అడుగడుగునా ఆటంకమే..

ABN , First Publish Date - 2020-11-07T05:04:10+05:30 IST

ఏ రహదారి చూసినా ఏముంది అన్నీ గోతులే.. అసలు గోతులు లేని రహదారి లేదంటే అతిశయోక్తి కాదేమో..

అడుగడుగునా ఆటంకమే..
గోతులమయంగా పెంటపాడు ముదునూరు వెళ్లే కేఎన్‌ రహదారి

అధ్వానంగా రహదారులు 

ప్రయాణించాలంటే వణుకు

కన్నెత్తి చూడని అధికారులు

వాహనదారులకు ఇక్కట్లు

పెంటపాడు, నవంబరు 6 : ఏ రహదారి చూసినా ఏముంది అన్నీ గోతులే.. అసలు గోతులు లేని రహదారి లేదంటే అతిశయోక్తి కాదేమో.. అంతలా పల్లె పట్టణ రహదారులు తయారయ్యాయి. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే రహదారులదీ ఇదే దుస్థితి. అయినా అధికా రులు కనీస చర్యలు చేపట్టడం లేదు. నాయకులూ కన్నెత్తి చూడడం లేదు.వాహనదారులు మాత్రం ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు. ప్రస్తుతం పాదయాత్ర ప్రారంభించిన నాయకులు రోడ్ల సమస్యలను పరిష్కరిస్తే చాలని ప్రజలంటున్నారు. పెంటపాడు నుంచి ముదునూరు మీదుగా పిప్పర వెళ్లే కేఎన్‌ రహదారి గోతులతో అధ్వానంగా తయారైంది. ఈ రహదారి నిత్యం ప్రయాణికులతో బిజీగా ఉంటుంది. అటువంటి రహదారిపై ప్రయాణాలు చేయాలంటే వాహనదారులు వణికిపోతున్నారు. రహదారి మొత్తం కనీసం దారి కనిపించకుండా గోతులతో నిండిపో యింది.ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదానికి గురికాక తప్పదు. ఇక పెంటపాడు నుంచి కే.పెంటపాడు, మీదుగా పడమరవిప్పర్రు వెళ్లే రహదారి కూడా అధ్వానంగా మారింది. సంవత్సరాల తరబడి ఈ రహదారి కనీస మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. ఈ రహదారిపై ఇప్పటికే అనేక మంది ప్రమాదాలకు గురై కాళ్ళు, చేతులు విరగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. పడమరవిప్పర్రు గ్రామంలో అయితే మోకాలి లోతు గోతులు పడిపోయాయి. చినుకులు పడితే చాలు గ్రామస్థులు ఈ రహదారిపై ప్రయాణాలు చేయలేక నరకాన్ని చవిచూస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారుల మరమ్మతులపై దృష్టి సారించాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.




Updated Date - 2020-11-07T05:04:10+05:30 IST