టోల్ ప్లాజా వద్ద అదే నరకం
ABN , First Publish Date - 2020-09-14T10:34:31+05:30 IST
నీట్ పరీక్ష రాసేందుకు జిల్లా మీదుగా బయలుదేరిన విద్యార్థులు కలపర్రు టోల్ గేటు వద్ద నరకయాతనకు గురయ్యారు.
గంటల తరబడి కదలని వాహనాలు
ఏలూరు క్రైం, సెప్టెంబరు 13 : నీట్ పరీక్ష రాసేందుకు జిల్లా మీదుగా బయలుదేరిన విద్యార్థులు కలపర్రు టోల్ గేటు వద్ద నరకయాతనకు గురయ్యారు. జిల్లావాసులకు విజయవాడలోని నీట్ పరీక్ష కేంద్రాలను ఇవ్వడంతో వారంతా ఆదివారం పరీక్ష రాసేందుకు బయలుదేరారు. మధ్యాహ్నం పరీక్ష రెండు గంటలకు అయినప్పటికీ పరీక్ష హాలుకు ఒకేసారి విద్యార్థులందరూ రాకుం డా సమయం వారీగా స్లాట్‌లను ఇచ్చారు. వాహనాల్లో వెళ్తున్న వీరంతా కలపర్రు టోల్‌గేటు వద్ద ఆదివారం ఉదయం చిక్కుబడి పోయారు. కలపర్రు నుంచి రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ వర కూ వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌గేటు వద్ద నిర్వాహకులు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు.
వాహనాల రద్దీ పెరిగిపోవడంతో టోల్ టాక్స్ చెల్లించేందుకు వాహనదారులు అర గంటపాటు ట్రాఫిక్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఇచ్చిన స్లాటు సమయానికి చేరుకుంటామో లేదోనని వారు ఆందోళన పడ్డారు. ఇంకోవైపు కలపర్రు టోల్‌గేటు దాటామని వారు ఊపిరి పీల్చుకునేలోపే మరోవైపు పొట్టిపాడు టోల్ గేటు వద్ద ఇదే పరిస్థితి కనబడి ఇరవై నిమిషాలు అక్కడే అగిపోవాల్సి వచ్చింది. అయితే చాలామంది అతి కష్టం మీదే పరీక్ష కేంద్రాలకు చేరుకు న్నారు. టోల్ గేట్ల వద్ద 15 నిముషాలు దాటి వాహనాలు నిలిచి ఉంటే టోల్ ట్యాక్స్ వసూలు చేయకుండా వాహనాలను వెంటనే వదిలివేయాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనను టోల్‌గేట్ల నిర్వాహ కులు అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదా రులు వాపోయారు. రెండో రోజూ ఇదే పరిస్థితి నెలకొంది.