ఫోటో ఇస్తే పెన్సిల్‌తో రూపం
ABN , First Publish Date - 2020-02-08T11:36:54+05:30 IST
పిల్లలకు పెన్సిల్ దొరికితే ఏం చేస్తారు..? ఆర్టిస్టుల్లా ఫీలైపోతారు..కనబడిన ప్రతిచోటా గీతలు గీసేస్తారు... పుస్తకాల్లో పేజీలన్నీ బొమ్మలతో

మూడవ తరగతి నుంచే ఆసక్తి
ఇంజనీరింగ్ చదువుతూ కుటుంబానికి ఆసరా
పేదరికాన్ని జయించిన పెన్సిల్ చిత్రాలు
పాలకొల్లు కుర్రోడి ప్రతిభ
పాలకొల్లు రూరల్, ఫిబ్రవరి 7 :పిల్లలకు పెన్సిల్ దొరికితే ఏం చేస్తారు..? ఆర్టిస్టుల్లా ఫీలైపోతారు..కనబడిన ప్రతిచోటా గీతలు గీసేస్తారు... పుస్తకాల్లో పేజీలన్నీ బొమ్మలతో నింపేస్తారు.. తర్వాత అమ్మానాన్నలతో చీవాట్లు తింటారు..ఇది పిల్లలున్న ప్రతీ ఇంటా కనిపించే సీనే..అయితే అదే పెన్సిల్ ఈ చిన్నోడికి దొరికితే అద్భుతమైన చిత్రాలు గీశాడు. ఎనిమిదేళ్ళ ప్రాయంలో పెన్సిల్‌తో అద్భుత చిత్రాలు గీయడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అంతేకాదు తాను నేర్చిన చిత్రలేఖనం ద్వారా కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలుసున్నాడు. పాలకొల్లుకి చెందిన మోటార్ సైకిల్ మెకానిక్ కుమారుని ప్రతిభ ఇది..
పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన యడ్ల మాణిక్యాలరావు మోటార్ సైకిళ్లు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమారుడు సందీప్ ఉల్లంపర్రు మాంటిస్సోరీస్ స్కూలులో 3వ తరగతి చదువుతూ ఉండగా గాంధీజీ చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించారు. ఉన్నత పాఠశాల విద్యార్థులు చిత్రలేఖనం పోటీలో పాల్గొనగా సందీప్ ఉత్సాహంగా పెన్సిల్‌తో ఒక చిత్రాన్ని గీశాడు. ఆ చిత్రానికి కన్సొలేషన్ బహుమతి లభించింది. పోటీలలో సందీప్ పాల్గొనకపోయినా అతడి ప్రతిభ గుర్తించి బహుమతి ఇచ్చారు. అప్పటి నుంచి సందీప్‌లో చిత్రలేఖనంపై ఇష్టం పెరిగింది..
పేదరికాన్ని జయించిన పెన్సిల్ చిత్రాలు
సందీప్ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి మోటర్ మెకానిక్ కావడంతో ఉన్నత చదువులు చదివించలేని పరిస్థితి. సందీప్ ఖాళీ సమయాల్లో ఆన్‌లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్లకు పెన్సిల్ ఉపయోగించి చిత్రాలు గీసి కొరియర్ ద్వారా పంపించి ఒక్కొక్క చిత్రానికి రూ.800 వరకూ ఆర్జిస్తున్నాడు. ఆ విధంగా నెలకు సుమారు రూ.10 వేలు ఆర్జిస్తున్నాడు. తన ఫీజులు కట్టుకుంటూ తన చెల్లిని కూడా తాడేపల్లిగూడెంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరంలో చేర్పించాడు. ఇంటి అవసరాలకు కూడా కొంత సొమ్ము ఇస్తున్నట్టు సందీప్ తెలిపాడు.
పక్కింటి వ్యక్తి స్ఫూరితో...
మూడో తరగతి చదువుతున్న సమయంలో పక్కింట్లో నివాసం ఉండే నిడదవోలు చలమయ్య నాయుడు అనే అతను చ్రితాలు వేయడం చూసి సందీప్ చిత్రలేఖనం పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. అనంతరం అతని మేనమామ తాళ్ళపూడి ఈశ్వర్ చిత్రకారుడు కావడంతో ఆయన వద్ద శిక్షణ పొందాడు. దీంతో కళాశాల నుంచి వచ్చిన తరువాత ఖాళీ ఉన్న సమయాల్లో పెన్సిల్ ఉపయోగించి చిత్రాలు గీయడంలో మెళకువలు తెలుసుకు న్నాడు. ఆన్‌లైన్ ద్వారా రెండేళ్ళ క్రితం నుంచి ఆర్డర్లు పొందుతూ ఒక్కో చిత్రానికి రూ.600 నుంచి రూ.800 వరకూ ఛార్జ్ చేస్తున్నాడు.
యానిమేషన్ రంగంలో స్థిరపడాలి: యడ్ల సందీప్, పెన్సిల్ చిత్రకారుడు, ఉల్లంపర్రు.
బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్ కోర్సును పూర్తి చేసి యానిమేషన్ (క్రియేటివిటీ) రంగంలో స్థిరపడాలనే లక్ష్యంతో చిత్రాలు గీస్తున్నాను. తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయపడడంతో పాటు, నా సోదరిని చదివించడం నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. యానిమేషన్ రంగంలో ప్రవేశించేందుకు అవసరమైన బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేసేందుకు పెన్సిల్ చిత్రాల ద్వారానే ఆర్జించాలని అనుకుంటున్నాను.