ఇంటి పట్టా.. ఇట్టాగేనా!

ABN , First Publish Date - 2020-12-19T05:47:40+05:30 IST

డిసెంబరు 25న పేదలకు ఇంటిస్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇళ్లస్థలాల మంజూరు చేయడమే కాకుండా మెరకపోసి, అన్ని సౌకర్యాలు సమకూర్చి మరీ అప్పగి స్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా లే అవుట్లు అన్నీ సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నాయా.. అంటే ఇంకా చాలాచోట్ల ఆ పరిస్థితి లేదు..

ఇంటి పట్టా.. ఇట్టాగేనా!
దేవరపల్లిలో అసంపూర్తిగా రోడ్డు

లోతట్టులోనే అనేక లేఅవుట్లు

మెరక.. వట్టిమాటేనా

దృశ్యమైన రిజిస్ర్టేషన్‌ హామీ

డీఫారమ్‌తో సరి...

ఇళ్ల పట్టాలపై పెదవి విరుపులు


( ఏలూరు – ఆంధ్రజ్యోతి)

డిసెంబరు 25న పేదలకు ఇంటిస్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇళ్లస్థలాల మంజూరు చేయడమే కాకుండా మెరకపోసి, అన్ని సౌకర్యాలు సమకూర్చి మరీ అప్పగి స్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా లే అవుట్లు అన్నీ సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నాయా.. అంటే ఇంకా చాలాచోట్ల ఆ పరిస్థితి లేదు.. కొన్నిచోట్ల మెరక చేయలేదు. మరికొన్ని చోట్ల రోడ్లు కూడా వేయలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రతిపాదిత స్థలాలు చెరువులై కన్పించాయి. నాలుగు అడుగుల ఎత్తున చాలాచోట్ల నీళ్లు నిలిచాయి. స్థలాలను పూడ్చి, లే అవుట్‌లు వేసి రహదారులు వేసి సిద్ధం చేయాల్సి ఉంది. ఒకపక్క పట్టాలిచ్చే గడువు దగ్గర పడుతుంటే ఏడాది కాలంగా ఈ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.   

జిల్లాలో మొత్తం 1693 లేఅవుట్లలో 1,66,340 ప్లాట్లు వేశారు. ఇందులో 1,62, 613 మందికి పట్టాలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 24, 793 మందికి టిడ్కో ఇళ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అత్యధికంగా పట్టాలు పొందే లబ్ధిదారులు ఏలూరు వాసులే.ఇక్కడ ఏకంగా 500 ఎకరాలు పైబడి నగరం నలుదిక్కులా కొనుగోలు చేశారు. అయితే నగరానికి దూరంగా దాదాపు ఏడు కిలోమీటర్ల అవతల లక్ష్మీపురంలో ప్రత్యేక లేఅవుట్‌ వేసి ఏడు వేల మంది లబ్దిదారులను అక్కడికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చొదిమెళ్ళ, శనివారపుపేటకు చెందిన వారంతా ఈ లేఅవుట్లోనే లబ్ధ్దిదారులుగా ఉన్నారు. అయితే నగరంలో ఇప్పటికే కలిసి ఉన్న శనివారపు పేట పంచాయతీలో కాకుండా ఎక్కడో చొదిమెళ్ళలో ఉన్నస్థలాన్ని కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలుగా మార్చేశారు. తమకు ఇళ్లస్థలాలు వస్తే చాలంటూ కొందరు సర్దుకుపోతుంటే మరికొందరు కొమడవోలు ప్రాంతాన్ని ప్రస్తావి స్తున్నారు. ఇక్కడ 10 వేల మంది లబ్ధిదారులకు అనువుగా దాదాపు 195 ఎకరాలు సేకరించడమే కాకుండా సమగ్రంగా లేఅవుట్లు సిద్ధం చేశారు. ఈ ప్రాంతం ఏలూరు నగర పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్‌కు, పాతబస్టాండ్‌కు, వాణిజ్య ప్రాంతంగా ఉన్న వన్‌టౌన్‌కు అత్యంత సమీపంలో ఉన్న లే అవుట్‌. శనివారపుపేట వాసులకు మాత్రం దూరంగా విసిరేసిన ప్రాంతంలో స్థలాలు ఇస్తున్నారనేది కొందరి పెదవి విరుపు. అలాగే పోణంగిలోనూ పెద్ద ఎత్తున భూమి కొనుగోలు చేసి ఇళ్లపట్టాలు సిద్ధం చేస్తుండగా ఇక్కడ కూడా భూమిని మెరక పోయడానికి అత్యధికంగా ఖర్చు అవుతుందని అది కూడా తమకే అంటగడుతున్నారనే ధోరణిలో ఇంకొందరు ఉన్నారు. గోపాలపురం నియోజక వర్గంలో అనేక ప్రాంతాల్లో లేఅవుట్లు గత భారీ వర్షాల తాకిడికి నీట మునిగాయి. ఇళ్ల స్థలాల కోసం ప్రతి పాదించిన ప్రాంతంగా అధికారులు పేర్కొంటుండగా వర్షాల తాకిడికి ఈ ప్రాంతాలన్నీ చెరువులయ్యాయి. దేవరపల్లి మండలంలోనే ఈ తరహా లేఅవుట్లు అనేకం ఉన్నాయి. అలాగే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు, ఆచంటలోనూ కొన్ని లేఅవుట్లు మరింత మెరక పోస్తే తప్ప ఇళ్లు నిర్మించు కోవడానికి ఏమాత్రం యోగ్యం కాదు. భీమవరం ప్రాంతంలోనూ లోతట్టు స్థలాలను కొనుగోలు చేసి అక్కడికక్కడే లే అవుట్లు వేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో పూర్తిగా మెరక పోయకపోతే ఇవన్నీ నివాస యోగ్యం కాకుండా చెరువులుగానే కన్పిస్తాయని లబ్ధిదారులు అంటున్నారు. 

చెప్పింది ఒకటి.. చేసేది మరొకటి 

రిజిస్ర్టేషన్‌ చేయించి మరీ ఇళ్ల పట్టా చేతికి ఇస్తాం. అంతలా భద్రత ఇస్తాం. బడుగు, బలహీన వర్గాలకు ఇదే అతి పెద్ద ఆస్తిగా ఉంటుంది. మూడేళ్ల తరువాత ఎవరైనా ఇట్టే అమ్ముకోవచ్చు.  ఇళ్లస్థలాలే కాదు. స్థలం ఇచ్చిన ప్రతి వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.. అన్ని సౌకర్యాలు కల్పిస్తా మంటే వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు.. వాటిస్థానంలో కొత్త కొత్త నిబంధనలు వచ్చి పడ్డాయి. జిల్లాలో ప్రభుత్వ భూమి అత్యల్పమే. ఇటువంటి పరిస్థితిలో భూమి కొనుగోళ్లలో మంత్రుల నియోజకవర్గాలతో పాటు అనేక చోట్ల ప్రాథమిక స్థాయిలోనే భూ దందాలు చోటు చేసుకున్నాయి. లబ్దిదారుల నుంచి వేలు వసూలు చేశారు. ఇవన్నీ బహిర్గతమై కొన్నిచోట్ల ప్రభుత్వ ప్రతిష్ట ప్రశ్నార్థకంగా మారింది.మరోపక్క ఇళ్ల పట్టాలన్నీ రిజిస్ట్రేషన్‌కు అనుకూలంగా ఉంటాయని పదేపదే చెప్పారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ ప్రస్తావన చేసేందుకు ఎవరూ సాహసించ లేదు. ఇప్పుడు డీఫారమ్‌ పట్టా చేతిలో పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.వలంటీర్లను ఎక్క డికక్కడ ఇళ్లకు పంపి రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు నకళ్లను సేకరించారు. రిజిస్ట్రేషన్‌పై ఎంతో ఆశ పెట్టుకున్న పేద వర్గాలకు ఇదొక షాక్‌గానే కన్పిస్తోంది. 

కోర్టు కేసులతో కొన్నిటికి బ్రేక్‌

నిడదవోలు మండలం కోరుమామిడిలో అర్హులైన 212 మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్‌ పడింది. అక్కడ ఎంపిక చేసిన స్థలానికి సంబంధించి కోర్టు కేసు నడు స్తున్న కారణంగా నిలిచిపోయింది. అలాగే భీమడోలు మం డలం సూరప్పగూడెం, అంబర్‌పేటలోనూ వివాదాల కార ణంగా కోర్టు కేసులతో పంపిణీ కావడం లేదు. అలాగే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది.

నందమూరుగరువులో ట్రక్కు మట్టి కూడా పడలేదు

వీరవాసరం : వీరవాసరం మండలంలో కొలిక్కిరాని లే అవుట్‌లు, వివాదస్పద భూములు, పూడికలేని స్థలాలు ఉండటంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే అధికారులను ఇంటికి పంపేందుకు కూడా వెనకాడేది లేదని హెచ ్చరించారు. దీంతో కొద్దిగా కదలిక వచ్చింది. పూడిక పనులు, రహదారుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. నందమూరుగరువులో సుమారు 5.60 ఎకరాల భూమిని ఇంటి స్థలాల కోసం సేకరించారు. రెండు లే అవుట్‌లుగా ఉన్న ఈ భూమిలో ఇంత వరకూ కనీసం ట్రక్కు మట్టి కూడా పడలేదు. భూమి అంతా తుంగ పెరిగి నిరుపయోగంగా ఉంది. కొణితివాడలో ఆరు ఎకరాల భూమిని సేకరించారు. సుమారు 220 మందికి ఈ భూమిలో స్థలాలు ఇవ్వాల్సి ఉంది. ఇటీవలే మట్టి పూడికలు ప్రారంభమయ్యాయి. 

కలెక్టర్‌ ఆదేశించినా మారని పరిస్థితి

దేవరపల్లి, డిసెంబరు 18: దేవరపల్లి మండలంలో ఇళ్ల స్థలాల లేఅవుట్లలో రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. దేవరపల్లి, దుద్దుకూరు, గౌరీపట్నం, సంగాయిగూడెం, బంధపురం గ్రామాల్లో లేఅవుట్ల రోడ్లు పూర్తికాక పోవడంపై అధికారులపై ఇటీవల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిరోజుల్లో రోడ్లను పూర్తిచేయాలని లేదంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించినా పరిస్థితి అలానే ఉంది. దేవరపల్లి, సంగాయిగూడెం, దుద్దుకూరు, గౌరీపట్నం లేఅవుట్లలో గ్రావెల్‌ రోడ్లు వేయలేదు. బంధపు రంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల లేఅవుట్లు రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్ల స్థలాల కోసం వేసిన రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.  గౌరీపట్నంలో ఇళ్ల స్థలాల లేఅవుట్లలో రోడ్లు సరిగా వేయలేదని ఎర్ర గ్రావెల్‌ వేసి చదను చేయాల్సి ఉందని గౌరీపట్నానికి చెందిన కొమ్మర సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల రోడ్లు వేసినా వర్షాలకు ధ్వంసం అయ్యాయని పల్లికొండ విజయ్‌కుమార్‌ వివరించారు.




Updated Date - 2020-12-19T05:47:40+05:30 IST