ట్రాక్టర్లకు ఇసుక కష్టాలు

ABN , First Publish Date - 2020-02-12T12:25:52+05:30 IST

ఇసుక రవాణా చేస్తూ ట్రాక్టర్లపై ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లు, యజమానులకు ప్రభుత్వ కొత్త పాలసీతో

ట్రాక్టర్లకు ఇసుక కష్టాలు

పరిమితులతో ఆదాయానికి గండి

ఖర్చులు రావడం లేదని ఆవేదన

జీపీఎస్‌తో మరిన్ని సమస్యలు

ఒక యూనిట్‌ రవాణాకే అనుమతి 

రెండు యూనిట్లకు పెంచాలని డిమాండ్‌

కలెక్టర్‌ను కలిసిన యజమానులు, డ్రైవర్లు


ఏలూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఇసుక రవాణా చేస్తూ ట్రాక్టర్లపై ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లు, యజమానులకు ప్రభుత్వ కొత్త పాలసీతో కష్టాలు మొదలయ్యాయి. కొత్తగా వచ్చిన నిబంధనలతో ఆదాయం దారు ణంగా పడిపోయిందని కనీసం ఖర్చులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తామంతా వీధులపాలవ్వక తప్పదని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ను కలిసి తమ గోడు విన్నవించుకునేందుకు జిల్లాలోని పలు మండలాల నుంచి స్పందన కార్యక్రమానికి వచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జిల్లాలో దాదాపు రెండు వేల కుటుం బాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఖర్చులకు కూడా గిట్టనివైనం

ప్రస్తుతం ప్రభుత్వం రూపొందించిన ఇసుక పాలసీలో రోజుకు ఒక ట్రిప్పుకు మించి వీరికి అవకాశం ఉండడం లేదు.ఎందుకంటే లారీలు వెళ్లడానికి వీలుపడని ఇరుకుగా ఉండే ప్రాంతాలకు మాత్రమే వీరిని పంపుతున్నారు. దీంతో గంటల గంటలు క్వారీలు, స్టాక్‌పాయింట్ల దగ్గర పడిగాపులు పడి చివరకు ఇరుకు రోడ్ల గుండా ఇసుకను గమ్యం చేర్చడానికే వీరికి రోజంతా సరిపోతోంది.ఒక ట్రిప్పుకు ఒక యూనిట్‌ అంటే నాలుగున్నర టన్నుల ఇసుక తరలించడానికి మాత్రమే అవకాశం కల్పించారు.


అది కూడా ట్రిప్పు పరిమితి 30 కిలో మీటర్లకు మించ రాదన్నది ప్రభుత్వ నిబంధన. దీనికి ప్రభుత్వం నిర్ణయిం చిన రవాణా చార్జి 1,350 రూపాయలు. ఇది ఖర్చులకు మాత్రమే సరిపోతోంది. ట్రాక్టరు నడిపేందుకు అయ్యే డీజిల్‌, మెయింటెనెన్స్‌, డ్రైవర్‌ కూలీ, ఇతర ఖర్చులు పోను మిగిలేదేమీ లేదు. రోజంతా క్వారీ దగ్గరపడి ఇసుక సరఫరా చేస్తే కూలీకి వచ్చినంత ఆదాయం కూడా ఉండడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. గతంలో దగ్గరగా ఉండే చుట్టుపక్కల ప్రాంతాలకు రెండు, మూడు ట్రిప్పులు వేసే అవకాశం ఉండేదని, రవాణా శాఖ అనుమతించిన మేరకు ట్రిప్పుకు 10 టన్నుల వరకూ రవాణా చేసేవారమని అప్పుడు తమకు కొంత గిట్టుబాటు ఉండేదని వారు చెబుతున్నారు. 


జీపీఎస్‌ కష్టాలు

ప్రస్తుతం జిల్లాలో 39 ఇసుక ర్యాంపులు ఉన్నాయి. మూడు స్టాక్‌యార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1544 వాహనాలు ఇసుక తరలింపు కోసం రిజిస్టర్‌ అయి ఉన్నాయి. వీటిలో ట్రాక్టర్లు 241, ఆరు చక్రాల లారీలు 645, 10 చక్రాల లారీలు 632, 12 చక్రాల లారీలు 22 ఉన్నాయి. ఇసుక తరలింపులో రిజిస్టరైన 241 ట్రాక్టర్లపై సుమారు 2000 మంది ఆధారపడినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం వాహనాలన్నింటికీ జీపీఎస్‌ ఏర్పాటు చేశారు. దీనివల్ల అదనపు ట్రిప్పులకు అవకాశం కూడా ఉండడం లేదని ట్రాక్టర్‌ డ్రైవర్లు అంటున్నారు. జీపీఎస్‌ ఏర్పాటు చేయడం వల్ల బుక్‌ ఆయిన ఆర్డర్లు కూడా పోతున్నాయని, ఒక ఆర్డర్‌ పోతే మరలా ఆర్డరు వచ్చేవరకూ వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు. ఇసుక బుక్‌ చేసుకున్నవారు చాలామంది వారు నివాసముండే ప్రాంతానికి జీపీఎస్‌ లొకేషన్‌ ఇస్తున్నారు. వారు కట్టుకునే నిర్మాణం వేరే చోట ఉంటోంది. అధికారులు జీపీఎస్‌ లొకేషన్‌ ఉన్నచోట మినహా ఎక్కడ ఇసుక అన్‌లోడ్‌ చేసినా కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో వినియోగదారులు బుకింగ్‌ ఆర్డర్‌ను కాన్సిల్‌ చేసుకుంటు న్నారు. ఇలా చేసినరోజున ఒట్టి చేతులతో ఇంటికి పోవాల్సిందేనని డ్రైవర్లు వాపోతున్నారు.  


100 కిలోమీటర్లకు అనుమతించరూ..

ట్రాక్టర్‌ డ్రైవర్లు, యజమానులు ట్రిప్పుకు రెండు యూనిట్ల ఇసుకకు లేదంటే ట్రిప్పుకు 100 కిలోమీటర్లకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. దీని వల్ల తమకు ఖర్చులు కలిసి వస్తాయని తద్వారా తమకు జీవనోపాధి ఉంటుందని అంటున్నారు. దూరం పెరిగితే ఆయిల్‌ ఖర్చులు కలిసి వస్తాయని, ఇసుక పరిమాణం పెంచినా తమకు అంతే పరిమాణంలో డీజిల్‌ ఖర్చవుతుందని తద్వారా తమకు గిట్టుబాటు కలిగే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. దూర ప్రాంతాలకు లారీలకు మాత్రమే అవకాశం ఇవ్వడం, లారీలతో తమను పోటీకి పెట్టడం వల్ల తమకు నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమానులకు నిర్వహణ ఖర్చులు కూడా రాకపోవడంతో వారు ట్రాక్టర్లను వేరే పనులకు ఉపయోగించుకునే ఆలోచన చేస్తున్నారు. ఇదే గనుక జరిగితే తమలాంటి ఎంతోమంది డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్‌, గనుల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు తమ బాధలను అర్థం చేసుకుని న్యాయం చేయాలని ఖర్చులు కూడా రావడం లేదు


జీవరత్నం, ట్రాక్టర్‌ యజమాని

రూపాయి రూపాయి కూడేసి ట్రాక్టర్‌ కొనుక్కుని నడుపుకుంటున్నాం. నిబంధనల వల్ల మాకు కూలీల జీతాలు, ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదు.  20 ఏళ్లుగా వీటిమీదే ఆధారపడి బతుకుతున్నాం. మాకు వేరే ప్రత్యామ్నాయ ఉపాధి కూడా లేదు. ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగిస్తే మేం ఇక ట్రాక్టర్లను వదిలేసు కోవాల్సిందే. మా కుటుంబాలు వీఽధిన పడాల్సిందే.


Updated Date - 2020-02-12T12:25:52+05:30 IST