కొత్త సర్వీసులపై ఆర్టీసీ దృష్టి
ABN , First Publish Date - 2020-05-24T09:36:48+05:30 IST
జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కొత్త బస్సు సర్వీసులు నడపడంపై జిల్లా ఆర్టీసీ అధికారులు ..

రాజమహేంద్రవరం అర్బన్, మే 23: జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కొత్త బస్సు సర్వీసులు నడపడంపై జిల్లా ఆర్టీసీ అధికారులు దృష్టిపెడుతున్నారు. గతంలోని సర్వీసులను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు పాటిస్తూనే సర్వీసులు పెంచుకుంటూ వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం కాకినాడనుంచి తిరుపతి, రాజమహేంద్రవరం నుంచి పలాసకు బస్సులు నడిపారు.
ఆదివారం మరిన్ని దూరప్రాంత సర్వీసు లు నడపనున్నారు. కాకినాడ నుంచి అనంతపూర్, కడప బస్సు సర్వీసులు నడిపితే ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే చర్చించారు. ఇదే సమయంలో జిల్లాలోని 9 డిపోల నుంచి విజయవాడ, విశాఖపట్నానికి సర్వీసులు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రాజోలు, రావులపాలెం ప్రాంతాల నుంచి మాత్రమే విజయవాడ, విశాఖపట్నం రూటులో సర్వీసులు నడిపారు. ఆదివారం నుంచి తుని, ఏలేశ్వరం డిపోల నుంచి కూడా దూరప్రాంత సర్వీసులు నడపనున్నారు.
లోకల్ ఆపరేషన్స్ పైనా దృష్టి
శనివారం లోకల్ ట్రాఫిక్ కొద్దిగా పెరగడంతో బస్సుల సంఖ్య కూడా గణనీయంగా పెంచారు. 157 సర్వీసులు నడపాలని ముందుగా భావించినా రద్దీ పెరగడంతో వివిధ ప్రాంతాలకు మొత్తం 201 బస్సు సర్వీసులు నడిపారు. ఆదివారం 250 సర్వీసులు నడపనున్నారు. కాగా, తొలిరోజున రూ.5 లక్షల మేర ఆదాయం రాగా రెండో రోజైన శుక్రవారం రూ.7 లక్షల ఆదాయం సమకూరింది. దీంతో లోకల్ ఆపరేషన్స్ మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రీజనల్ మేనేజర్ ఆర్‌వీఎం నాగేశ్వరరావు తెలిపారు. రాబోయే రోజుల్లో నెమ్మదినెమ్మదిగా లోకల్ ఆపరేషన్స్ మరింత పెంచుతామని, అన్ని రూట్లలోనూ సర్వీసులు నడిపే ఆలోచన చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.