పెరవలి ఎస్‌ఐ లాఠీఛార్జ్ వీడియో వైరల్..!
ABN , First Publish Date - 2020-03-27T22:22:19+05:30 IST
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఖాకీలు వ్యవహరిస్తున్న తీరుపై...
పెరవలి: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఖాకీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్ పాటించని వారిపై లాఠీ ఝళిపిస్తున్న పోలీసులు.. కొన్ని చోట్ల మహిళలపై కూడా బెత్తమెత్తుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి పరిధిలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఉపాధి కోసం విదేశానికి వెళ్లి.. తిరిగి వచ్చాక నోటీసులిచ్చినప్పటికీ క్వారంటైన్‌లో లేడన్న కారణంగా పెరవలి ఎస్‌ఐ ఓ యువకుడిపై లాఠీఛార్జ్ చేశాడు. అసభ్యపదజాలంతో దూషిస్తూ.. అడ్డుపడిన యువకుడి తండ్రిపై కూడా లాఠీ ఝళిపించాడు. అక్కడే ఉన్న ఓ మహిళపై కూడా లాఠీఛార్జ్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఈ వ్యవహారం కాస్తా.. డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి వెళ్లింది. దీంతో.. విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేసిన ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై మరో వాదన తెరపైకి వచ్చింది. ఈ ఘటనపై విచారణకు అడిషనల్ ఎస్‌పి పెరవలికి వెళ్లారని, స్థానికులు పలువురు ఆయనను కలిశారని తెలిసింది. ఎస్‌ఐ తప్పు లేదని, విధి నిర్వహణలో ఆయన బాగా పనిచేస్తున్నారని స్థానికులు అడిషనల్ ఎస్‌పికి చెప్పినట్లు సమాచారం. బాధితులు కూడా తమదే తప్పు అని చెబుతున్నారని, ఎస్సైపై సస్పెన్సన్ ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.