కొబ్బరి ‘సూద’ ఆశాజనకం

ABN , First Publish Date - 2020-09-06T09:18:13+05:30 IST

కరోనా కష్టకాలంలో కనిష్టస్థాయికి పడిపోయిన కొబ్బరి సూద మొక్కల ధర ఇప్పుడు ఆశాజనకంగా ఉంది.

కొబ్బరి ‘సూద’ ఆశాజనకం

  • మొక్క ధర రూ.30 
  • ఊపందుకున్న ఎగుమతులు
  • అడ్డ, కుంచంమాను మొక్కలకు స్థానికంగా డిమాండ్‌

పాలకొల్లు/యలమంచిలి, సెప్టెంబరు 5 : కరోనా కష్టకాలంలో కనిష్టస్థాయికి పడిపోయిన కొబ్బరి సూద మొక్కల ధర ఇప్పుడు ఆశాజనకంగా ఉంది. మార్చి నెల తరువాత జూలై మాసాంతం వరకూ సూద ధర రూ.15కు పడిపోగా ఇప్పుడు ఎగుమతులు ఊపందుకోవడంతో మొక్కల నాణ్యతను బట్టి రూ.20-30 ధర పలుకుతోంది. దీంతో కొబ్బరి నర్సరీలను పెంచే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మొలకెత్తే అవకాశం ఉన్న నాణ్యమైన కొబ్బరి కాయలను గ్రేడింగ్‌ చేసి కొబ్బరి సూదకు నిల్వ చేస్తారు. 6 నుంచి 10 నెలల వ్యవధిలో కొబ్బరి సూద మొక్కలు అడుగు నుంచి అడుగున్నర ఎత్తు వరకూ ఎదుగుతాయి.


ఈ మొక్కలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. సూద మొక్కలను వేరు చేసి గజం చొప్పున ఎడంగా నాటడం ద్వారా మరో ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో అడ్డమాను, కుంచంమాను మొక్కలుగా ఎదుగుతాయి.ఈ మొక్కలను జిల్లాలో అధికంగా వినియోగిస్తారు. వీటి ధర రూ.100 నుంచి రూ.200 ఉంటుంది. రైతులు తోటలలో నాటడానికి అడ్డమాను మొక్కలను ఎంపిక చేసుకుంటారు. పంచాయతీ స్థలాలు, రోడ్డు మార్జిన్లు, కాల్వ గట్ల వెంబడి నాటడానికి కుంచం మాను మొక్కలను ఎంపిక చేస్తారు. ఈ మొక్కలు త్వరగా ఎదగడం ద్వారా పశువుల నుంచి కాపాడబడతాయనే ఉద్దేశంతో స్థానికంగా ప్రాధాన్యత ఇస్తారు. రవాణా వ్యయం కలిసి వచ్చే కారణంగా కాయతో ఉన్న చిన్న మొక్కల(సూద)ను దూర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. 


ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు 

మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, అసోం, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఆంధ్రాలోని రాయలసీమ ప్రాంతాలకూ ఎగుమతులు అవుతాయి. లారీకి సూద మొక్కలు 18 నుంచి 22 వేల మొక్కలు ఎగుమతి అవుతాయి. జూన్‌ మాసాంతానికి సీజన్‌ మొదలవుతుంది. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉండడంతో ఆర్డర్లు వస్తాయి. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఎగుమతులు సన్నగిల్లాయి. తూర్పు గోదావరి జిల్లాలో కడియం నర్సరీల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం అడవిపాలెం, కొంతేరు, యలమంచిలి, మేడపాడు ఇంకా పలు లంక గ్రామాలలో కొబ్బరి సూద అధికంగా తయారు చేస్తారు. ఇప్పుడు రైతువారీ కొబ్బరి ధర వెయ్యి కాయలు రూ.10వేల పైబడి ఉండడంతో రానున్న రోజులలో కొబ్బరి సూద ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొబ్బరి సూద తయారు చేసే రైతులు వ్యయం ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. పొలాలకు కౌలు ధరలు పెరగడమే కాకుండా, కూలీ ధరలు, సూదనాటే భూమిలో సేంద్రియ ఎరువులు వినియోగించడానికి సస్య రక్షణకు, మొక్కకు రూ.5 పైబడి ఖర్చు అవుతున్నదని నర్సరీ యజమానులు చెబుతున్నారు. 

Updated Date - 2020-09-06T09:18:13+05:30 IST