మునిసిపల్‌ ఎన్నికలకు సిద్ధం

ABN , First Publish Date - 2020-02-08T11:43:12+05:30 IST

జిల్లాలో పట్టణ స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్టు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు రాష్ట్ర

మునిసిపల్‌ ఎన్నికలకు సిద్ధం

మొత్తం ఓటర్లు 7.84 లక్షల మంది 

తణుకు మినహా ఓటర్ల జాబితా విడుదల 

పోలింగ్‌ సిబ్బంది సన్నద్ధం 

ఎన్నికల కమిషనర్‌తో   కలెక్టర్‌ ముత్యాలరాజు 

(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో పట్టణ స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్టు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెలిపారు. విజయవాడ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ శుక్రవారం 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ముందస్తు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.

 జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థలో 50 డివిజన్‌లు, 8 మునిసిపాలిటీల్లోని 259 వార్డులు ఉన్నాయన్నారు. వీటిలో 7,84,725 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు పదిహేను వందల బ్యాలెట్‌ బాక్సులు అవసరం ఉందని, వీటిలో చిన్నవి ఐదు, మీడియం 638, పెద్దవి 863 కావాల్సి ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం తణుకు మునిసిపాలిటీ మినహాయించి ఏడు మునిసిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థకు సంబంధించిన ఓటర్ల జాబితాలలో మార్పులు, చేర్పులు అనంతరం ఈనెల 3వ తేదీన ప్రకటించినట్టు తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు 83 మంది చొప్పున, ఈవో, అడిషనల్‌ ఈవో, అసిస్టెంట్‌ ఈవోలు నియామకానికి సిద్ధంగా ఉన్నార న్నారు.

ఏలూరు 217, తాడేపల్లిగూడెం 82, నిడదవోలు 35, కొవ్వూరు 41, పాలకొల్లు 74, భీమవరం 117, నరసాపురం 56, జంగారెడ్డిగూడెం 58 మొత్తం 680 పోలింగ్‌ స్టేషన్ల వివరాల జాబితాను ఇప్పటికే ప్రకటించామన్నారు. మైక్రో అబ్జర్వర్లను, పోలింగ్‌ పర్సనల్స్‌ను గుర్తించినట్టు తెలిపారు. అవసరమైన స్టేషనరీ సరఫరా చేసేందుకు గుంటూరులో ఏపీసీఅండ్‌ఎంఏ కార్యాలయానికి ఇండెంట్‌ను పంపినట్టు తెలిపారు. ఎన్నికల నియామవళి అమలుకు మునిసి పాలిటీల వారీగా ఏంసీసీ టీమ్‌లను నియామకం చేపట్ట నున్నట్టు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లకు మునిసిపాలిటీ వారీగా వివరాలను జిల్లా ఎస్పీకి లేఖ రాశామన్నారు.

పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణకు స్థానిక ఇంజనీరింగ్‌ కళాశాలల నుంచి విద్యార్థుల వివరాలను కోరినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. తొలుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించేలా సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికలకు సంబంధించి నిబంధ నలను, మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాలని, కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

Updated Date - 2020-02-08T11:43:12+05:30 IST