సెల్ఫ్ సెంటరే బెటర్
ABN , First Publish Date - 2020-05-29T11:19:45+05:30 IST
కరోనా నేపథ్యంలో టెన్త్ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వారి అభీష్టం మేరకే పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ..

పది పరీక్ష కేంద్రాల ఎంపికపై కసరత్తు
విద్యార్థుల అభీష్టానికే వదిలేసిన ప్రభుత్వం
321 సెంటర్లలో.. 98 చదువుతున్న పాఠశాలలే
జంబ్లింగ్తో కష్టాలు తప్పవంటున్న ఉపాధ్యాయులు
ఏలూరు ఎడ్యుకేషన్, మే 28 : కరోనా నేపథ్యంలో టెన్త్ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వారి అభీష్టం మేరకే పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ఆచరణలో పలు ఇబ్బందులు రానున్నాయి. జంబ్లింగ్ విధానంలో కేంద్రాల కేటాయింపు వల్ల విద్యార్థులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించాల్సి ఉం టుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది శ్రేయస్కరం కాదన్న ఆలోచనతో పరీక్షార్థులకు వెసులుబాటు కల్పించాలని ఇటీవల నిర్ణయించారు. లాక్డౌన్ వల్ల రెండు నెలలకుపైగా పాఠశాలల మూసివేయడంతో విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు.
హాస్టల్ విద్యార్థులకు వారు నివాసం ఉంటున్న మండలంలోని పాఠశాల లేదా ప్రస్తుతం చదువుతున్న స్కూలు ఉన్న మండ లంలో పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలను తొలుత కేటాయించారు. ఈ వెసులుబాటును విద్యార్థులందరికీ వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో గిరిజన సంక్షేమ పాఠశాల లు మినహా మిగతా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 46,760 మంది విద్యార్థుల నుంచి వారికి అనుకూలమైన పరీక్ష కేంద్రం ఎంపికపై వారి అభీష్టాన్ని తీసుకోవాలని డీవైఈవోలు, ఎంఈవోలు, హెచ్ఎంలకు సూచించారు. ఈ సమాచారాన్ని ఈ నెల 25వ తేదీ నాటికే ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపాలని ఆదేశించారు. ఇంత వరకూ మూడు డివిజన్ల నుంచి జిల్లా విద్యా శాఖకు సమాచారం అందింది.
క్షేత్రస్థాయిలో విద్యార్థుల అభీష్టానికి అనుగుణంగా పరీక్ష కేంద్రం కేటాయింపు వల్ల పలు కొత్త సమస్యలకు దారి తీసుకుందని అధికార వర్గాలు ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చాయి. కొందరు విద్యార్థులు ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ హాస్టళ్లల్లో ఉంటూ చదువుకుం టున్నారని గుర్తించారు. మరికొందరు విద్యార్థులు కోరుకున్న మండ లంలో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రంలో ఇప్పుడున్న ఫర్నిచర్, ఇతర వసతులు అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇటువంటి సమస్యలు గ్రామీణ ప్రాంత మండలాల్లో వస్తున్నాయి. పరీక్షార్ధుల అభీష్టాన్ని హెచ్ఎంలు నేరుగా తెలుసు కోవాలని సూచించినప్పటికీ జిల్లాలో ఈ విధానం ఎంత వరకు అమలైందనే సందే హాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల కోరిక మేరకే పరీక్ష కేంద్రాలను కేటాయించినప్పటికీ పలు సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.
చదువుకున్న పాఠశాలల్లోనే పరీక్ష
జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 321 కేంద్రాలు ఏర్పాటు అవుతుండగా వీటిలో 98 సెల్ఫ్ సెంటర్లే. అంటే ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అవే పాఠ శాలల్లో పరీక్షలు రాస్తారు. ఇదే విధానాన్ని మిగతా పాఠశాల లకూ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలనే వాదనలు వస్తున్నాయి. ఇలా చేస్తే ఎక్కడా ఫర్నిచర్, మౌలిక వసతుల కొరత ఉండకపోవడంతోపాటు ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తబోవని చెబుతున్నారు. ఆ ప్రకారం తొలుత అనుకున్న ట్లుగా హాస్టల్ విద్యార్థులకు మాత్రం వారు నివాసం ఉంటున్న ప్రాంతంలో పరీక్ష కేంద్రం కేటాయించినప్పటికీ మిగతా వారం దరికీ సెల్ఫ్ సెంటర్లలోనే పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం అధికారి కంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.