భగ..భగ

ABN , First Publish Date - 2020-05-24T09:46:02+05:30 IST

ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు విద్యుత్‌ కోతలతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు.

భగ..భగ

అధిక ఉష్ణోగ్రతలు..అల్లాడుతున్న జనం

తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలులో 46 డిగ్రీలు 

అప్రకటిత విద్యుత్‌ కోతలతో ఇక్కట్లు


ఏలూరు సిటీ, మే 23 : ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు విద్యుత్‌ కోతలతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు.  జిల్లాలో వారంపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే మూడు రోజులుగా వేడిగాలులు భరించలేక ప్రజలు అల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  జిల్లాలో శనివారం అత్యధికంగా తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 46 డిగ్రీలు, తణుకు, జంగారెడ్డిగూడెంలలో 44 డిగ్రీలు, ఏలూరులో 44 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


దీంతో గాలిలో తేమశాతం పడిపోతుండడంతో ఉక్కబోత విపరీతంగా పెరిగింది. ఉదయం 8 గంటల నుంచే వేడి మొదలై సాయంత్రం 6 గంటల వరకు మంట పుట్టిస్తోంది. దీనికితోడు విద్యుత్‌ కోతలతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో సాంకేతిక సమస్యలు , డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండడం వంటి సమస్యలతో అత్యవసర విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు.    


పెరిగిన విద్యుత్‌ వినియోగం

ఒకపక్క ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మరోపక్క విద్యుత్‌ కోతలు ప్రజలను తీవ్ర అసౌక ర్యానికి గురి చేస్తున్నాయి. జిల్లాలో రోజు వారీ విద్యుత్‌ వినియోగం కూడా బాగా పెరిగింది. రెండు రోజులుగా విద్యుత్‌ వినియోగం పరిశీలిస్తే 21వ తేదీన రోజువారీ కోటా 18.879 మిలియన్‌ యూనిట్లు కాగా, 20.080 మిలియన్‌ యూనిట్లు వినియోగం జరిగింది. 22వ తేదీన రోజువారీ విద్యుత్‌ కోటా 18.666 మిలియన్‌ యూనిట్లు కాగా 20.176 మిలియన్‌ యూనిట్లు వినియోగం జరిగిందని విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు చెబుతు న్నారు.


రెండు రోజులుగా జిల్లాలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఎక్కువగా ఎల్‌సీ (లోడ్‌ కటింగ్‌) ఎల్‌ఆర్‌లు(లోడ్‌ రిలీఫ్‌), ఈల్‌ఆర్‌ (ఎమెర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌)లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్‌ కోతలు విధించాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. 


 హాట్‌ కేకుల్లా ఏసీలు, కూలర్ల అమ్మకాలు 

నరసాపురం, మే 23: లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు తరువాత జిల్లాలో రద్దీగా ఎలక్ర్టానిక్‌ షాపులే కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ షాపు చూసినా కిటకిటలాడుతోంది. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఏసీలు, కూలర్లు కొనేం దుకు పరుగులు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 255పైగా ఎలక్ర్టానిక్‌ దుకాణాలు ఉన్నాయి. ఇందులో పెద్ద షాపులు 85 ఉన్నాయి. లాక్‌డౌన్‌తో తలెత్తిన ఆర్థిక మాంద్యంతో స్థోమత ఉన్నవారు ఏసీలు కొనుగోలు చేస్తే మిగిలిన వారు కూలర్లు వైపు దృష్టి సారిస్తున్నారు.


లాక్‌డౌన్‌తో ఉత్పత్తి లేకపోవడంతో డిమాండ్‌కు అనుగుణంగా కొన్ని దుకాణాలు స్టాక్‌ను అందించలేకపోతున్నాయి. అడిగిన బ్రాండ్‌ను అందించేందుకు రెండు మూడు రోజులు గడువు కోరుతున్నారు. ఇక ధరలు కూడా ఆకాశం వైపు చూస్తున్నాయి. సప్లై లేకపోవడం, డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ధరలు దిగిరావడం లేదు. చిన్న షాపు సైతం రోజుకు పదికి పైగా ఏసీలు విక్రయిస్తున్నాయి. ఇక పెద్ద షాపు అయితే 100 తగ్గడం లేదు. కొన్ని కంపెనీలు ఫైనాన్సు సదుపాయం కల్పించడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. రెండునెలల నుంచి షాపులు మూసివేయడం వల్ల ఇంత డిమాండ్‌ ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-05-24T09:46:02+05:30 IST