ఆంధ్రజ్యోతి పాలకొల్లు రిపోర్టర్‌ శ్రీనివాస్‌పై దాడి

ABN , First Publish Date - 2020-07-14T16:45:45+05:30 IST

ఇళ్ల పట్టాలలో జరిగిన అవక తవకలను వెలికి తీసేందుకు వివరాలు సేకరిస్తున్న..

ఆంధ్రజ్యోతి పాలకొల్లు రిపోర్టర్‌ శ్రీనివాస్‌పై దాడి

ఇళ్ల పట్టాల అవకతవకలను వెలికి తీస్తే  చంపేస్తామంటూ బెదిరింపులు


పాలకొల్లు(పశ్చిమ గోదావరి): ఇళ్ల పట్టాలలో జరిగిన అవక తవకలను వెలికి తీసేందుకు వివరాలు సేకరిస్తున్న పాలకొల్లు ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ ముత్యాల శ్రీనివాస్‌పై కొందరు వ్యక్తులు దాడిచేశారు. ఈ ఘటన జిల్లాలో సోమవారం తీవ్ర కలకలం సృష్టించింది. మాజీ కౌన్సిలర్‌ భర్త పొట్నూరి అప్పల నర్సయ్య (అప్పన్న), అతని సమీప బంధువు పొట్నూరి లక్ష్మీ శ్రీనివాస్‌ హనుమాన్‌ కాలనీలో నిర్మాణంలో వున్న అపార్ట్‌ మెంట్‌ వద్ద ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీనివాస్‌ కుమారుడు ప్రదీప్‌ శ్రీవాత్సవ అదే అపార్ట్‌మెంట్‌ లోని తమ ప్లాట్‌ వద్దకు వెళుతుండగా.. వీరిద్దరూ అతనిని ఆపి దుర్భాషలాడుతూ గాయపరిచారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌ అక్కడకు చేరుకోగానే.. వారిద్దరూ ‘ఇళ్ల పట్టాల విషయంలో విజిలెన్స్‌ అధికారులే ఏం చేయలేకపోయారు. నువ్వెంత..’ అంటూ శ్రీనివాస్‌ను దుర్బాషలాడుతూ ఇటుకలతో దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారు.


సమీపంలో వున్న ప్రజలు దీనిని గమనించి అక్కడకు రావడంతో నిందితులు ఇద్దరూ పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం పాలకొల్లు ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పట్టణ సీఐ  ఆంజనేయులు ఆసుపత్రికి వచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ యడ్ల తాతాజీ ఆసుపత్రికి వచ్చి శ్రీనివాస్‌ను పరామర్శించారు. దాడిని ఏపీడబ్ల్యూజే జిల్లా శాఖ ప్రతి నిధులు, జనసేన, టీడీపీ, వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. 


Updated Date - 2020-07-14T16:45:45+05:30 IST