సేంద్రియమే మేలు

ABN , First Publish Date - 2020-12-20T05:20:55+05:30 IST

నాలుగేళ్ల నుంచి సేంద్రియ సాగుపై వ్యవసాయశాఖ దృష్టి పెట్టింది. రైతుల చేత సాగు చేయిస్తున్నారు. జిల్లాలో 41 వేల మంది రైతులు 40,200 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు లెక్క. అయితే సేంద్రియ సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి అందే సాయం మాత్రం అంతంతే ఉంటోంది..

సేంద్రియమే మేలు
వీరవాసరంలో సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన ధాన్యం నూర్పిడి దృశ్యం

ఏలూరు ఘటనతో ఆహారంపై శ్రద్ధ

సేంద్రియ సాగుపై అధికారుల దృష్టి

జిల్లాలో నాలుగేళ్లుగా సేంద్రియ సాగు

40,200 ఎకరాల్లో 41 వేల మంది సాగు

బయో కెమికల్స్‌తో ఆరోగ్యానికి ముప్పు

అంతుపట్టని వ్యాధులకు..  అనారోగ్యాలకు మనం  తినే ఆహారం ఒక కారణమా..? మితిమీరిన పురుగుమందులు వినియోగించి సాగు చేసిన ఆహార ఉత్పత్తులే ఇన్ని అనర్థాలకు దారితీస్తోందా..? ఏలూరు సంఘటన ప్రజలను తినే ఆహారం, తాగే నీటి గురించి ఆలోచించేలా చేసింది. ఇప్పుడు సేంద్రియ సాగుపై కూడా రైతులు దృష్టిపెట్టేలా చేసింది.   అధికారులు కూడా ఈ దిశగా అవగాహన కల్పించేందుకు  అడుగులు వేయాలి. ప్రభుత్వం రైతులకు ప్రోత్సా హం అందించాలి. మన ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది..? ఏది కీడు చేస్తుంది ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది..

భీమవరం రూరల్‌/వీరవాసరం, డిసెంబరు 19 : 

నాలుగేళ్ల నుంచి సేంద్రియ సాగుపై వ్యవసాయశాఖ దృష్టి పెట్టింది. రైతుల చేత సాగు చేయిస్తున్నారు. జిల్లాలో 41 వేల మంది రైతులు 40,200 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు లెక్క. అయితే సేంద్రియ సాగు చేసే రైతులకు ప్రభుత్వం  నుంచి అందే సాయం మాత్రం అంతంతే ఉంటోంది.. తగిన ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు కూడా ముందడుగు వేయ లేకపోతు న్నారు. ముఖ్యంగా సేంద్రియ సాగుకు కౌలు రైతులు ముం దుకు రాలేకపోతున్నారు  సాగు మొదటి సంవత్సరం దిగుబడి తక్కువ ఉంటుందని నాలుగేళ్ళ తర్వాత గానీ పురుగు మం దులు వేసిన పంటతో సమానంగా దిగుబడి రాదని రైతులు  చెబుతున్నారు. సాగులో సగం మందిపైనే కౌలు రైతులే ఉండడంతో సేంద్రియ సాగు పెరగడం లేదని అంటున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ధాన్యానికి గ్రామాలలో గిరాకీ బాగానే ఉంటున్నది. ధాన్యం బస్తాకి రూ.1300 చేతికి వస్తే సేంద్రియ సాగులో ధాన్యం బస్తా ధర రూ.1700 పెట్టి కొనుగోలు చేస్తు న్నారు. సేంద్రియ సాగులో ఎకరానికి రూ.10వేలు వరకు పెట్టుబడి తగ్గుతుందని రైతులు అంటున్నారు. 

పదేళ్లుగా పెరిగిన పురుగు మందుల వినియోగం 

పదేళ్లుగా వ్యవసాయంలో పురుగు మందులు వాడకం బాగా పెరిగింది. గతంలో వ్యవసాయానికి ఒకటి లేదా రెండు పర్యాయాలు పురుగు మందులు పిచికారీ చేసేవారు ఇప్పుడు ఆరు నుంచి ఏడుసార్లు పిచికారీ చేస్తున్నారు. రెండు సార్లు గుళికలు వేస్తున్నారు. దీంతో పురుగు మందులకే ఎకరానికి రూ.5 వేలు అవుతోంది. బయో కెమికల్స్‌పై అధికార యంత్రాంగం నిఘా పెట్టకపోవడం, వాటి వల్లే వచ్చే అనర్థాలపై రైతులకు అవగాహన లేకపోవడం కారణంగా వ్యవసాయంలో క్రిమి సంహా రక మందులు వినియోగం బాగా పెరిగింది. జిల్లాలో 1,295 ఎరు వుల షాపులు ఉండగా కోట్లలో పురుగు మందుల వ్యాపారం సా గుతోంది. కొన్నిచోట్ల ప్రభుత్వం బ్యాన్‌ చేసినవి కూడా అమ్మేస్తున్నారు. 


ప్రోత్సహిస్తే సాగు పెరుగుతుంది

సేంద్రియ సాగు చేస్తున్నాను. ఈ సార్వా పంటలో ఎకరం సాగు చేశాను. స్వర్ణ రకం 30 బస్తాలు దిగుబడి వచ్చింది. గ్రామంలో రైతులే తిండికి ఉపయోగించుకోవడానికి బస్తా రూ.1700 ఇచ్చి తీసుకున్నారు. పురుగు మందులతో సాగు చేస్తే ఎకరం 27 బస్తాలే దిగుబడి వచ్చింది. ప్రభుత్వం సహకారం ఉంటే సేంద్రియ సాగు పెరుగుతుంది. 

– బీశెట్టి శ్రీనివాస్‌, రైతు, కొణితివాడ


మొదట్లో దిగుబడి రాదు

సేంద్రియ సాగు మొదటి సంవత్సరం దిగుబడి తక్కువ ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత పురుగుమందులతో చేసిన సాగుతో పోటీగా పండుతుంది. అందువల్ల ప్రభుత్వం కొంత సహకారం అందిస్తే సాగు పెరుగుతుంది. పెట్టుబడి సేంద్రియ సాగుకు తక్కువ అవుతుంది. 

– ఎం.గోవిందరావు, రైతు, గవరపాలెం


Updated Date - 2020-12-20T05:20:55+05:30 IST