బతికుండగానే.. చంపేశారు !
ABN , First Publish Date - 2020-12-01T05:54:44+05:30 IST
ఆమె పేరు మల్లెంపల్లి సతీ సక్కుబాయి. వయసు 66 ఏళ్లు.

మూడు నెలలుగా పింఛన్ ఆపేశారు
వెల్ఫేర్ అసిస్టెంట్ నిర్వాకం.. వృద్ధురాలి ఆవేదన
విచారణ నిర్వహిస్తామన్న ఎంపీడీవో
కామవరపుకోట, నవంబరు 30 : ఆమె పేరు మల్లెంపల్లి సతీ సక్కుబాయి. వయసు 66 ఏళ్లు. ఊరు కామవరపుకోట మండలం సాగిపాడు. కొన్నేళ్లుగా వితంతు పింఛన్ పొందుతున్న ఆమెకు అక్టోబరు నుంచి ఆగిపోయింది. కారణం ఏమిటంటే సెప్టెంబరు 25న ఆమె చనిపోయినట్లు సంబంధిత వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు ఎంపీడీవో పద్మినికి నివేదించినట్టు చెబుతున్న లేఖ సోమవారం బయటపడింది. దీనిపై బాధితురాలు తాను బ్రతికే వున్నానని, తనకు పింఛన్ తిరిగి ఇప్పించాల్సిందిగా అధికారులను కోరుతున్నారు. లేఖలో ‘సతీ సక్కుబాయికి అక్టోబరు నుంచి పింఛన్ రావడం లేదు. ఆ నెల వేలిముద్రలు పడని కారణంగాను, నవంబరులో వెల్ఫేర్ అసిస్టెంటు, వలంటరీ లాగిన్‌లోకి రాకపోవడం వల్ల, డిసెంబరులోనూ పింఛన్ మంజూరు కాలేదు. అధికారులను సంప్రదించగా సెప్టెంబరు 25న పింఛనుదారు చనిపోయినట్లు నమోదైందని చెప్పారు. కావున సక్కుభాయి ఐ.డి నెంబరు 1055 0 4540 పింఛన్ రోల్ బ్యాక్ చేయాలి’ అని కోరినట్టు ఉంది. దీనిపై సక్కుబాయి తీవ్ర ఆవేదన చెంది అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. కామవరపుకోట ఎంపీడీవో డీవీఎస్ పద్మినిని వివరణ కోరగా ఈ ఘటనపై విచారణ నిర్వహించి, డిసెంబరు నెల నుంచి పింఛను వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. వెల్ఫేర్ అసిస్టెంట్‌ను వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.