‘పెద్ద’ దెబ్బ

ABN , First Publish Date - 2020-11-07T05:30:00+05:30 IST

పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక రంగానికి మొదలైన పెద్ద కష్టాలు గట్టెక్కడానికి అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి.

‘పెద్ద’ దెబ్బ

 పెద్ద నోట్లు రద్దయి నేటికి నాలుగేళ్లు

కుదేలైన ఆర్థిక రంగం 

 కరోనాతో ఆర్థిక వృద్ధి వెనక్కి

కోలుకోని రియల్‌ ఎస్టేట్‌

పాలకొల్లు, నవంబరు 7 : పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక రంగానికి మొదలైన పెద్ద కష్టాలు గట్టెక్కడానికి అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. నోట్లరద్దు అనంతరం జిల్లాలోని అన్ని రంగాల్లోనూ ఆర్థిక లావాదేవీలకు నష్టం వాటిల్లడంతో ఆయా రంగాలు తిరోగమనాన్ని పట్టాయి. క్రమేపీ ఆర్థిక రంగం పుంజు కుం టుందనే సమయానికి మరో కష్టం వచ్చి పడుతోంది. నోట్ల రద్దు అనంతరం విఫణిలో నగదు చెలామణికి కొరత ఏర్పడి... కొద్డికొద్దిగా తేరుకుం టున్న సమయంలో జీఎస్టీ పిడుగు పడింది. ఈ రెండింటికీ జనం అలవాటు పడుతున్న సమయంలో సార్వత్రిక ఎన్నికలు..  ఆ తర్వాత కరోనా వచ్చిపడింది. మొత్తంగా నాలుగేళ్లగా జిల్లా          ప్రజలు ఆర్థిక నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. 

నాలుగేళ్లుగా కలిసిరాని కాలం..

 పెద్దనోట్ల రద్దుకు ముందు జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఒక వెలుగు వెలిగింది. స్థలంపై పెట్టుబడి పెడితే ఏడాదికి 24 –36 శాతం వడ్డీని పొందిన మదుపుదారులు రెచ్చిపోయి స్థలాలు కొన్నారు. జిల్లాలో ఏడాదికి 1000 ఎకరా లకు పైగా లే అవుట్లు వేసేవారు. ప్రస్తుత నాలుగేళ్లలోనూ కలిపి వెయ్యి ఎక రాల్లో లే అవుట్లు వేసిన దాఖలాలు లేవు. నోట్ల రద్దుకు ముందు ఉన్న ధరలే ఇప్పుడూ కొనసాగుతున్నాయి.పదుల సంఖ్యలో రియల్టర్లు బోర్డులు తిప్పేయగా.. స్థలాలు కొని అమ్మే డీలర్లు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. జిల్లాలో సాలీనా 2 వేల వ్యక్తిగత భవనాలు, అపార్టుమెంట్లలో ప్లాట్లు సుమారు 1000 అమ్మకాలు జరిగేవి. నాలుగేళ్ళుగా నిర్మాణాలు కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ బిల్డర్లు గతంలో నిర్మించిన అపార్టమెంట్లలో ప్లాట్లను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం రెండు లక్షల పైబడి బ్యాంకుల్లో డిపాజిట్‌ వేస్తే లెక్కలు చెప్పాల్సి వస్తుందనే భయంతో వేలాది మంది స్థలాలపై పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు స్థలాలు అమ్మితే పావలా వడ్డీ సైతం రావడం లేదు.దీంతో చాలా మంది నష్టాలకు అమ్ముకుంటున్నారు. చాలా వరకూ వ్యాపా రాలు పడిపోయాయి.ప్రధాన పట్టణాల్లో వేల రూపాయల అద్దె చెల్లించే షాపులు ఇప్పుడు మూత పడ్డాయి.  

 తీరని ఆర్థిక ఇబ్బందులు

నోట్ల రద్దు అనంతరం జీఎస్టీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఏర్పడిన కొత్త విధానాల వల్ల ప్రజలు, వ్యాపారులకు సమస్యలు ఎదురయ్యాయి.కరోనా కారణ ంగా వ్యాపారాలు మూత పడడంతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి.

 పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ,ఆడిటర్‌, పాలకొల్లు 


నిర్మాణ రంగం కుదేలు..

ఇసుక కొరతతో పాటు కరోనా నేపథ్యం, కూలీల కొరత తెచ్చి పెట్టింది. దీంతో భవన నిర్మాణ రంగం అడుగు ముందుకు వేయలేక కుదేలైంది. నిర్మాణ రంగంలో పెట్టుబడులకు నాలుగేళ్లగా వడ్డీలు రాక, అమ్మకాలు కొనుగోళ్లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

  ఆరిమిల్లి వీరాస్వామి, బిల్డర్‌, పాలకొల్లు

Updated Date - 2020-11-07T05:30:00+05:30 IST