-
-
Home » Andhra Pradesh » West Godavari » Staff in key roles in Isolation Wards
-
మీ ధైర్యానికి సలాం..!
ABN , First Publish Date - 2020-03-25T10:45:26+05:30 IST
కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే ప్రపంచం గడగడలాడిపోతోంది. అటువంటిది ఎవరికైనా సోకినట్టు అనుమానం వస్తేనే

ఐసొలేషన్ వార్డుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బంది
రోగుల్లో ఆత్మ స్థైర్యం పెంచడంలో విశేషంగా కృషి చేస్తున్నారు
ఒంటరితనం పోగొట్టి.. జీవితంపై భరోసా కల్పిస్తున్నారు
ముందు భయం వేసినా.. ఆ తర్వాత ధైర్యం వచ్చిందంటున్న సిబ్బంది
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సలాం చెప్పాల్సిందే. కరోనా అనుమానితులను ఈ వార్డుల్లోనే అత్యవసరంగా చేరుస్తున్నారు. ప్రతీ వార్డుకు ఇద్దరు డాక్టర్లు, ఇక స్టాఫ్ నర్సు, ఒక హెడ్ నర్సు, ఒక కాంపౌండర్ దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ వార్డులోనే గడపాలి.
వీరు, పేషెంట్ తప్ప మరెవ్వరూ ఈ వార్డులోకి అడుగు పెట్టేందుకు అనుమతులే లేవు. పక్షం రోజులుగా ఐసోలేషన్ వార్డులో ఒక్కొక్కరుగా చేరుతూనే ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించి, రిపోర్టు కోసం పంపిస్తున్నారు. వీటన్నింటిలోనూ డాక్టర్ల పాత్రే కీలకం. దగ్గరుండి మరీ రోగికి సపర్యలు చేయడమే కాకుండా, వారిలో ఆత్మస్ధైర్యం నింపేందుకు ప్రయత్నించారు. ఒకటికి, రెండుసార్లు అనునయ వ్యాఖ్యాలు పలకాలి. తాము అందిస్తున్న వైద్యం కారణంగా కోలుకుంటారని ధైర్యం చెప్పాలి. ఇలా రోజువారీ మూడు షిప్టులు కొనసాగిస్తారు. వీటిలో పని చేసే ఆయా డాక్టర్లు, సిబ్బంది సేవలు అనిర్వచనీయం.
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఇప్పటికే తొమ్మిది మందికి పైగా అనుమానితులు చేరారు. వీరిలో కొందరికి ఇప్పటికే వైద్యపరీక్షలు నిర్వహించగా, వీరికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తేలింది. దీంతో రోగుల్లో ఆత్మస్ధైర్యం పెరిగింది. ఇలా ఐసోలేషన్ వార్డులో చేరిన వారంతా దాదాపు అందరూ విదేశాలకు వెళ్లొచ్చినవారే. తొలుత జలుబు, దగ్గులతో అనుమానింప బడినవారే. తీరా వైద్యపరీక్షల్లో కరోనా సోకలేదని తేలిన తర్వాత వీరి సంతోషం అంతాఇంతా కాదు. వారితోపాటే వైద్యులు, సిబ్బంది కూడా. ఇలాంటి వార్డుల్లో పనిచేయడం అందున కరోనా ఆరంభ దశలోనే సేవలు అందించాల్సి రావడం ఒకరకంగా తమకు లభించిన వరంగాను, ఇంకోవైపు ధైర్యం ఇచ్చేదిగానే ఉందని సిబ్బంది చెబుతున్నారు. కరోనా వైరస్ వార్డులో రోగిని అనుక్షణం గమనించాలి. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కంటికి రెప్పలా చూడాలి. వైద్య పరీక్షల్లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంకోవైపు రోగుల స్ధితిగతులను ఉన్నతా ధికారులకు నివేదించాలి. కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులకు స్పష్టమైన సమాచారం చెప్పాలి. మరోవైపు వృత్తి ధర్మం ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇప్పుడు ఐసోలేషన్ వార్డులో మేము అదే చేస్తున్నాం. అనుమానిత రోగులందరికీ ధైర్యం నూరిపోస్తున్నాం. సంతృప్తికర వైద్యాన్ని అందిస్తున్నామని కరోనా వార్డు కో-ఆర్డినేటర్ డాక్టర్ రఫీ అన్నారు. ఎప్పటికప్పుడు రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి తగిన జాగ్రత్తలు సాధారణ పౌరుల దగ్గర నుంచి వైద్యుల వరకు పాటిస్తూనే ఉన్నారు.
ఆ ఎనిమిది గంటలూ టెన్షన్ :
కరోనా వైరస్ నిరోధానికి వీలుగా ఏర్పాటైన ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తించాలి. వార్డులో చేరిన రోగి ఆనుపానులను కంటికి రెప్పలా చూడాలి. ఒంటరిగా ఉండే వార్డులో మేమే వాళ్ళకి సపర్యలు చేయాలి, ధైర్యం చెప్పాలి. ఎలాంటి వైద్యం అందుతుందో చెప్పి మరీ వారిలో ఆత్మస్ధైర్యం కలిగించాలి. ఎనిమిది గంటలపాటు కంటిమీద రెప్పేయకుండా టెన్షన్‌తో పని చేయాల్సి ఉంది. డ్యూటీ పూర్తయిన తర్వాత మాస్క్ దగ్గర నుంచి మిగతా వాటి అన్నింటిని తొలగించి పరిశుభ్రమైన తర్వాతే ఇంటిలో అడుగు పెట్టాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ల ఆరోగ్యాన్ని చూడాలి కదా..
- అరుణకుమారి, స్టాఫ్ నర్సు
కరోనా అంటే కంగారేసింది :
కరోనా అంటే మొదట్లో భయంగానే ఉండేది. కాని రోగులకు సేవ చేయడమే మా ఉద్యోగం. అందుకనే డ్యూటీలో ఉన్నంత సేపు వారికి కావాల్సిన సదుపాయాలను వైద్యాధికారుల సూచనల మేరకు అందిస్తూనే ఉంటాం. రోగుల్లో ఒంటరి తనం పోగొట్టాలి. అందుకోసం నిర్విరామంగా మేం వారి యోగక్షేమాలను కనుక్కుంటూనే రోగ తీవ్రత తగ్గతుందున్న సంకేతాలతో ధైర్యం ఇస్తాం. కరోనా వైరస్ వంటి నిరోధక వార్డులో పని చేయడం ఒక పరీక్షే. అయినా వృత్తి రీత్యా మేము అన్నింటికి తట్టుకుని నిలబడాలి.
- లావణ్య, హెడ్ నర్సు