వైసీపీలో జిల్లా చిచ్చు

ABN , First Publish Date - 2020-11-22T05:18:20+05:30 IST

నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది.

వైసీపీలో జిల్లా చిచ్చు
నరసాపురం పార్లమెంటరీ మ్యాప్‌

ఎమ్మెల్యేల మధ్య పొసగని సయోధ్య 

భీమవరం కావాలంటూ కొందరి ఒత్తిడి

నరసాపురం అయితే తప్పేంటని సిట్టింగ్‌ల వాదన

సీఎం పేషీకి చేరిన వ్యవహారం

డివిజన్‌ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి 

భీమవరం సంగతి చూడాలంటూ పరోక్ష సంకేతాలు 

(ఏలూరు – ఆంధ్రజ్యోతి) : 

నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయంలో ఎమ్మెల్యేల మధ్య  ఏకా భిప్రాయం కుదరడం లేదు. జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ఉంచాలని కొందరు ప్రతిపాదిస్తుండగా.. ఇంకొందరు నరసాపురం వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాలేవి ఉంటే అవే కొత్త జిల్లా కేంద్రాలు కాబోతున్నాయని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కాని అధికార పక్షం ఎమ్మెల్యేల మధ్య మాత్రం సయోధ్య కుదరడంలేదు. ప్రభుత్వ ప్రకటనలు ఒకవైపు..ఎమ్మెల్యేల వైఖరి ఇంకో రకంగా ఉంది. నరసాపురం బదులుగా అన్ని టికి కేంద్రంగా ఉండే భీమవరంను కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. అయితే దీనిపై నరసాపురం సీనియర్లు ఒకింత మండిపడుతున్నారు.ఒక వైపు నరసాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, ప్రస్తుతం ఉన్న వనరులు వంటి వాటిపై యఽథావిధిగా నివేదిక సిద్ధం చేయగా.. దీనికి సమాంతరంగా భీమవరంలో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నివేదికలు అందించాల్సిందిగా ప్రభుత్వం నుంచి సంకేతాలు అందు తున్నట్టు చెబుతున్నారు. దీనికి అనువుగానే ఇప్పటికే కొన్ని శాఖలకు సంబం ధించి కీలక సమాచారాన్ని కూడా సేకరించగలిగారు. 


ఏలూరులో ప్రశాంతం

జిల్లాలో ఏలూరు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గాలు కొత్త జిల్లాలు కాబోతున్నాయి. ఏలూరు విషయానికొచ్చేసరికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సాధ్యమైనంత మేర ఎక్కడా వివాదాల్లేకుండా పార్టీని ముందుకు నడిపిస్తు న్నారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా పార్టీకి ప్రత్యేకించి జిల్లా కమిటీలు కూడా ఉన్నాయి. ఈ జిల్లా కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుబాబు నిత్యం మంత్రి ఆళ్ళనానితో చేరువగా ఉండడంతో పార్టీప రంగా దాదాపు ఎక్కడా విభేదాలు పొడచూపలేదు. వ్యక్తిగతంగా చిన్నచిన్న తగాదాలు ఉన్నప్పటికీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలోనే సర్దుబాటు చేసుకుంటున్నారు. నరసాపురం వైసీపీ జిల్లా కమిటీలో మాత్రం చాలా కాలంగా కార్యక్రమాలు అమలులోనూ కాస్తంత దూకుడుతనం తగ్గినట్టుగానే కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యేల మధ్య పొత్తు పొసగలేదు. వీరి మధ్య సయోధ్యకు మంత్రి రంగనాథ రాజు చొరవ తీసుకున్నా కొన్నాళ్ల పాటు మాత్రమే స్తబ్ధత నెలకొనడం, ఆ వెనువెంటనే తిరిగి అభిప్రాయభేదాలు కొనసాగడం వైసీపీలో ఆనవాయితీగా మారింది. 


రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా తణుకు..? 

ఇంకోవైపు కొత్త రెవెన్యూ డివిజన్‌ స్థానాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడం.. దీనికి అనువుగా తణుకు పట్టణం సిఫార్సుకు వచ్చింది. భీమవరం పట్టణాన్ని కార్పొరేషన్‌గా మార్చాలనే నేపథ్యంలో ఈ మధ్యనే మరికొన్ని ప్రతిపాదనలు చకచకా కదులుతున్నాయి. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎవరంతటవారుగానే పావులు కదపడం పట్ల పార్టీలోనూ విస్మయం వ్యక్తమవుతుంది.   


Read more