పేరుకుపోయిన నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-10T06:22:27+05:30 IST

జిల్లా కేంద్రమైనప్పటికి ఏలూరులో పారిశుధ్యం విషయంలో టన్నుల కొద్దీ నిర్లక్ష్యం మేటలు వేసింది.

పేరుకుపోయిన నిర్లక్ష్యం
ఒకప్పుడు ఐదు అడుగుల లోతు ఉండే డ్రెయినేజీ ఇది. ప్రస్తుతం పూడుకుపోయి పందులకు స్థావరంగా మారింది

 సిల్ట్‌తో పూడుకుపోయిన డ్రెయిన్లు

డ్రెయినేజీలోనే కుళాయి కనెక్షన్లు

పందులు, దోమల స్వైర విహారం

నగరంలో అధ్వానంగా పారిశుధ్యం 


ఏలూరు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):  జిల్లా కేంద్రమైనప్పటికి ఏలూరులో  పారిశుధ్యం విషయంలో టన్నుల కొద్దీ నిర్లక్ష్యం మేటలు వేసింది. ప్రస్తుతం అంతు చిక్కని వ్యాధి అధికారుల అలసత్వాన్ని వెలుగులోకి తెచ్చింది.  వ్యాధి ప్రబలిన దక్షిణపు వీధి, తూర్పు వీధిలో పారిశుధ్యాన్ని చూస్తే ముక్కుపై వేలు వేసుకోవాల్సిందే. అంతగా అక్కడ పారిశుధ్యం విషమించింది. అంతుపట్టని వ్యాధి ప్రబలిన మూడు రోజుల తర్వాత అధికారులు డ్రెయిన్ల పూడికతీతకు పూనుకున్నారు. అయితే డ్రెయిన్లు ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తించలేనంతగా టన్నుల కొద్దీ వ్యర్థాలతో పూడుకుపోయాయి. ఒక్కొక్క డ్రెయిన్‌లో 3 నుంచి 4 అడుగుల మేర డ్రెయినేజీ సిల్ట్‌ పేరుకుపోయింది. దక్షిణపు వీధి మంచినీటి ట్యాంకును ఆనుకుని ఉన్న డ్రెయినేజీ పూడిపోయి రోడ్డులో కలిసిపోయింది. ఒక అడుగు వెడల్పు ఉన్న ఈ డ్రెయినేజీలో సుమారు 30 టన్నుల సిల్ట్‌ బయట పడిందంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఘటన జరగడానికి ముందు వరకూ అన్ని వీధుల్లో చెత్త పేరుకుపోయి ఉండేదని ఘటన జరగడంతో హడావుడి వాటిని తొలగించి తాత్కాలిక పారిశుధ్య చర్యలు చేపట్టారని స్థానికులు, బాధితులు చెబుతున్నారు. వీధిలోని మంచి నీటి కుళాయి పైపులు డ్రెయిన్లలోనే ఉన్నాయి. కనెక్షన్లు కూడా అందులోనే ఇవ్వడం విశేషం. ఒక్క చోట లీకేజీ జరిగినా నీరంతా మురుగుమయం కావాల్సిందే. వీధులలో పందులు స్వైర విహారం గురించి చెప్పనక్కర లేదు.

 నగరంలో వ్యాధి ప్రభావం ఎక్కువగా కనిపించిన తూర్పు వీధి పరిస్థితి కూడా ఇదే. ఈ రెండు ప్రాంతాలకు దగ్గరగా ఉన్న కత్తెపు వీధి రోడ్డుపై ఐదు అడుగుల లోతు ఉండే డ్రెయిన్‌ నిండిపోయి రోడ్డుపైకి ప్రవహిస్తోంది.  మంచినీటి కనెక్షన్ల పరిస్థితి భయానకంగా ఉంది. ప్రభుత్వం, అధికారులు పారిశుధ్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే ఈ పరిస్థితి వచ్చిందని బాధిత ప్రాంతాల ప్రజలు అంటున్నారు. నాలుగు రోజులుగా హడావుడి చేస్తున్నారే తప్ప గతంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించు కోలేదని వారు ఆరోపిస్తున్నారు.


 పూడిక తీసేవారే లేరు : నెరుసు ప్రసాద్‌, దక్షిణపు వీధి

మా బజారులో పూడిక తీసే నాథుడే లేడు. మా ఇంటి ముందు ఉండే డ్రెయిన్‌ ఐదు అడుగులు లోతు ఉండేది. ఇప్పుడు అది అడుగు లోతు కూడా లేదు. మొత్తం సిల్ట్‌తో పూడిపోయింది. ఇంత ప్రమాదం జరిగినా ఇప్పటి వరకూ దానిని తీయలేదు. పందులు ఇష్టారాజ్యం వచ్చినట్టు తిరుగుతున్నాయి. ఆదివారం బ్లీచింగ్‌ చల్లి వదిలేశారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.


 డ్రెయిన్లను తవ్వి వదిలేశారు..!

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, డిసెంబరు 9 : నూతన డ్రెయిన్లు నిర్మించడానికి ఉన్న డ్రెయిన్లను మునిసిపల్‌ సిబ్బంది తవ్వి వదిలేశారు. నెలలు తరబడి అక్కడ మురుగు పారకుండా నిల్వ ఉండడంతో దోమలు తిష్టవేశాయి. ప్రస్తుతం అంతుపట్టని వ్యాధి నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శాంతినగర్‌ 9వ రోడ్డులో డ్రెయిన్లు తవ్వి వదిలి వేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకూ కొత్తవి నిర్మించలేదు. ఆర్‌ఆర్‌పేటలో రోజుల తరబడి చెత్త ఎత్తకపోవడంతో వాటిపై పందులు దొర్లాడుతున్నాయి. 

నగరమంతా శానిటేషన్‌ చేయిస్తున్నాం

కొండలరావు, ఇన్‌ఛార్జి మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌

 అంతుపట్టని వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో నగరమంతా పరిశుభ్ర పర్చేందుకు మునిసిపల్‌ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. వన్‌టౌన్‌, టూటౌన్‌ ప్రాంతాల్లో బుధవారం క్లోరినేషన్‌ పిచికారీని అటోమేటిక్‌ మిషన్ల తో చేశాం. ప్రతి రోజు డ్రెయిన్లను శుభ్రపరుస్తున్నాం. 

Updated Date - 2020-12-10T06:22:27+05:30 IST