-
-
Home » Andhra Pradesh » West Godavari » Rejection of nominations in both ZPTC
-
టీడీపీకి షాక్..
ABN , First Publish Date - 2020-03-13T11:39:37+05:30 IST
పరిషత్ పోరులో తెలుగుదేశం పార్టీకి తొలి ఎదురుదెబ్బ తగిలింది. నామినేషన్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటిం

రెండు జడ్పీటీసీల్లో నామినేషన్ల తిరస్కరణ
ఒకరికేమో సంతాన సమస్య
ఇంకొకరికి నామినేటెడ్ పోస్టు ఉండడం
టీడీపీలో నివ్వెరపాటు
సరిచూసుకోకపోవడంతో మూల్యం
ఎంపీటీసీ స్థానాల్లోనూ డజన్ల సంఖ్యలో నామినేషన్ల తిరస్కరణ
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పరిషత్ పోరులో తెలుగుదేశం పార్టీకి తొలి ఎదురుదెబ్బ తగిలింది. నామినేషన్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటిం చకపోవడం కారణంగా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఉంగుటూరు నియోజక వర్గ పరిధిలోని నిడమర్రు జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ తరపున దాఖలైన నామినేషన్ తిరస్కరించారు. అలాగే చింతలపూడి జడ్పీటీసీ స్థానానికి దాఖలైన మరో నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. జిల్లాలో దాదాపు డజన్ల సంఖ్యలో ఎంపీటీసీల నామినేషన్లు కూడా బుట్టదాఖలయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా 48 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో వైసీపీ, టీడీపీ మధ్య భారీ పోటీ నెలకొంది. చింతలపూడి జడ్పీటీసీ స్థానానికి టీడీపీ నుంచి లలిత కుమారి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ముగ్గురు సంతానం కలిగి ఉన్నారనే అభియోగంపై లలితకుమారి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో కీలకమైన స్థానానికి టీడీపీ పోటీ చేయ కుండా వెనుతిరిగినట్టు అయ్యింది.నిడమర్రు మండల జడ్పీటీసీ స్థానానికి రామ్మూర్తి నామినేషన్ దాఖలు చేశారు.అయితే ఆయన ఇంతకుముందే స్థానిక సాగునీటి సంఘానికి బాధ్యులుగా ఉన్నారు. ఆ పదవికి రాజీనామా సమర్పించాల్సి ఉంది. ఆయన రాజీ నామా చేశారు గాని రాజీనామా పత్రాన్ని జోడించకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇప్పటికే నువ్వానేనా అన్నట్టుగా వైసీపీ, టీడీపీ మధ్య పోటీ ఉండగా ఏకంగా రెండు జడ్పీటీసీ స్థానాలను టీడీపీ తొలి పోరులోనే చేజార్చుకోవాల్సి వచ్చింది.
ఎంపీటీసీల్లోనూ నిష్క్రమణ
నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు లేకపోవడంతో డజన్ల సంఖ్యలోనే వివిధ మండలాల్లో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.
వీరవాసరం మండలం కొణితవాడ ఎంపీటీసీ స్థానానికి జనసేన తరపున నామినేషన్ వేసిన శ్రీదుర్గ ముగ్గురు సంతానం కారణంగా తిరస్కరించారు.
పెదపాడు మండలం వట్లూరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి జ్యోతి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి.
భీమడోలు మండలం పోలసానిపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ప్రమీలారాణి నామినేషన్ బుట్టదాఖలైంది.
పెదతాడేపల్లిలో టీడీపీకి చెందిన పరిమి సూర్యారావును కాంట్రాక్టర్‌గా చూపించి నామినేషన్ తిరస్కరించారు. కక్ష కట్టి ఇలా చేశారని మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్ ఆరోపిస్తూ దీనిపై కోర్టుకు వెళతామన్నారు.
పెంటపాడు మండలం రాచర్లలో టీడీపీకి చెందిన ప్రధాన అభ్యర్థి కొండ్రెడ్డి వాణీసత్యదుర్గ నామినేషన్ సంతకాలలో తేడా వచ్చిందంటూ అధికారులు తిరస్కరించారు. అభ్యర్థి సంతకం చేయాల్సిచోట ప్రతిపాదించిన వారు చేశారని, ప్రతిపాదించిన వారు సంతకం పెట్టాల్సిన ప్రదేశంలో అభ్యర్థి పెట్టారని దీనివల్ల తిరస్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
368 నామినేషన్లు ఓకే..
జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మూడు రోజులలో మొత్తం 370 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం స్థానిక జడ్పీ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. జడ్పీటీసీ ఎన్నికల అధికారి, జడ్పీ సీఈవో పులి శ్రీనివాసులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న రెండు నామినేషన్లు తిరస్కరించారు. దీంతో 368 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. మొత్తం 343 మంది అభ్యర్థులు 370 నామి నేషన్లు దాఖలు చేశారు. జడ్పీటీసీ ఎన్నికలకు దాఖలు చేసిన 370 నామినేషన్లలో టీడీపీ 118, వైసీపీ 126, జనసేన 27, బీజేపీ 40, కాంగ్రెస్ 33, బీఎస్పీ 7, సీపీఎం 6, సీపీఐ 3, ఇండిపెండెంట్లు 10 మంది ఉన్నారు.