ఏలూరులో సీక్రెట్ వ్యవహారం.. పోలీసులకు సమాచారం.. రైడ్ చేయగా..

ABN , First Publish Date - 2020-03-09T17:27:28+05:30 IST

సీరియళ్లల్లో, సినిమాల్లోనూ నటించాలని కోరిక గలిన యువతులే వారి టార్గెట్‌. బాలికలైన, యువతులైనా అందంగా ఉంటే...

ఏలూరులో సీక్రెట్ వ్యవహారం.. పోలీసులకు సమాచారం.. రైడ్ చేయగా..

సినిమాలు, సీరియల్స్‌ పేరిట యువతులకు వల

ఆపై వ్యభిచార గృహాలకు తరలింపు

ఇతర రాష్ట్రాల నుంచి యువతులు, బాలికలను తీసుకొస్తున్న ముఠా

విశాఖ కేంద్రంగా తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వ్యభిచార గృహాల నిర్వహణ


ఏలూరు: సీరియళ్లల్లో, సినిమాల్లోనూ నటించాలని కోరిక గలిన యువతులే వారి టార్గెట్‌. బాలికలైన, యువతులైనా అందంగా ఉంటే వారే అన్నీ చూసుకుంటామంటూ నమ్మబలుకుతారు. పేదరికంలోని అందమైన యువతులు, బాలికలకు వల వేస్తారు. జూనియర్‌ ఆర్టిస్టుగా అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మబలుకుతూ ఇతర జిల్లాలకు తీసుకెళ్లిపోతారు. రోజులు తరబడి వారి వద్ద ఆ యువతులను ఉంచుకుంటారు. వారు షూటింగ్‌లో ఉన్నారంటూ నెల రోజుల పైనే పడుతుందటూ ఆ యువతుల కుటుంబ సభ్యులకు నమ్మబలుకుతూ మాయమాటలు చెబుతారు. ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి జిల్లాలు మార్చి వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ వారి చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఈ దందా కొనసాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఏలూరులో రహస్యంగా వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు.


పెంటపాడులోని వెలమపేటకు చెందిన గాదాపు చందు (30) 9వ తరగతి వరకు చదివాడు. సినిమాల్లో నటించాలన్న ఆశతో ఎక్కడ షూటింగ్‌ జరిగితే అక్కడకు వెళ్లేవాడు. అక్కడ ఉన్న డైరెక్టర్లు, ఇతర ఆర్టిస్టులను పరిచయం చేసుకుని వారితో ఫొటోలు దిగుతూ పాత్రల కోసం పడిగాపులు పడేవాడు. మొత్తం మీద కొన్ని సినిమాల్లో, సీరియళ్లలో నటించాడు. అతనికి సినిమాలు, సీరియళ్లలో నటించేటప్పుడు విశాఖపట్నంకు చెందిన ఒక జూనియర్‌ ఆర్టిస్టు పరిచయం అయ్యింది. ఆమె సీరియళ్లలో నటిస్తూ యువతులను తీసుకొచ్చి వారిచేత వ్యభిచారం చేయిస్తోంది. ఆ యువతులకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి వారి చేత వ్యభిచారం చేయించేది. ఈక్రమంలోనే ఒడిశాకు చెందిన 16 ఏళ్ల యువతిని కొన్ని రోజుల క్రితం టీవీ సీరియల్‌లో నటించడానికి అని చెప్పి విశాఖపట్నంకు తీసుకొచ్చింది. ఆ యువతికి మాయమాటలు చెప్పి బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది.


ఈ క్రమంలో జూనియర్‌ ఆర్టిస్టుగా పని చేస్తే డబ్బులు ఏమి సంపాదిస్తామని ఆలోచన చేసి, ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేస్తే తక్కువ కాలంలోనే లక్షలు సంపాదించవచ్చని చెప్పడంతో వారు ముఠాగా ఏర్పడ్డారు. విశాఖకు చెందిన మహిళకు చందు రూ.15 వేలు ఇచ్చి ఒడిశాకు చెందిన మహిళను కొద్ది రోజుల క్రితమే ఏలూరు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఏలూరు సత్రంపాడు సమీపంలోని ఎంప్లాయీస్‌ కాలనీ మూడవ రోడ్డులో అతని బాబాయి తురాయి రవి (55)తో ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంట్లో మూడు నెలల నుంచి వ్యభిచార కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. 


చందు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మించి యువతులను తీసుకొస్తుండగా అతని స్నేహితుడైన ఏలూరు కొత్తూరుకు చెందిన పెరికేటి సత్యనారాయణ (45) ఫోన్ల ద్వారా విటులను తీసుకొస్తున్నాడు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి పలు ప్రాంతాలో ఇదే విధంగా ఇళ్లను అద్దెకు తీసుకుని వారం రోజుల పాటు వ్యభిచార కేంద్రాలను నిర్వహిస్తున్నట్టు తెలిసింది. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఈ ముఠాకు స్థావరాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సమాచారం డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌కు అందడంతో ఆయన ఆదేశాల మేరకు త్రీటౌన్‌ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ మూర్తి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు వెంకటరమణ, కుమార్‌ శనివారం రాత్రి దాడి చేసి ఈ ముఠాను అదుపులోకి తీసుకుని విచారించారు. చందు, రవి, సత్యనారాయణలను అరెస్టు చేశారు. అక్కడ ఉన్న ఒడిషా యువతిని పోలీసులు సంరక్షణకు తీసుకుని ఒక హోమ్‌నకు తరలించారు. వారిపైన కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2020-03-09T17:27:28+05:30 IST