నల్ల చట్టాలు రద్దు చేయకుంటే కేంద్రాన్ని గద్దె దించుతాం

ABN , First Publish Date - 2020-12-30T05:46:47+05:30 IST

నల్ల చట్టాలను రద్దు చేయకుంటే కేంద్రాన్ని గద్దె దించే వరకు ఉద్యమిస్తామని సీపీఎం నాయకుడు ఎం. జీవరత్నం హెచ్చరించారు.

నల్ల చట్టాలు రద్దు చేయకుంటే కేంద్రాన్ని గద్దె దించుతాం
జంగారెడ్డిగూడెంలో వ్యవసాయ కార్మిక సంఘం రిలే దీక్షలు


జంగారెడ్డిగూడెం టౌన్‌, డిసెంబరు 29:  నల్ల చట్టాలను రద్దు చేయకుంటే కేంద్రాన్ని గద్దె దించే వరకు ఉద్యమిస్తామని సీపీఎం నాయకుడు ఎం. జీవరత్నం హెచ్చరించారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు ఎం. జీవరత్నం మాట్లాడుతూ కొత్త చట్టాలు అమలైతే కార్పొరేట్‌ చేతుల్లోకి వ్యవ సాయ రంగం వెళ్ళిపోతుందని తద్వారా రైతు పండించే పంటలకు గిట్టుబాటు ఽఉండదని,  నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. గరికి రాంబాబు నాయుడు, వెంకన్న , బొబ్బిలి గంగరాజు, ఆనందరావు, పఠాన్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

వేలేరుపాడు: ఢిల్లీలో రైతుల దీక్షలకు మద్దతుగా వేలేరుపాడు మండలం గుళ్ళవాయి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులు అనేక రోజులుగా దీక్షలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సంఘం మండల అధ్యక్షుడు ధర్ముల రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు, సీపీఐ  ల నాయకులు కొల్లూరి సత్తిపండు, దుర్గారావు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. 

 పోలవరం: కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక మూడు నల్లచట్టాలు రద్దు చేయాలని సీఐటీయు జిల్లా నాయకుడు గుడెల్లి వెంకట్రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన రిలే దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళన కార్యక్రమానికి సంఘీభావంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న రిలే  దీక్షలకు రైతాంగం సహకరించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు గుడెల్లి వెంకట్రావు, ఏపీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు పోలోజు నాగేశ్వరరావు, బొరగం భూచంద్రం, సముద్రాల సాయికృష్ణ తదితరులు ప్రసంగించారు. 

బుట్టాయగూడెం: కేంద్రం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని, అప్పటి వరకు పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుడు కారం రాఘవ స్పష్టం చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనలకు మద్దతుగా బుట్టాయగూడెం బస్టాండ్‌ సెంటరులో రైతు సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి.  

 కొయ్యలగూడెం: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ జెట్టి గురునాథరావు అన్నారు. మంగళవారం కొయ్యలగూడెంలో ఢిల్లీ రైతులకు మద్దతుగా రిలే  దీక్ష చేపడుతున్న రైతులను ఆయన అభినందించారు.  ఢిల్లీలో ఇన్ని రోజులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న రైతులకు న్యాయం చేయాలని కోరారు.  కాంగ్రెస్‌,  వామపక్షాల నాయకులు దీక్షలో పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T05:46:47+05:30 IST