సోషల్‌ క్రైం..

ABN , First Publish Date - 2020-04-12T11:07:14+05:30 IST

సోషల్‌ మీడియా కట్టు తప్పుతోంది. వైరస్‌ వ్యాప్తిపై అసత్యాలను ప్రచారం చేయడంతో ప్రజల్లో లేనిపోని భయాలను

సోషల్‌  క్రైం..

కరోనాపై కట్టు తప్పుతున్న సోషల్‌ మీడియా

అసత్య ప్రచారాలతో ప్రజల్లో ఆందోళన

తాడేపల్లిగూడెంలో  భార్యా భర్తలకు 

వైరస్‌ అంటూ వైరల్‌

పేర్లు కూడా ప్రస్తావించడం నేరం

నిబంధనలకు తిలోదకాలు


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి):సోషల్‌ మీడియా కట్టు తప్పుతోంది. వైరస్‌ వ్యాప్తిపై అసత్యాలను ప్రచారం చేయడంతో ప్రజల్లో లేనిపోని భయాలను రేపుతోంది. జిల్లాలో తాడేపల్లిగూడెంలో భార్యా భర్తలకు కరోనా వైరస్‌ సోకిందంటూ విస్తృతంగా వైరల్‌ అయింది. ఈ కట్టు కథ అంతటితో ఆగలేదు. కరోనా వైరస్‌తో ఒక వ్యక్తి మరణించారంటూ వీడియోతో సహా పోస్టింగ్‌ పెట్టారు. దీంతో స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భయాందోళనలకు గురయ్యారు. తాడేపల్లి గూడెంతో అనుబంధం ఉన్నవారంతా దీనిపై ఆరా తీయడం ప్రారంభించారు. సదరు వ్యక్తి శ్రేయోభి లాషులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ విషయ మేమిటంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఒక వ్యక్తి పేరు కూడా రాసేశారు. దీంతో ఆయన బంధువులు కూడా నమ్మాల్సిన పరిస్థితిని కల్పించారు.


తీరా ఎక్కడో జరిగిన సంఘటన వీడియోను తాడేపల్లిగూడెం పట్టణానికి           అన్వ యిస్తూ పోస్ట్‌ చేశారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  తర్వాత భార్యా భర్తలిద్దరికీ కరోనా నెగటివ్‌ వచ్చిందంటూ మరో ప్రచారం సోషల్‌ మీడియాలో సాగింది. ప్రభుత్వం నుంచి ఆ ఇద్దరిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు.  కానీ సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారంతో తాడేపల్లిగూడెం పట్టణం అల్లకల్లోలమైంది. ఇటువంటి ప్రచారాలు ఒక్క ప్రాంతానికే పరిమితం కావడం లేదు. కరోనాపై అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది కాస్లా ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మాత్రమే వెల్లడించాలన్న మార్గదర్శకాలు ఉన్నట్టు ప్రజలకు తెలియడం లేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలతో జనం లేనిపోని ఆందోళనకు గురవుతున్నారు.


Updated Date - 2020-04-12T11:07:14+05:30 IST