సబ్సిడీ ఉల్లి ఎక్కడ...?

ABN , First Publish Date - 2020-11-26T05:01:12+05:30 IST

ఉల్లిపాయలు రెండు నెలలుగా కన్నీరు పెట్టిస్తున్నాయి. సబ్సిడీ ఉల్లి పాయల జాడ కన్పించడం లేదు.

సబ్సిడీ ఉల్లి ఎక్కడ...?

రైతు బజార్లల్లో అందిస్తామంటూ ప్రభుత్వం హామీలు

రెండు నెలల్లో కేవలం 80 టన్నులు సరఫరా

ఆవేదన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు


ఏలూరు ఫైర్‌స్టేషన్‌, నవంబరు 25 : ఉల్లిపాయలు రెండు నెలలుగా కన్నీరు పెట్టిస్తున్నాయి. సబ్సిడీ ఉల్లి పాయల జాడ కన్పించడం లేదు. సెప్టెంబరు మొదటిలో రూ.20 లోపు ఉన్న ఉల్లి పాయలు నెలాఖరుకు వచ్చే సరికి రూ.70లకు చేరుకున్నాయి. ఒకానొకదశలో కేజీ రూ. 100పైనే అమ్మారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.70లకు అమ్ముతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఉల్లిపాయ లను అందిస్తామంటూ ఆర్భాటం చేయడమే తప్ప ఆ మేరకు చర్యలు మాత్రం శూన్యమంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ రెండు నెలల్లో కేవలం 80 టన్నులు మాత్రమే  అరకొర సబ్సిడీతో రైతు బజార్లలో ఉల్లిపాయలు సరఫరా చేశారు. అది కూడా కేజీ రూ.40లు అమ్మారు. ఏలూరు, పత్తేబాద, వన్‌టౌన్‌ రైతు బజార్లల్లో, కొవ్వూరు రైతు బజార్లో మూడు చోట్ల మాత్రమే సబ్సిడీతో ఉల్లిపాయలు అందిం చారు. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా సబ్సిడీ ఉల్లిపాయలు అందించిన దాఖ లాలు లేవు. భవిష్యత్తులోనూ ఎక్కడ సబ్సిడీ ఉల్లిపాయలు ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంక ఎంతకాలం ఉల్లిపాయల రేట్లతో ఇబ్బంది పడాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల రేటును తగ్గించే విధంగా వ్యాపారులపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో సబ్సిడీకైనా ఉల్లిపాయలు అందించాలని కోరుతున్నారు. 


సబ్సిడీ ఉల్లిపాయల సరఫరా  లేనట్టే..

మహేంద్రనాథ్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మార్కెటింగ్‌ శాఖ

జిల్లాలో ఇప్పటికే 80 టన్నుల ఉల్లిపాయలు కేజీ రూ.40లతో సబ్సిడీతో సరఫరా చేశాం. రానున్న రోజుల్లో ఉల్లిపాయల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈక్రమంలో ప్రభుత్వం సబ్సిడీ ఉల్లి పాయలను సరఫరా చేసే పరిస్థితి లేదు. 

Updated Date - 2020-11-26T05:01:12+05:30 IST