ధాన్యానికి మొలకలు

ABN , First Publish Date - 2020-12-02T05:01:53+05:30 IST

కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం నివర్‌ తుఫాన్‌ వల్ల తడిచి మొలకలు వచ్చాయి.

ధాన్యానికి మొలకలు
పాలగూడెంలో వాలిన వరి పొలాన్ని పరిశీలిస్తున్న ఎంఏవో కుసుమ

 ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు

 సాయం కోసం చెయ్యి చాస్తున్న అన్నదాత 

ఏలూరు రూరల్‌, డిసెంబరు 1 : కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం నివర్‌ తుఫాన్‌ వల్ల తడిచి మొలకలు వచ్చాయి. అన్నదాతను నివర్‌ కోలుకోలేని దెబ్బతీసింది. మండలంలోని చొదిమెళ్ళ, పాలగూడెం ప్రాంతాల్లోని పొలాల్లో పనలు ఇప్పటికీ నీళ్ళల్లోనే ఉన్నాయి. ఆదివారం నుంచి ఎండ రావడంతో పనలను తిరగేసిన రైతులు మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూసి కుదేలయ్యారు. పట్టాలు కప్పి ఉంచిన ధాన్యం అడుగున చెమ్మ వల్ల మొలకలు వచ్చాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో 16 వేల హెక్టార్లు వరిసాగు చేయగా, 80 శాతం వరకూ వివిధ దశల్లో పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు నివర్‌ తీరని నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షంతో పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. చేతికి వచ్చిన వరి పంట నీటి పాలైంది. గింజ మొలకెత్తకుండా ఉంచడానికి ఉప్పునీటి ద్రావణం చల్లారు. గింజ గట్టిపడి కోతకు వచ్చిన పొలాల్లో వరి పైరు గాలులకు వరిగిపోయి మోకాలు లోతునీటిలో మునిగిపోయింది. వరి దుబ్బులను పైకి లేపి రైతులు నిలబెట్టారు. వరి పనలు నీటిలో ఉండడం వల్ల ధాన్యం రంగు మారడంతోపాటు మొలకలు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరు మండలంలోని మల్కాపురం, కొమడవోలు, జాలిపూడి, మాదేపల్లి, చాటపర్రు, పోణంగి, వెంకటాపురం గ్రామాల్లో నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన పంట పొలాలను వ్యవసాయ శాఖ, రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు. సుమారు 858 హెక్టార్లలో పంట వాలిపోవడాన్ని గుర్తించారు. మరో 84 హెక్టార్లలో పనల మీద ఉన్న వరి తడిచిపోయిందని ఎంఏవో కుసుమ తెలిపారు. రైతులు త్వరితగతిన నీటిని పంపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పనలమీద 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. స్వర్ణ ఎంటీయూ 7029 రకం 90 శాతం మేర పడిపోయిందన్నారు. 




Updated Date - 2020-12-02T05:01:53+05:30 IST