వసూల్‌..దారులు

ABN , First Publish Date - 2020-11-07T05:30:00+05:30 IST

రోడ్డెక్కితే టోల్‌.. ఇదేం కొత్త కాదు కదా.. జాతీయ రహదారి ఎక్కితే టోల్‌ కడతాం.. ఇక నుంచి జాతీయ రహదారి ఒక్కటే కాదు సుమా.. ఏ రహదారి ఎక్కినా టోల్‌ కట్టాల్సిందే.

వసూల్‌..దారులు
తంగెళ్లమూడి – జంగారెడ్డి గూడెం రహదారి దుస్థితి

బాదుడుకు రంగం సిద్ధం   8 తొలి దశలో జిల్లాకు రెండు టోల్‌ గేట్లు

ఏలూరు – జంగారెడ్డిగూడెం, భీమవరం – విజయవాడ?

తాత్కాలిక మరమ్మతులకు అంచనాలు కోరిన ప్రభుత్వం

 ఏలూరు, ఆంధ్రజ్యోతి 

 రోడ్డెక్కితే టోల్‌.. ఇదేం కొత్త కాదు కదా.. జాతీయ రహదారి ఎక్కితే టోల్‌ కడతాం.. ఇక నుంచి జాతీయ రహదారి ఒక్కటే కాదు సుమా.. ఏ రహదారి ఎక్కినా టోల్‌ కట్టాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర  ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లా వాసులు ఇప్పటికే రెండు, మూడు చోట్ల టోల్‌ చార్జీలు చెల్లిస్తున్నారు. ఏలూరు నుంచి విజయవాడ వెళ్లాలంటే కలపర్రు, పొట్టిపాడు టోల్‌గేట్ల్లలో, తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వెళ్లా లంటే ఉంగుటూరు సహా పైరెండు చోట్ల వెరసి మూడు చోట్ల టోల్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఒక సాధారణ బస్సు ప్రయాణికుడు రూ.8 నుంచి రూ. 17 వరకూ బస్సు చార్జితో పాటు టోల్‌ టాక్స్‌ అదనంగా చెల్లిస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్‌ పేరుతో అదనపు భారాన్ని మోపే యోచన చేస్తుండడంతో వాహనదారులు కలవరపాటుకు గురవుతున్నారు.రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులపై టోల్‌ గేట్లు పెట్టాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా ప్రభుత్వం పని ప్రారంభించేసింది. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి టోల్‌గేట్‌ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉన్న రహదారులకు సంబంధించిన అంచనాలను పంపాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు కూడా అంతే వేగంగా స్పందించి రహదారుల మరమ్మతుల అంచనాలను అధికారులకు పంపించేశారు. జిల్లాలో మొత్తం 3,219.3 కిలోమీటర్ల రహదారులు ఉండగా ఏడాదిన్నర నుంచి వాటిని పట్టించుకోకపోవడంతో 90 శాతం రోడ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ప్రస్తుతం జిల్లాలో 1057.4 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు, 585.3 కిలో మీటర్ల జిల్లా ప్రధాన రహదారులు ఉండగా వాటికి సంబంధించి టోల్‌ గేట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.


 రెండు రోడ్లకు టోల్‌ గేట్లు ఖాయమేనా..?

జిల్లాలో ఏలూరు– జంగారెడ్డిగూడెం రాష్ట్ర రహదారికి సంబంధించి ఏలూరు నుంచి 51.73 కిలో మీటర్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.6 కోట్లు, భీమవరం నుంచి కలిదిండి మీదుగా గుడివాడ, విజయవాడ వెళ్లే రహదారికి సంబంధించి భీమవరం నుంచి 20.96 కిలోమీటర్లకు మరమ్మతుల నిమిత్తం రూ. 3.6 కోట్ల  అంచనాలను అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఈ తాత్కాలిక మరమ్మతుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై శాశ్వత టోల్‌ విధానానికి శ్రీకారం చుట్ట బోతోందని తెలుస్తోంది. మరమ్మతులు పూర్తయిన తరువాత ఖర్చులు వసూలు చేయడం పేరుతో ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డులో తడికలపూడి సమీపంలో ఒకటి, భీమవరం గుడివాడ రోడ్డులో కలిదిండి సమీపంలో ఇంకొకటి టోల్‌గేట్లు ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 

Updated Date - 2020-11-07T05:30:00+05:30 IST