

నిందితుడిని చితక్కొట్టి.. నగ్నంగా ఊరేగించిన ప్రజలు

తణుకులో తీవ్ర కలకలం


తణుకు: అసలే మద్యం మత్తులో ఉన్నాడు. ఆపై కామ వాంఛతో రగిలిపోయాడు. అంతే అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై పాశవికంగా ప్రవర్తించాడు. పళ్లతో కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఆ బాధతో విలవిల్లాడిన ఆ చిన్నారి ఆర్తనాదాలకు ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి.. ఆ మానవ మృగంపై దాడికి పాల్పడి నగ్నంగా ఊరేగించి పోలీసులకు అప్పగించారు. తణుకు పట్టణంలోని పాతూరులో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాలివి.. జంగారెడ్డిగూడెంకు చెందిన అడపా వీరబ్రహ్మం (45) వ్యవసాయం చేస్తుంటాడు. అతను తణుకులో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు మంగళవారం మధ్యాహ్నం వచ్చాడు. కుమార్తె అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని మూడేళ్ల కుమార్తె రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో భోజనం చేస్తూ.. పక్కనే ఉంటున్న వీరి ఇంటికి వచ్చింది. మంచినీళ్లు కావాలని అడగడంతో లోపలకు వెళ్లి తీసుకోమని చెప్పింది.


అక్కడ మద్యం మత్తులో వున్న వీరబ్రహ్మం పాప లోపలకు రాగానే చిన్నారిపై పళ్లతో పైశాచిక దాడికి పాల్పడ్డాడు. పాప ఆర్తనాదాలు విన్న అతని కుమార్తె, చిన్నారి తల్లిదండ్రులు పరుగు పరుగున వచ్చారు. వెంటనే అతనిపై దాడికి పాల్పడ్డారు. క్షణాల వ్యవధిలో చుట్టుపక్కల వారికి విషయం తెలియడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. వీరబ్రహ్మంపై దాడి చేసి చెట్టుకు కట్టి కొట్టారు. అనంతరం నగ్నంగా ఊరేగిస్తూ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుని వెళ్లి అప్పగించారు. పట్టణ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గాయపడిన పాపను తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యం చేసిన అనంతరం చిన్నారి పరిస్థితి మెరుగవడంతో.. ఇంటికి పంపించినట్టు వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-10-28T16:58:07+05:30 IST