126 ఐసోలేషన్‌ బెడ్‌లు సిద్ధం

ABN , First Publish Date - 2020-03-19T11:22:48+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాఽధికి అవసరమైన చికిత్స అందించేందుకు జిల్లాలో 126 ఐసోలేషన్‌ బెడ్‌లను సిద్ధం చేసినట్లు జిల్లా

126 ఐసోలేషన్‌ బెడ్‌లు సిద్ధం

వైరస్‌ నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు

సీఎస్‌ వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ 


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కరోనా వైరస్‌ వ్యాఽధికి అవసరమైన చికిత్స అందించేందుకు జిల్లాలో 126 ఐసోలేషన్‌ బెడ్‌లను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు చెప్పారు. బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఏఏ చర్యలు తీసుకున్నదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.


ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌  వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై విస్తృత ప్రచారం చేయడంతోపాటు ప్రజలు పాటించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.జిల్లాలో వలంటీర్ల ద్వారా ప్రతీ 50 కుటుంబాలను సర్వే చేయించా మన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా వైరస్‌ అనుమానితులను గుర్తిస్తున్నట్టు చెప్పారు.


విదేశాల నుంచి వచ్చిన వారిని ఇంతవరకు జిల్లాలో 2,768 మందిని గుర్తించామన్నారు. 88 మందిని 28 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉంచి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. జిల్లాలో నాలుగు కరోనా వైరస్‌ అనుమానితులకు ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందించి వారి రక్త నమూనాలు పరీక్షలకు పంపామన్నారు. మూడు కేసులకు నెగిటివ్‌ రిపోర్టులు రాగా, మరొ కేసు రిపోర్టులు రావాల్సి ఉందని వెల్లడించారు.జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌-2 తేజ్‌భరత్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-03-19T11:22:48+05:30 IST