అట్లతద్ది నోములు

ABN , First Publish Date - 2020-11-04T05:07:35+05:30 IST

మహిళలు సౌభాగ్యం, సంతానం, ఆయురారోగ్యలు కోరుకుంటూ ఆచరించే నోముల్లో ప్రధానమైనది అట్లతద్ది.

అట్లతద్ది నోములు
నరసాపురం వలంధర్‌ రేవులో గౌరీ పూజ చేస్తున్న మహిళలు

గౌరీదేవికి పూజలు

ముత్తయిదువులకు వాయినం

అట్లు, ఆటలతో సందడి

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 3 : మహిళలు సౌభాగ్యం, సంతానం, ఆయురారోగ్యలు కోరుకుంటూ ఆచరించే నోముల్లో ప్రధానమైనది అట్లతద్ది. మంగళవారం అట్లతద్ది రావడంతో మహిళలు, నూతనంగా వివాహమైన వారు వేకువజామునే లేచి గౌరీదేవిని పూజించి, ముత్తైదువులకు 11 అట్లు, దక్షిణా, తాంబూలతో నోము నోచుకుంటారు. చిన్నారులు తెల్లవారు జాము నుంచి వివిధ రకాల ఆటలు ఆడుకున్నారు. ఊయ్యాలలు ఉగడం, తొక్కుడు బిళ్ళాట, దాగుడు మూతలు వంటి పలు గ్రామీణ క్రీడలతో అట్లతద్ది పండుగ సందడిగా సాగింది.


యలమంచిలి : మండలంలోని గ్రామాల్లో మంగళవారం మహిళలు అట్ల తదియ (తద్ది) నోమును భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి ఉపవాసం ఆచరించి సాయంత్రం గౌరీదేవికి పుజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామాల్లో కాలువలు, చెరువుల వద్ద గౌరీదేవి, గంగమ్మ తల్లికి పూజలు చేశారు. వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. పలువురు మహిళలు గోపూజలు చేశారు. సంప్రదాయబద్దంగా ఉయ్యాల ఊగారు.


కాళ్ళ : మహిళలు భక్తిశ్రద్ధలతో అట్లతద్ది పూజలు చేశారు. మంగళవారం ఉదయం నుంచి పలు గ్రామాల్లో యువతులు పుణ్యస్నానాలు ఆచరించి పార్వతిదేవికి భక్తితో పూజలు చేశారు. ముత్తయిదవులకు పసుపు, కుంకుమ, తాంబూళం అందించి ఆశీర్వచనాలు అందుకున్నారు. కాలువలు, మంచినీటి చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరించి గౌరిదేవికి దీపాలు వెలిగించారు. గౌరిదేవికి అట్లుతో నైవేద్యం సమర్పించారు.


ఆకివీడు: అట్లదద్ది ఆరు అట్లు.. ముద్దపప్పు మూడట్లు. ఆటల నోము అ ట్లతద్ది. అట్లదద్ది వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. యువతులు, పడుచు పిల్లలు తలంటుకుని గోరింటాకు పెట్టుకుని తదియ రోజు తెల్లవారు జామునే నిద్రలేచి సూర్యోదయానికి ముందే చద్ది తిన్నారు. చద్దన్నం, గడ్డ పెరుగు, గోంగూర పచ్చడితో తిని సరదగా తోటల్లో ఊయాల ఊగుతూ, ఆట లు, పాటలతో రోజంతా సరదాగా గడిపేశారు. ఆకివీడులో వర్షం కురిసినా చెరువు వద్ద పూజలు చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. 


ఆచంట: అట్లతద్దిని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేకుమజామున మహిళలు భోజనాలు చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో గౌరీ పూజ చేశారు. పేరంటాలకు వాయినాలు ఇచ్చి చెరువులు, కాలువలో పూజలు నిర్వహించారు. ఆలయాలను మహిళలు దర్శించుకున్నారు. కొన్ని చోట్ల మహిళలు ఊయల ఊగారు.


వీరవాసరం: నవ వధువులు, ముత్తెదువులు అట్ల తదియ నిర్వహించారు. వేకువజాము నుంచి మహిళలు తద్ది నోము ప్రారంభించారు. ఉపవా సంతో పూజలు చేశారు. ముతైదువులకు వాయినాలు ఇచ్చారు. కాలువలు, చెరువుల వద్ద గౌరీపూజల అనంతరం చంద్రుని దర్శనం చేసుకున్నారు.


నరసాపురం: పట్టణం, మండలంలో అట్లతద్ది పర్వదినాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవా సం పాటించారు. ముత్తైదవులకు వాయినాలు సమర్పించి, సాయంత్రం గోదావరి, పంటకాల్వల వద్ద గౌరి పూజలు నిర్వహించారు. రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని ఉపసంహరించారు. పట్టణంలోని వలంధర్‌, అమరేశ్వరస్వామి రేవుల వద్ద  మహిళల సందడి కనిపించింది.









Updated Date - 2020-11-04T05:07:35+05:30 IST