తణుకు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ABN , First Publish Date - 2020-11-15T13:40:19+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే

అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టీ. రాజా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. రాజా మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు, జిల్లాకు చెందిన నేతలు హైదరాబాద్‌కు పయనమయ్యారు. రాజా మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌తో పాటు పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వైటీ రాజా తెలుగుదేశం పార్టీ తరఫున 1999లో తణుకు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009లో టీడీపీ తరఫునే పోటీచేసిన ఆయన పరాజయం పాలయ్యారు. 2014 నుంచి ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. 2014లో ఆరిమిల్లి రాధాకృష్ణను టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాధాకృష్ణ గెలుపుకోసం రాజా కృషిచేశారు.
