ఇక..కట్టుదిట్టం

ABN , First Publish Date - 2020-03-25T10:39:40+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలపై ప్రజలు మొదటిరోజు లైట్‌గా తీసుకున్నా

ఇక..కట్టుదిట్టం

అప్రమత్తమైన అధికారులు 

అత్యవసరాలకు మాత్రమే అనుమతి 

లాక్‌డౌన్‌ ప్రకటించినా రోడ్లపైకి జనం 

యధేచ్ఛగా తిరిగిన ఆటోలు, కార్లు 


ఏలూరు రూరల్‌, మార్చి 24 : కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలపై ప్రజలు మొదటిరోజు లైట్‌గా తీసుకున్నా రోండోరోజు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రభుత్వం ఆదేశించినా కొంతమంది బయటకు రావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.. సోమవారం ఏదో కారణం చేత జనాలు రోడ్లపైకి వచ్చారు. ఆటోలు  తిరిగాయి. రెండోరోజు మంగళవారం జనసంచారం అక్కడకక్కడా కని పించింది. రెండోరోజూ లాక్‌డౌన్‌ కొనసాగింది. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుకు కఠనంగా వ్యవహ రించింది. పలు రహదారులు, వాహనాలు లేక నిర్మానుష్యంగా మారాయి.


అత్యవసర వాహనాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. నిబంధనలకు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉండాల్సినవారు బయటకు వస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. మంగళవారం పోలీసులు నిషేధాజ్ఞలు పటిష్ఠంగా అమలు చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై చర్యలు తీసుకున్నారు. కొందరికి ఫైన్‌లు విధించారు. 


అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది పావుశాతం మందే విధులకు హాజరయ్యారు. లాక్‌డౌన్‌ సాకుతో మంగళవారం కూరగాయల ధరలను పెంచేశారు.లాక్‌డౌన్‌పై ప్రజల నుంచి మిశ్రమ స్పందనే లభించిందని చెప్పాలి. ఏలూరు నగరంతో పాటు జిల్లాలో షాపులు, దుకాణాలు స్వచ్ఛంధంగా మూసివేశారు. పోలీసులు గస్తీ తిరుగుతున్నా అక్కడకక్కడ దుకాణాలు తెరిచే ఉంచారు. 144 సెక్షన్‌ అమలు చేస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా, మధ్యాహ్నం వరకు జనసంచారం ఉంది. ఆ తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి.


ఉదయం 6 గంటల నుంచి పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. తెరిచి ఉన్న షాపులను మూయించి వేశారు. ప్రధాన రహదారుల వద్ద భారిగేడ్లు ఏర్పాటు చేసి, రాకపోకలను నిలిపివేశారు. ఉదయం 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు, కూర గాయలు, పండ్లు, మెడికల్‌ షాపుల మినహా మిగతా అన్ని దుకాణాలను మూయించారు. ఉదయం నుంచి 11 గంటల వరకు మాత్రమే ఇళ్ళ నుంచి బయటకు వచ్చి వెళ్ళే వారిని పోలీసులు నిలిపివేసి, సరైన సమాధానం చెప్పిన తర్వాతే అనుమతించారు. అలాగే ఆటోలో ఇద్దరికి మించి ప్రయాణిస్తున్న  వారికి పోలీసులు అవగాహన కల్పించారు. వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తుంటే వారిని ఆపి జరిమానా విధించారు. 


ఇళ్లకే పరిమితం

జనతా కర్ఫ్యూ తర్వాత లాక్‌డౌన్‌ మంగళవారం కొనసాగింది. ఉదయం 9 గంటల వరకు నిత్యావసర వస్తువులు తీసుకువెళ్ళడానికి బయటకు వచ్చిన ప్రజలు దాదాపు 10 గంటల తర్వాత దాదాపుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. నగరంలోను, గ్రామాల్లోనూ షాపుల యజమానులు స్వచ్ఛంధంగా మూసి వేశారు. స్వీయ నియంత్రణ పాటించాలని పోలీసులు మైకు ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 


అధిక ధరలకు శానిటైజర్స్‌ విక్రయం 

నగరంలో ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్న ఆనవాళ్ళు కనిపించడం లేదు. హ్యాండ్‌ శానిటేషన్స్‌, మాస్కులు నిర్ణయించిన ధరలకే విక్రయించాలని ప్రభు త్వం ఆదేశించింది. అయితే హ్యాండ్‌ శానిటైజర్‌ 100 ఎంఎల్‌ 90 రూపాయలకు విక్రయిస్తున్నారు. 50 ఎంఎల్‌ 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. 200 ఎంఎల్‌ 100 రూపాయలకే విక్రయించాలి. రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. మాస్కులు కూడా 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. 


Read more