కన్నీళ్లు.. కనిపింఛెన్‌!

ABN , First Publish Date - 2020-03-02T11:27:02+05:30 IST

పింఛన్ల పంపిణీ అక్కడక్కడా కన్నీళ్లు కనిపించాయ్‌.. చాలా మంది ఈ నెల అయినా పింఛన్లు వస్తాయని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. అర్హులమైనా మాకు ఎందుకు రాలేదంటూ పలువురు

కన్నీళ్లు.. కనిపింఛెన్‌!

పెద్దల్లో పెన్షన్‌..టెన్షన్‌

10 వేల మంది అనర్హులు

 అత్యధికులకు కరెంట్‌ షాక్‌

మింగేసిన ఇంటిస్థలం 

మళ్లీ పునఃపరిశీలన

 లబోదిబోమన్న పేదలు

జిల్లా అంతటా ఇదే పరిస్థితి


ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌

పింఛన్ల పంపిణీ అక్కడక్కడా కన్నీళ్లు కనిపించాయ్‌.. చాలా మంది ఈ నెల అయినా పింఛన్లు వస్తాయని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. అర్హులమైనా మాకు ఎందుకు రాలేదంటూ పలువురు వృద్ధులు బోరున విలపించారు. అర్హులందరికీ పింఛను అంటూనే జిల్లాలో పది వేల మందిని వదిలించుకున్నారు.కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు.. ఇప్పటికే పింఛను పొందుతున్నవారి వివరాలను పూర్తిగా సేకరించి వడపోశారు. సాధ్యమైనంత మేర పల్లె,పట్టణం తేడా లేకుండా  తగ్గించారు. చాలా మంది పింఛనుదారులకు కరెంట్‌ బిల్లులు కష్టం తెచ్చిపెట్టాయి.. ఇంకొందరి పింఛన్‌ను కాస్త ఆదాయపు పన్ను మింగేసింది. మరికొందరి పింఛన్లు ఇంటిస్థలాల విస్తీర్ణం కమ్మేసింది. మొత్తంమీద ఆదివారం ఆరంభం నుంచి పింఛన్ల పంపిణీపై ‘ఆంధ్రజ్యోతి’ బృందం పరిశీలించింది. వాస్తవానికి జిల్లాలో పింఛనుదారుల సంఖ్య గతం కంటే పెద్దగా పెరగలేదు.


అందులోనూ అనేకమందిని వడపోశారు.మళ్లీ పింఛను పొందాలంటే మీఅంతట మీరుగా రుజువు చేసుకోండి అంటూ కొత్త పరీక్ష పెట్టారు.ఈ పరీక్షలో దాదాపు 36 వేల మందికి పైగానే నానాపాట్లు పడగా, వీరిలో మూడో వంతు మాత్రం తిరిగి పింఛను దక్కించుకున్నారు. మరో పది వేల మందికి పైగా పింఛనుకు దూరమయ్యారు. ఇంతగా పింఛను దారులను పీడించి, పిప్పుచేసి మరీ జాబితా రూపొందించే నాటికి ప్రభుత్వపరంగా కేవలం పది కోట్లు భారం మాత్రమే పడింది. పింఛన్ల పంపిణీ తీరుపై జిల్లా అంతటా పరిశీలన చేయగా తొలగించిన వారి పేర్లు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ తిరిగి చోటు చేసుకున్నాయి.  


కారు అమ్మేసినా.. పింఛన్‌ రాలేదు..

వికలాంగుడైనా.. కారు ఉందన్న కారణంతో పింఛన్‌ నిలిపివేశారు..  నరసాపురం 3వ వార్డులో నివాసం ఉంటున్న సందీప్‌ వికలాంగుడు..  కన్ను, కాళ్లు వైకల్యం ఉన్నాయి. నాలుగేళ్ల నుంచి దివ్యాంగుల పింఛన్‌ అందుకుంటున్నాడు. అయితే కారు ఉందన్న కారణంతో జనవరి పింఛన్‌ నిలిపివేశారు.దీంతో ఆందోళనకు గురైన తండ్రి.. ఇదెక్కడి ఇబ్బందిరా అనుకుంటూ కారు అమ్మేశాడు. అయితే ఇంకా ఆన్‌లైన్‌లో క్లియర్‌ కాకపోవడంతో పింఛన్‌ అందలేదు. 


ఈమెకు వయసు చాల్లేదట..! 

అధికారులు కళ్లుండీ చూడలేకపోతున్నారు.. ఆధార్‌ ప్రాతిపదికగానే తీసుకుని వృద్ధులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు గూట్ల మరియమ్మ. కాళ్ళ మండలం కోలనపల్లి. ఈమెకు జనవరి నుంచి పింఛన్‌ నిలిపివేశారు. ఎందుకు నిలిపివేశారో తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు.. ఎందుకంటే          ఈమెకు వయసు చాల్లేదట.. కళ్లెదురుగా ఆమె కనిపిస్తున్నా వయసు చాల్లేదనడంతో లబోదిబోమంటుంది. 


ఎందుకో పాపం పింఛన్‌ ఇవ్వడం లేదు.. 

అయ్యో పాపం వృద్ధులు.. ప్రతీ నెలా వచ్చే పింఛన్‌కు ఎదురుచూస్తూనే ఉంటారు.ఈ చిత్రంలో కనిపిస్తున్న తాతయ్యది అదే పరిస్థితి. కాళ్ళ గ్రామానికి చెందిన గంజాల పేరయ్య(69) చాలా కాలంగా ప్రభుత్వ పింఛన్‌ అందుకుం టున్నాడు. అయితే జనవరి నుంచి పింఛన్‌ నిలిపివేశారు. అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా ఫలితం లేకపో యింది. ఏం చేయాలో దిక్కుతోచక.. కనిపించినవారికల్లా పింఛన్‌ రావడంలేదని చెప్పుకుని వాపోతున్నాడు.. 


మొగల్తూరు మండలంలోనే 342 మంది...

రెండో విడత పరిశీలనలోనూ చాలా మంది అర్హులు వివిధ కారణాలతో అనర్హులుగా మిగిలిపోయారు. దీంతో వారు లబోదిబోమం టున్నారు.మొగల్తూరు మండలంలో 742 మందిని అనర్హులుగా గుర్తించగా 342 మంది అనర్హుల జాబితాలోనే ఉన్నారు. పోడూరు మండలంలో తొలిదశలో 337 మంది అనర్హులుగా గుర్తించగా ఇప్పుడు 167 మంది అనర్హులుగా మిగిలారు. నరసాపురం పట్టణంలో 725 మందిని అనర్హులుగా గుర్తించినప్పటికీ  65కు తగ్గింది.నరసాపురం మండలంలో 330 మందిని అనర్హులుగా గుర్తించగా 70కు తగ్గింది. పాలకొల్లు పట్టణంలో మొదటి దశలో 715 మందిని అనర్హులుగా గుర్తించగా 160 మంది  అనర్హులుగా మిగిలారు.


పాలకొల్లు మండలంలో 429 మందికి 43 మంది, యలమంచిలి మండలంలో 545 మందికి 50 మంది, పెనుమంట్ర మండలంలో తొలిదశ 309 మందిని అనర్హులుగా గుర్తించగా 105 మందికి తగ్గింది. మొత్తంగా అనర్హుల జాబితా గణనీయంగా తగ్గడంతో ఫించన్‌లబ్ధిదార్లలో ఆనందం వెల్లివిరిసింది.


ఏలూరులో 200 మంది అనర్హులు...

అన్ని అర్హతలు ఉన్నాయి, కనీసం ఆధారం లేకుండా పింఛన్లు తొలగించారు. పరిశీలనలో కొందరు అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, కనీస పర్యవేక్షణ కొరవడడంతో  చాలా మంది లబ్ధిదారులకు పింఛన్లు అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో సచివాలయం చుట్టూ వృద్ధులు, ఇతర లబ్ధిదారులు ప్రదక్షణలు చేస్తున్నారు.ఏలూరు మండలంలో  సుమారు 13 వేల 856 మంది పింఛన్లు పొందుతుండంగా వీరిలో సుమారు 1108 పింఛన్లను పరిశీలన పేరుతో పెండింగ్‌లో పెట్టారు.900 మందిని అర్హులుగా తేల్చగా 200 మందికి పైగా పింఛన్‌ అందలేదు. ఆదాయపు పన్ను చెల్లించకున్నా, అధికంగా భూమి ఉన్నట్టు, వాహనం కలిగి ఉన్నట్టు పలు రకాల కారణాలతో నిలిపివేశారు. పరిశీలన సమయంలో గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది  హడావుడిగా వివరాలు అప్‌లోడ్‌ చేయడంలో పొరపాట్లు, అధికారుల పర్యవేక్ష సక్రమంగా లేకపోవడంతో ప్రస్తుతం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది.

Updated Date - 2020-03-02T11:27:02+05:30 IST