రెండో రోజూ అంతంతే

ABN , First Publish Date - 2020-11-04T04:47:03+05:30 IST

ఓ వైపు కరోనా భయం..పూర్తి స్థాయిలో అందని థర్మల్‌ గన్స్‌, శానిటైజర్లు.. దాదాపు ఏడు నెలల తరువాత విద్యాల యాలు తెరచుకున్నాయి.

రెండో రోజూ అంతంతే
మాదేపల్లిలో జడ్పీ పాఠశాలకు హాజరైన విద్యార్థులు

పాఠశాలలకు విద్యార్థుల హాజరు స్వల్పమే

పూర్తిస్థాయిలో అందని థర్మల్‌ గన్స్‌, శానిటైజర్లు 

స్కూళ్లను సందర్శించిన ఎంఈవో 


ఏలూరు రూరల్‌, నవంబరు 3 : ఓ వైపు కరోనా భయం..పూర్తి స్థాయిలో అందని థర్మల్‌ గన్స్‌, శానిటైజర్లు.. దాదాపు ఏడు నెలల తరువాత విద్యాల యాలు తెరచుకున్నాయి. మంగళవారం రెండో రోజు కూడా విద్యార్థులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. మండలంలో 8 జడ్పీ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 432 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మల్‌ స్కానర్లు, శానిటైజర్లు పూర్తిస్థాయిలో సరఫరా చేయలేదు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు మాత్రం తెరచుకోలేదు. మరికొన్ని రోజులు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించ డానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మండలంలోని పలు పాఠశా లలను ఎంఈవో సబ్బితి నరసింహమూర్తి సందర్శించారు. సోమవారం 9వ తరగతి విద్యార్థులు, మంగళవారం పదో తరగతి విద్యార్థులు హజర య్యారు. పదో తరగతి విద్యార్థులకు రెగ్యులర్‌గా తరగతులు నిర్వహి స్తామని, 9వ తరగతి విద్యార్థులకు రోజు విడిచి రోజు పాఠశాలలకు రావాలన్నారు. విద్యా ఉపకరణాలు ఒకరివి మరొకరు వాడవద్దని సూచించారు. ప్రైవేటు పాఠ శాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులకు యాజమాన్యాలు టీసీలు ఇవ్వకపోవడంతో చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు చేయలేక పోతున్నామని ఉపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. టీసీ లేని విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల అంగీకార పత్రంతో నమోదు చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని ఎంఈవో చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రత్యేక అంగీకార పత్రాన్ని రూపొందించి వివరాల నమోదుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.  


హడలిపోతున్న ఉపాధ్యాయులు 


కరోనా జాగ్రత్తలకు సంబంధించి అవసరమైన పరికరాలు ఇవ్వకుండా వట్టి చేతులతో యుద్ధం చేయాలంటే ఎలా అని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదుల్లో ఉన్నంత వరకూ పిల్లలను కంట్రోల్‌లో పెట్టగలుగుతామని, గది గడపదాటితే వారిని కట్టడి చేయలేకపోతున్నామని, భౌతికదూరం అసలు సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. టెంపరేచర్‌ చూసే ఽథర్మల్‌ స్కానర్స్‌ పాఠశాలకు సరఫరా కాలేదు. శానిటైజర్లు అర కొరగా సరఫరా అయ్యాయి. రెండుపూటలా తరగతి గదులను, మరుగుదొడ్లను శానిటైజ్‌ చేయాలి. అందుకు అవసరమైన లిక్విడ్‌, స్ర్పేయర్లు, సిబ్బంది లేకపోవడంతో  చాలా స్కూళ్ళల్లో శానిటేషన్‌ జరగలేదు. 


స్కూలుకు పంపుతున్నా భయంగా ఉంది : గాయత్రి, మాదేపల్లి 


కరోనా తగ్గుముఖం పడుతుండడంతో టెన్త్‌ చదువుతున్న మా అబ్బాయిని స్కూలుకు పంపాం. మాస్క్‌ అసలు తీయవద్దని చెప్పాం. అయితే ఒక పక్క భయం వెంటాడుతోంది. స్కూలు విడిచిపెట్టగానే ఎవరితో మాట్లాడకుండా నేరుగా ఇంటికి రమ్మని చెప్పాం. 

Updated Date - 2020-11-04T04:47:03+05:30 IST