పాలకు చెల్లు..!

ABN , First Publish Date - 2020-02-12T12:29:33+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాల ప్యాకెట్టులను సరఫరా చేసేది.

పాలకు చెల్లు..!

అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలేవి..?

నిలిచిన పాలప్యాకెట్ల సరఫరా

గర్భిణులు, బాలింతల ఆవేదన


తణుకు, ఫిబ్రవరి 11 : అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాల ప్యాకెట్టులను సరఫరా చేసేది. గతంలో టీడీపీ హయాంలో 2017 సంవత్సరంలో గర్భిణులకు, బాలింతలకు, బరువు తక్కువుగా ఉన్న పిల్లలకు రోజుకు 250 మి.లీ పాల ప్యాకెట్టును సరఫరా చేసేవారు. ఆయా కేంద్రాల నుంచి పల ప్యాకెట్టులు తీసుకుని తాగేవారు. ప్రస్తుతం పాల ప్యాకెట్టుల సరఫరా నిలిచిపోయింది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలలో పాల సరఫరాకు బ్రేక్‌ పడింది. 


జిల్లాలో 3567 ప్రధాన కేంద్రాలు

జిల్లావ్యాప్తంగా 3,567 అంగన్‌వాడీ ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. 322 మినీ కేంద్రాలు ఉన్నాయి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఆరు సంవత్సరాల వరకూ ఉన్న పిల్లలు రెండు లక్షల 69, 694 మంది ఉన్నారు. 19,558 గర్భి ణులు ఉన్నారు. 26,820 మంది బాలింతలు ఉన్నారు. వీళ్ళందరికీ బరువును బట్టి పౌష్టికాహారం అందేలా పాల ప్యాకెట్టులను అందించేవారు. గతేడాది  నవంబరు నుంచి అంగన్‌వాడీ కేంద్రాలలో పాలప్యాకెట్ల సరఫరా ఆగిపోయింది. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకున్న సందర్భాలు కనిపించడం లేదు.


ప్రధాన లక్ష్యమిదే

పౌష్టికాహారం లోపం వల్ల పుట్టే బిడ్డలు పలు సమస్యలతో జన్మిస్తుం టారు. పుట్టిన బిడ్డలు కూడా పుష్టిగా ఉండాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పౌష్టికాహారం అందించినట్లయితే పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా పుడతాడు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలురకాల పప్పు దినెసులు, నూనె, బియ్యం, పాలు, ఇతర సరుకులను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్నది. ప్రధానంగా గర్భిణులకు, బాలింతలకు, ఎత్తుకు తగ్గ బరువు లేనివారికి పాల ప్యాకెట్లు సరఫరా చేసేవారు. పాల సరఫరా సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉండేదని ఇప్పుడు ఆపేశారని  పలువురు గర్భిణులు అంటున్నారు.


అంగన్‌వాడీ కేంద్రాలే ఆధారం కౌరు హేమదుర్గ, గర్భిణి, అత్తిలి

ప్రభుత్వం సరఫరా చేసే పాలు తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉండేది. అయితే ప్రస్తుతం పాల సరఫరా లేకపోవడంతో బయట మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మధ్య తరగతి కుటుంబాలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే సరుకులపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటాం. అంగన్‌వాడీ కేంద్రాలకు పాల ప్యాకెట్లు అందించాలి


ఆర్థికంగా భారమే శీలబోయిన లక్ష్మీదుర్గాభవాని, బాలింత

ప్రభుత్వం పాల సరఫరాను పునరుద్ధరించాలి. ఇది చాలా ఉపయుక్తంగా ఉండేది. రోజూ పాలు కొని తాగాలంటే మాలాంటి వారికి ఆర్థికంగా భారమే.  ప్రభుత్వం వెంటనే అంగన్‌వాడీ కేందాల్రకు పాల సరఫరా ప్రారంభించాలి.

Updated Date - 2020-02-12T12:29:33+05:30 IST