పౌల్ట్రీ పల్టీ

ABN , First Publish Date - 2020-03-04T11:39:28+05:30 IST

కరోనా వదంతులతో పౌల్ట్రీ రైతులు కుదేలయ్యారు. వరుస నష్టాలతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పౌల్ట్రీ  పల్టీ

తగ్గిన గుడ్డు ధరలు.. నష్టాల బారిన రైతులు

చికెన్‌దీ అదే దారి..పడిపోయిన అమ్మకాలు


 తణుకు, మార్చి 3 : కరోనా వదంతులతో పౌల్ట్రీ  రైతులు కుదేలయ్యారు. వరుస నష్టాలతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌల్ట్రీ రంగంలో ఒడిదుడుకులు సహజంగానే ఉంటాయి. అయితే కరోనా వైరస్‌ వదం తులతో ఇటీవల మరింత నష్టాలను మూటగట్టుకుంటోంది.  సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులతో తీవ్ర ప్రభావం చూపింది.   ప్రతీ రోజు 56 లక్షల రూపాయల మేర నష్టం వస్తోంది.  గత 15 రోజులుగా పరిస్థితి ఇలానే ఉండటంతో పౌల్ట్రీ  రైతులు అల్లాడిపోతున్నారు. 


 గుడ్డు ధర  కిందికి..

గత నెలలో గుడ్డు ధర నిలకడగా లేదు.. రూ.3.10 పైసలు నుంచి 4 రూపాయల వరకు ఎగబాకి మళ్ళీ పడిపోయింది.  ఈనెలలో కూడా రైతులకు గిట్టుబాటు ధరంటూ లేకుండా పోయింది. ప్రస్తుతం రూ.3.40 పైసలు ఉంది. కనీసం రూ.4 ఉంటేగాని గిట్టుబాటు అయ్యే పరిస్ధితి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక గుడ్డుకు 70 పైసలు చొప్పున నష్టం వస్తున్నది. దీంతో రోజుకు 56 లక్షల రూపాయల మేర నష్టం వస్తోంది. జిల్లాలో కోటి కోళ్లు వరకు ఉన్నాయి. ప్రతీ రోజు 80 లక్షల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. స్థానికంగా వినియోగం పోను మిగిలిన కోడుగుడ్లు ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌కు ఎగుమతి అవుతున్నాయి. అయితే అక్కడ కరోనా వైరస్‌ వల్ల కొనుగోలు చేసే నాధుడు లేడని దీంతో అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని రైతులు వాపోతున్నారు. 


అమ్మకాలు పడిపోయిన చికెన్‌

ఈ ఎఫెక్ట్‌ చికెన్‌ అమ్మకాలపైనా పడింది. అమ్మకాలు భారీగా పడిపోయాయి.సాధారణ రోజులలో ప్రధాన పట్టణా లతో పాటు గ్రామాల్లో కనీసం 50 వేల కోళ్లు అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ విధంగా నెలకు 14 లక్షల కోళ్లు అమ్మకాలు ఉంటాయి. ఒక్క ఆదివారమే కనీసం లక్షా 50 వేలు కోళ్లు చొప్పున 20 లక్షల కోళ్లు నెలకు విక్రయాలు జరుగుతుంటాయి. అయితే కరోనా వైరస్‌ ప్రభావమా అంటూ 20 రోజుల నుంచి నాలుగో వంతుకు అమ్మకాలు పడిపోయాయి. గత ఆదివారం స్వల్పంగా అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. 


వైరస్‌ కారణంగా మృతిచెందిన కోళ్లను కాలువలు, రహదారుల పక్కన పారేయడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెంటపాడు మండలం రావిపాడు వెంకయ్య ఒయ్యేరు కాలువ సమీపంలో మృతిచెందిన కోళ్లను సంచులలో మూటలుగా కట్టి పడేశారు. వైరస్‌ వల్ల కోళ్లు మృతిచెందితే వాటిని ఉప్పువేసి గొయ్యితీసి పూడ్చాల్సి ఉంటుంది. కానీ కొంతమంది రాత్రివేళల్లో చనిపోయిన కోళ్లను మూటలుగా కట్టి పారేస్తున్నారు. గతంలో ప్రత్తిపాడు జాతీయ రహదారిపై కూడా వేలసంఖ్యలో కోళ్లను సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఈ విధంగానే పడ వేశారు. పత్రికా కథనంతో స్పందించిన అధికారులు వాటిని గొయ్యితీసి పూడ్చివేశారు.  


Updated Date - 2020-03-04T11:39:28+05:30 IST