నీటి పరీక్షలు నిల్‌

ABN , First Publish Date - 2020-12-12T05:22:41+05:30 IST

ప్రజల ఆరోగ్యం అధికారులకు పట్టడం లేదు. రక్షిత మంచినీటి పథకా లపై కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ప్రజలకు గుక్కెడు స్వచ్ఛమైన నీటిని ఇవ్వలేకపోతున్నారు.

నీటి పరీక్షలు నిల్‌
కోమటి లంకలో పంచాయతీ సరఫరా చేస్తున్న నీరు

గ్రామాల్లో నీటి పరీక్షలు చేయకుండానే తాగునీటి సరఫరా 

ఏళ్ల తరబడి శుభ్రతకు నోచుకోని రక్షిత నీటి పథకాలు 

పర్యవేక్షణ మరిచిన యంత్రాంగం 

 ఆందోళనలో అయా గ్రామస్థులు


ఏలూరు రూరల్‌, డిసెంబరు 11 : ప్రజల ఆరోగ్యం అధికారులకు పట్టడం లేదు. రక్షిత మంచినీటి పథకా లపై కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ప్రజలకు గుక్కెడు స్వచ్ఛమైన నీటిని ఇవ్వలేకపోతున్నారు. ఓ పక్క ఏలూరు లో నీటి కాలుష్యంతో నగర ప్రజలు అంతుపట్టని వ్యాధి బారినపడి ఆస్పత్రి పాలయ్యారు. కలుషిత జలాలతో మండల ప్రజలు రోగాల బారిన పడుతున్నా సమస్య పరిష్కారానికి ఎటు వంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొన్నేళ్లుగా మండలంలోని పలుగ్రామాల్లో కలుషిత నీటితో వ్యాధులు ప్రబలుతూనే ఉన్నా యి. ఈ పరిస్థితికి పారిశుధ్య లోపం, దోమల ఉధృతి ఓ కారణమైతే కలుషిత నీరు తాగడం మరో కారణం. ప్రజలకు అందించే నీటిని క్లోరినేషన్‌ చేయక పోవడం, ట్యాంకర్లను శుభ్రం చేయకపోవడంతో చాలా గ్రామాల్లో కలుషిత నీరే ఆధారమవుతోంది. మండలంలోని కొల్లేరు గ్రామాల్లో అయితే పసరనీరే తాగునీరు అయింది. కనీసం ఆ నీటితో వంట కూడా చేయడానికి వీలుపడదు. దీంతో డబ్బులు వెచ్చించి మినరల్‌ వాటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. 


నిధులు ఫుల్‌.. పర్యవేక్షణ నిల్‌..

రక్షిత మంచినీటి పథకాలపై కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ట్యాంకుల శుభ్రత, నీటి శుద్ధి ప్రక్రియ, తాగునీటి సరఫరా వంటి అంశాలను ఏ శాఖ పట్టించుకోవడం లేదు. పంచాయతీ రాజ్‌, జడ్పీ అధి కారులు తమ వంతు నిధులను విడుదల చేసి తమ పని అంతవరకే అని చేతులు దులుపుకుంటు న్నారే తప్ప వెచ్చించిన నిధులు ఎంత మేర సద్వినియోగం అయ్యాయనేది పట్టించుకోకపోవడం గమనార్హం. . 


  చేయాల్సింది ఇది..

గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న సదుద్దేశ్యంతో పంచాయతీ లకు నీటి పరీక్షలకు రూ. ఐదు వేలు ఖర్చు చేసి ప్రతి పంచాయతీకి ఒక కిట్‌ ను అందజేశారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి. ప్రతి పది వేల లీటర్ల నీటిలో 45 గ్రాముల బ్లీచింగ్‌ పౌడర్‌ను కలపాలి, ప్రతి రోజు క్లోరినేషన్‌ చేయాలి. శుభ్రం చేసిన తేదీలను ట్యాంకుల వద్ద ఏర్పాటు చేసిన బోర్డులపై నమోదు చేయాలి. ఈ విషయా లను గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు పర్యవేక్షించాలి. కాని ఇవేమీ ఆచరణలో కన్పించడం లేదు. ఇందుకు ఉదాహరణకు కొల్లేరు గ్రామమైన కోమటిలంకలో ఓవర్‌ హెడ్‌ ట్యాంకులో నాచుపట్టిన దుస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకును శుభ్రం చేసిన దాఖలాలు లేవు. విడుదల చేసిన నీరు పచ్చని రంగు ఉన్నా నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


  ట్యాంకులు శుభ్రం చేయిస్తున్నాం : ఎంపీడీవో మనోజ్‌ 


ఏలూరులో అంతుపట్టనివ్యాధి వెలుగు చూసిన రోజు నుంచి మండలంలో ఉన్న ప్రతి ఓవర్‌ హెడ్‌ ట్యాంకును బ్లీచింగ్‌ వేయించి ట్యాంకును శుభ్రం చేయిస్తున్నాం. నీటి పరీక్షలను చేయించాం. అన్ని గ్రామాల్లో రిపోర్టు బాగానే ఉన్నాయని అందింది. పరిశుభ్రమైన నీటినే అందించేందుకు చర్యలు చేపట్టాం. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఓవర్‌హెడ్‌ ట్యాంకులు శుభ్రం చేసేలా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. 

Updated Date - 2020-12-12T05:22:41+05:30 IST